గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By IVR
Last Updated : మంగళవారం, 10 జూన్ 2014 (19:35 IST)

జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నా... మహేష్ బాబు అడిగాడు... నాగార్జున

అద్భుతాలు అనుకుంటే జరగవు. అనుకున్న పనిని మనస్ఫూర్తిగా చేస్తేనే జరుగుతాయి. అక్కినేని కుటుంబం మనస్పూర్తిగా చేసిన ప్రయత్నమే 'మనం' సినిమా. విడుదలైన రోజు నుండి సినిమాకొస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అమ్మా నాన్న మా మధ్య లేకపోవడం సక్సెస్‌ని కంప్లీట్‌గా ఎంజాయ్‌ చేయలేకపోతున్నాం. కానీ ప్రేక్షకులకి మంచి సినిమాను ఇచ్చామనే సంతృప్తి మాత్రం పూర్తిస్థాయిలో మాకుంది అని అక్కినేని నాగార్జున అన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని త్రయం నటించిన 'మనం' చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తయ్యింది. నేటికి కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సినిమా సక్సెస్‌ పట్ల నాగార్జున  మాట్లాడారు. 
 
స్క్రిప్ట్‌ విషయంలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 
గ్రీకువీరుడు, భాయ్‌ చిత్రాల పరాజయంతో నా జడ్జిమెంట్‌ తప్పవుతుందని 'మనం స్క్రిప్ట్‌ విషయంలో నాన్నని అడ్వైజ్‌ అడిగాను. కథ అందరం విన్నాం. మంచి కథ. అందరికీ నచ్చింది. కానీ కాంప్లికేటెడ్‌ స్టోరి. దీన్ని చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా చెబితే డెఫినెట్‌గా పెద్ద హిట్టవుతుంది అని నాన్న నాకు భరోసా ఇచ్చారు. అలాగే స్క్రిప్ట్‌ విషయంలో కొన్ని సలహాలు కూడా తెలిపారు. నాన్న మాటలు విన్నాక చాలా ధైర్యం వచ్చింది. దాంతో 6 నెలలు కథపై వర్క్‌ చేసి నమ్మకంగా ముందుకిసాగాం. నేడు ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్‌ తరువాత నెత్తి మీద బండ రాయి తీసినంత ఫ్రీగా ఉంది. 
 
ముగ్గురు కలిసి నటించే సీన్‌ ఎలా తయారయింది? 
సినిమాలో తాత-మనవడు క్యారెక్టర్లు ఉన్నాయంటే డెఫినెట్‌గా కామెడీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అదొక సక్సెస్‌ఫుల్‌ ఫార్ములా అని కూడా అనొచ్చు. ఈ సినిమాలో నాన్నకి, చైతన్యకి మధ్య చక్కని సన్నివేశాలున్నాయి. అవన్నీ స్పెషల్‌గా రాసినవి. ముసలోడా అనే డైలాగ్‌ చెప్పడానికి చైతూ చాలా ఇబ్బంది పడ్డాడు. నాన్నే అతనికి ధైర్యం చెప్పారు. మనం నాన్నకే కాదు నాకు, చైతన్య కెరియర్‌కి కూడా గొప్ప క్లాసిక్‌ సినిమా అని చెప్పొచ్చు. మా అందరికీ మైలు రాయిలాంటిదీ సినిమా. 
 
అక్కినేని గారికి కానుక అని చెప్పవచ్చా? 
లేదండి. ఈ మాటే చాలామంది అంటున్నారు. రివ్యూలో కూడా రాశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాన్నగారు మంచి కానుక ఇచ్చి వెళ్ళారని అంటున్నారు. నిజంగానే నాన్న ఇచ్చిన గొప్ప కానుక ఇది. ఇందులో మేం చేసింది ఏమిలేదు. మా అందరి కెరియర్‌లో బెస్ట్‌ క్లాసిక్‌ ఫిలింగా నిలిచిపోయింది. 
 
