శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (10:41 IST)

ఒక్క సీసా సందేశం...! వందేళ్ళకుపైగా ప్రయాణం..!! సందేశంలో ఏముంది?

ఎప్పుడో విసిరేసిన ఆ సీసా సముద్రాలు పట్టుకు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు 110 యేళ్ళు ప్రయాణం చేసింది. చివరకు జర్మనీలోని అమ్రమ్ ద్వీపం చేరింది. అది ఆషామాషీ సీసా కాదు. అది ఓ సందేశాన్ని కూడా తీసుకు వచ్చింది. ఆ సందేశాన్ని చిరునామాకు చేర్చిన వారికి బహుమతిని కూడా తెచ్చిపెట్టింది. ఎంతో తెలుసా..! 63 పైసలు.. ఇంతకీ ఆ సీసా సందేశంలో ఏముంది..? ఎవరికి దొరికింది..? 
 
జర్మనీకి చెందిన అమ్రమ్ ద్వీపంలోని పోస్టల్ శాఖలో పనిచేస్తున్న మరియన్నే వింక్లర్ అనే మహిళ సెలవు రోజున సముద్ర తీరం వెంట సేదదీరుతోంది. ఆమెకు అక్కడ నీటిలో తేలియాడుతూ ఓ సీసా కనిపించింది. అది ఆసక్తికరంగా అనిపించింది. దీని వెనుక ఏదో తెలియని కథ ఉండే ఉంటుందని మహిళ గెస్ చేసింది. వెంటనే దాన్ని తీసుకున్న ఇంటికెళ్లి పరీక్షగా చూసింది. 
 
సీసాలో ఉన్న పేపర్‌పై ‘బ్రేక్’ అనే సందేశాన్ని అనుసరించి వింక్లర్ దంపతులు సీసాను బద్దలు కొట్టారు. ఇంగ్లీష్, జర్మన్, డచ్ భాషల్లో సందేశం రాసి ఉన్న కాగితం ముక్క అందులో నుంచి బయటపడింది. ఈ సీసా దొరికిన వారు తమ పూర్తి చిరునామా రాస్తూ, సీసా ఎక్కడ దొరికిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఫ్లై మౌత్‌లోని బయాలాజికల్ అసోసియేషన్‌కు పంపగలరని అందులో రాసి ఉంది. అలా పంపిన వారికి ఒక షిల్లాంగ్ బహుమతి ఇస్తామని కూడా అందులో ప్రకటించారు. అంటే భారతీయ కరెన్సీలో 63 పైసలు. 
 
షిల్లాంగ్ కోసం కాకపోయినా దాని విషయమేందో తెలుసుకోవడానికి వింక్లర్ దంపతులు తమ అడ్రెస్ రాసి దానిని అందులో రాసి ఉన్న చిరునామాకు పంపారు. దీనిని అసోసియేషన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గై బేకర్ అందుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ సీసా తమ కంపెనీదే అని, 1902-04 మధ్య తమ సంస్థ వారే ఈ సీసాను సముద్రంలో విసిరేసి ఉంటారని చెప్పారు. అందులో రాసి ఉన్నట్లుగానే వింక్లర్ దంపతులకు ఆయన ఒక షిల్లాంగ్ బహుమానాన్ని అందజేశారు. అయితే సముద్రంలో నీటి ప్రవాహాన్ని కనుగొనడానికి ఇలా చేశామని ఆ సీసా సందేశంలో చెబుతున్నప్పటికీ... సీసా ఆంత్యరమేదో ఉండే ఉంటుందని భావిస్తున్నారు.  ఏమిటి..? ఎందుకు అలా చేశారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే..