మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By PNR
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (15:50 IST)

అవకాశాలు లేకనే గోపీచంద్‌ సరసన నటించా: రకుల్‌ ప్రీత్‌‌సింగ్‌

ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్‌సింగ్‌ గోల్ఫ్‌ క్రీడాకారిణి. సినిమాల్లోనూ ఇంట్రెస్ట్‌తో పలు చిత్రాలకు ట్రై చేసినా.. ప్రభాస్‌ కుటుంబానికి చెందిన హీరోతో 'కెరటం' సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ అవకాశాలు రాలేదు. కొత్తగా వస్తున్న సందీప్‌కిషన్‌తో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చేసింది. ఆ సినిమా హిట్‌ అయింది. కానీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు. దాంతో మళ్ళీ నటిగా పోరాటం. కానీ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఆరు చిత్రాల్లో బిజీగా వుంది. తాజాగా గోపీచంద్‌తో 'లౌక్యం' చేసింది. ఈ చిత్రం ఈనెలాఖరుకు విడుదలకానుంది. ఈ సందర్భంగా రకుల్‌తో చిట్‌చాట్‌. 
 
'లౌక్యం'లో మీ పాత్ర ఎలాంటిది? 
నేను కాలేజీ అమ్మాయిగా నటించాను. జూనియర్స్‌ను రాగింగ్‌ చేస్తుంటాను. పాత్ర తీరు సీరియస్‌గా వుంటుంది. కానీ చూసేవారికి నవ్వుతెప్పిస్తుంది. 
 
అవకాశాలులేకనే గోపీచంద్‌తో చేస్తున్నారా? 
అవకాశాలు కొద్దికాలం దోబూచులాడాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత సక్సెస్‌ సినిమా అని పేరు వచ్చినా.. దాదాపు ఐదు నెలలు ఖాళీగా వున్నాను. నా మేనేజర్‌కు ఫోన్‌ చేసి ఎందుకు అవకాశాలు రావడంలేదని అడిగేదాన్ని.. ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది. వస్తే ఒకేసారి బిజీ అయిన ఆశ్చర్యం లేదన్నాడు. అలాగే జరిగింది. నేను నాకిచ్చిన పాత్రకు న్యాయం చేయాలనుకుంటాను. గోపీచంద్‌ సినిమాకు హీరోయిన్లు దొరకడంలేదనీ, అందుకే నేను చేస్తున్నానని అప్పట్లో కొన్నిచోట్ల విన్నాను. అలాంటిదేమీలేదు. ఆ సినిమాలో ఛాన్స్‌ వచ్చిందంతే. గోపీచంద్‌ మంచి ఆర్టిస్టు. ఎందుకని ఆయన్ను అలా అంటున్నారో తెలీదు. 
 
దక్షిణాదిలో ఏ రంగం ఇష్టపడతారు? 
దక్షిణాదిలో తెలుగు సినిమాలంటే ఇష్టం. ఇక్కడేకాదు. హిందీలోనూ అవకాశాలు వస్తున్నాయి. హిందీ నా మాతృభాష. అక్కడ సినిమాలు చేయడం చాలా ఇష్టం. ఫ్రొఫెషనల్‌ ఆర్టిస్టుగా ఇక్కడి చిత్రాలంటేనే మరింత ఇష్టం. ఇక్కడ ఆప్యాయతలు, పలుకరింపు చాలా బాగుంటాయి. స్వంత మనిషిగా ట్రీట్‌ చేస్తారు. 
 
సినిమాలో రాణించాలంటే ఏం చేయాలంటారు? 
గ్లామర్‌ రంగంలోకి రావడం అదృష్టం. వచ్చాక ఇక్కడ స్థిరపడాలంటే మరింతగా కష్టపడాలి. చేస్తున్న పనిపై అంకితభావంతో వుండాలి. అందుకే తొలిసినిమా తెలుగులో చేస్తుండగానే.. తెలుగుభాష గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు నేర్చేసుకున్నాను. నాకు సినిమా తప్పితే మరో ప్రపంచ తెలీదు. 
 
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 
ఆదితో రఫ్‌, మనోజ్‌తో 'కరెంట్‌తీగ', రవితేజతో 'కిక్‌-2', రామ్‌తో 'పండుగ చేస్కో' చిత్రాలు చేతిలో ఉన్నాయి. త్వరలో తమిళ, మలయాళంలోనూ నటించే అవకాశాలున్నాయి. 
 
పలుచోట్ల శ్రుతిమించిన ఫొటోలు కనిపిస్తున్నాయి? 
నాకు తెలీదు. ఇటీవలే ఎవరో చెప్పగా విన్నాను. ఇంటర్‌నెట్‌ వచ్చాక.. దాన్ని సరైన క్రమంలో ఉపయోగించుకోవాలి కానీ.. చాలా సందర్భాల్లో దుర్వినియోగం చేస్తున్నారు. నాదేకాదు. కొంతమంది ప్రముఖ నటీమణుల ఫొటోలను పెట్టేసి మార్ఫింగ్‌ చేసి రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంతకంటే ఏం చెప్పలేను.