అక్కినేనిగారు డబ్బింగ్‌ పూర్తిగా చెప్పారా? 
మొదట్లో డల్‌గా ఉంది. కొద్దిరోజులు బాగోలేదని ఆపాం. కానీ ఆ తర్వాత నాన్నగారే చెబుతానని ముందుకువచ్చారు. అందుకే మనం సినిమా మొదటి ట్రైలర్‌ను నాన్నగారి మాటలతో కట్‌ చేయించి డిస్ట్రిబ్యూటర్లుకు చూపించాను. అందులో ఆయన గొంతు కాస్త తొణికినట్టు అనిపించడంతో ఆ డిస్ట్రిబ్యూటర్లు. ఆ వాయిస్‌ వద్దు వేరే డబ్బింగ్‌ చెప్పించండి అన్నారు. నాకు వాళ్ళను చెప్పతో కొట్టాలనిపించింది. కానీ ఏమి చేయలేని పరిస్థితి. నాన్నగారి వాయిస్‌ వినగానే థియేటర్‌లో చప్పట్లు మ్రోగాయి. ఆయన కూడా వేరే మిమిక్రి ఆర్టిస్ట్‌తో డబ్బింగ్‌ చెప్పించడానికి ఒప్పుకోలేదు. మేం ఆయన చెప్పలేరు అనుకుని నలుగురు మిమిక్రి ఆర్టిస్ట్‌లను కూడా పిలిచాం. 70 ఏళ్ళుగా వింటున్న వాయిస్‌ని వేరే వాళ్ళతో చెప్పిస్తే జనాలు అంగీకరించరని తెలుసు. అదృష్టవశాత్తు విల్‌ పవర్‌ తెచ్చుకుని నాన్నగారే మూడు రోజుల్లో డబ్బింగ్‌ పూర్తి చేశారు. 
 
కలెక్షన్లు కోట్ల క్లబ్‌కు చేరినట్లు వార్తలు వస్తున్నాయి? 
నాన్న చివరి సినిమా చిరకాలం గుర్తిండిపోవాలని కమర్షియల్‌ ఆలోచన లేకుండా తీశాం. ఈ రోజుకి కూడా సినిమా ఎంత కలెక్ట్‌ చేసిందనేది పట్టించుకోలేదు. 30, 40, 50 కోట్ల క్లబ్‌ అనే మాటలు నాకు నచ్చవు. మంచి సినిమా అయితే తప్పకుండా ఆడుతుంది. ప్రేమాభిషేకం ఈ రోజుల్లో వచ్చుంటే 100 కోట్లు కలెక్ట్‌ చేసేది. తెలుగు సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరితే అందరికీ ఆనందమే. రానున్న కాలంలో తెలుగు సినిమా డెఫినెట్‌గా 100 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. కానీ  కోట్ల క్లబ్‌లో కలిపి మా సినిమాని తక్కువ చెయ్యొద్దు. 
 
కమల్‌హాసన్‌ చూసి ఎలా స్పందించారు? 
కమల్‌హాసన్‌గారికి నాన్నతో మంచి ఎటాచ్‌మెంట్‌ ఉంది. ఆయన ఈ సినిమా చూసి నాకు అర్థరాత్రి కాల్‌ చేశారు. గంటపాటు మాట్లాడారు. చక్కని సినిమా చేశారు, నాన్నగారికి గొప్ప ట్రిబ్యూట్‌ ఇది అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌గారు కూడా. ఆయన పాత్ర ముందు అనుకోలేదు. సినిమా మొత్తం పూర్తయ్యాక ఆయన కూడా ఇందులో ఉంటే బావుంటుందని ఐడియా వచ్చి అడిగాం. కాదనకుండా యాక్ట్‌ చేశారు. అసలు ఆయన్ని ఈ సినిమాలో పెట్టాలని ముందు అనుకుంటే నాన్నగారితో కొన్ని సీన్స్‌ కూడా పెట్టేవాణ్ణి. 
 
మీరు పునర్జన్మని నమ్ముతారా? 
నేను పునర్జన్మని నమ్ముతాను. నాన్నగారి మూగమనసులు చూశాక అలాంటి సినిమా చేయాలనిపించింది. అందుకే పట్టుబట్టి రాఘవేంద్రరావుగారితో జానకిరాముడు సినిమా చేశాను. అలాగే ఇప్పుడు మనం చేశాను. 
 
'అసలు మనం' కథకు స్పూర్తి ఏమిటి? 
దర్శకుడు విక్రమ్‌కి ఫ్లైట్‌లో ప్రయాణిస్తుండగా ఓ సంఘటన జరిగిందట. విమానంలో తన ప్రక్కన కూర్చున్న వ్యక్తి తన అన్నలాగా అనిపించాడట. అక్కడ ఈ కథకి పునాది పడిందని నాతో చెప్పాడు. ఏమైనాగానీ చక్కని కథని సినిమాగా మలిచి మా మదిని దోచుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ ప్రతి ఒక్కరికీ సమానంగా దక్కుతుంది. ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ కాదు. 
 
మరి దర్శకుడు ఎప్పుడూ బయట రాకపోవడానికి కారణం?
ఆయనకు సిగ్గు. మేమే చాలాసార్లు పిలిచాం.. నేను రానని అనేవాడు. గత సినిమాల్లో కూడా ఆయన మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు.
 
అఖిల్‌ చిన్నవేషమైనా ఒక్కసారిగా మహేష్‌తో పోలుస్తున్నారు? దీనిపై మీ స్పందన?
అఖిల్‌ని ఎలా ఇంట్రడ్యూస్‌ చేయాలా అని చాలా ఆలోచించాను. కానీ ఈ సినిమాతో భలే కలిసింది. నాకో టెన్షన్‌ వదిలింది. అతని కోసం నాలుగైదు కథలు విన్నాం. త్వరలో వెల్లడిస్తాం. తను చేసే పని పట్ల చాలా క్లారిటీ, పూర్తి నమ్మకంగా ఉంటాడు. స్క్రీన్‌పై తన ఈజ్‌ చూసి ఫ్యూచర్‌లో మరో ప్రిన్స్‌ మహేష్‌బాబు అవుతాడు అని చాలామంది అంటున్నారు. ఒక్క సినిమా కూడా చేయకుండా మహేష్‌తో పోల్చడం గ్రేట్‌ కదా. విక్రమ్‌ దగ్గర ఇంకా నలభై కథలున్నాయి. నాకు రోజుకో లైన్‌ చెప్తాడు. అఖిల్‌కి కూడా చెప్పమన్నాను. అఖిల్‌ తొలి సినిమా నేనే ప్రొడ్యూస్‌ చేస్తా. 
 
మహేష్‌బాబు గొప్పగా పొగిడారు కదా?
మనం సినిమా చూసొచ్చి మహేష్‌ కాల్‌ చేశాడు. అసలీ కథని ఎలా జడ్జ్‌ చేశారు. విక్రమ్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అద్భుతంగా తీశాడు. నేను కూడా విక్రమ్‌ కథ ఒకటి వింటున్నాను. మీరు కూడా విని జడ్జ్‌మెంట్‌ ఇవ్వండి అన్నాడు. అలాగే ఈ సినిమా చూసిన చాలామంది పెద్ద దర్శకుడు నన్ను కలిసి సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అని మాకు తెలిపారు అని అన్నారు. రాఘవేంద్రరావు మొదటి నుండి ఈ సినిమా పట్ల చాలా జాగ్రత్త తీసుకోమని చెప్పారు. సినిమా చూసి నన్ను వాటేసుకుని కన్నీరు పెట్టారు.
 
ఇకపై ఎలాంటి పాత్రలు, కథలు ఎంపిక చేసుకుంటారు?
ఇకపై మా బ్యానర్‌లో మూస సినిమాలు చేయను. ఉయ్యాలా జంపాలా వంటి చక్కని సినిమాలు చేయాలనుంది. అలాగే నేను కూడా వయసుకి సరిపడ పాత్రలు మాత్రమే చేస్తాను. కథానాయకుడి పాత్రను నా భుజాలపై మోసే వయసు దాటిపోయింది. ఇక మల్టీస్టారర్‌ చిత్రాలు కూడా చేయాలనుంది. అలాగే మీరు నాగచైతన్య, అఖిల్‌ కలిసి మనం సీక్వెల్‌ చెయొచ్చుగా అని చాలామంది అడుగుతున్నారు. ఈ ఆలోచన బావుంది. కుదిరితే చేస్తాం. 
 
ఎన్టీఆర్‌తో నేనో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే మనం సినిమా చూశాక ఎన్టీఆర్‌ ఆ కథలో మరిన్ని మార్పులు చేయాలని చెప్పాడు. ముందు అనుకున్న కథకి ఇప్పటి కథకి చాలా మార్పు ఉంది. 
 
బుల్లితెర అనుభవం ఎలా ఉంది? 
ఇప్పటివరకు నన్ను స్టార్‌గా చూశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా మీ కుటుంబంలో ఒకడిగా చూస్తారు. ఓసారి అమితాబ్‌గారిని కలిసినప్పుడు మీ షో తెలుగులో నేను చేస్తున్నాను... అనగానే ఈ షో పూర్తయ్యే లోపు 'నువ్వు చాలా మారిపోతావ్‌' అని ఒకటే మాట అన్నారు. చేసిన 5, 6 ఎపిసోడ్లకే నాలో చాలా మార్పు వచ్చింది. ఇదంతా నాకు చక్కని అనుభవంతోపాటు గొప్ప అనుభూతిని కలిగించింది. 
 
సినిమా అంటే ఇది అనేలా మనం చిత్రం ఉంటుందని రిలీజ్‌కి ముందే నమ్మకంగా చెప్పాను. మా నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు అక్కినేని కుటుంబం తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ముగించారు.