శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (19:55 IST)

దసరాకు దూకుతున్నాం... 8 సెంటిమెంట్ అధిగమిస్తా... రాంచరణ్ ఇంటర్వ్యూ

చిరుత చిత్రం నుంచి నటవారసునిగా వచ్చిన రామ్‌ చరణ్‌.. ఏడేళ్ళ కెరీర్‌లో ఎంతో మార్పు చెందానని అంటున్నాడు. 'ఆరెంజ్‌' చిత్రం ఇంకా సరిగ్గా తీసి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జంజీర్‌ చిత్రం ఫెయిల్‌ అయినా పాత్ర పరంగా నేను సరిగ్గా అర్థం చేసుకోలేదేమోనని మనసులోని మాటను ఆవిష్కరించారు. మంచి నటుడిగా బిజీగా వుండాలనుకుంటానే కానీ నెంబర్‌ 1 స్థానం గురించి అస్సలు పట్టించుకోనని అంటున్న రామ్‌చరణ్‌... కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 1న దసరా కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
టైటిల్‌ను ఎలా జస్టిఫై చేయగలరు? 
'గోవిందుడు అందరివాడేలే' అనేది క్యారెక్టర్‌ గురించి పెట్టింది. ఆ పేరు గల వ్యక్తి అందరివాడు అనే అర్థం. అందరినీ కలుపుకొనే తత్త్వం వున్నవాడు. కానీ నా పేరు గోవిందుడు కాదు. అభిరామ్‌.
 
సినిమా చూశాక ఎలా ఫీలయ్యారు? 
నేను పూర్తిగా చూడలేదు. ఎడిటింగ్‌, డబ్బింగ్‌ చేస్తున్నప్పుడే చూశాను. 
 
కృష్ణవంశీ వంటి దర్శకుడితో చేసేటప్పుడు ఎలా అనిపించింది? 
ఆయన ఫ్యామిలీ డ్రామాను బాగా పండించగలరు. 'మగధీర' తర్వాతే ఆయనతో సినిమా చేయాల్సి వుంది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఫ్యామిలీ చిత్రం చేద్దామనుకున్నప్పుడుల్లా ఆయన గుర్తుకువచ్చేవారు. మధ్యలో కొంతమంది దర్శకులు కలిశారు. యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ కన్నా ఫ్యామిలీ కావాలని చెప్పాను. కానీ ఎవ్వరూ సరైన కథ ఇవ్వలేదు. కృష్ణవంశీగారి కథ కూడా ఆయనపై నమ్మకంతోపాటు కథపై నాకు మరింత నమ్మకం కల్గింది.
 
ప్రస్తుతం సక్సెస్‌లేని కృష్ణవంశీతో చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? 
నేనెప్పుడు సక్సెస్‌ఫుల్‌ దర్శకులు అనే ఆలోచన చేయలేదు. వినాయక్‌తో చేశాను. అప్పుడు ఆయన సక్సెస్‌లో వున్నారు. నేను ముందుకు కమిట్‌ అయ్యేది కథలో కంటెంట్‌కు మాత్రమే. కథ అనుకున్నాక దర్శకుడు ఎవరనేది ఆలోచిస్తాను. కృష్ణవంశీగారి గురించి చెప్పాలంటే.. ఆయన గత మూడు, నాలుగు సినిమాలు నిరాశపర్చవచ్చు. అది కథలో లోపం మాత్రమే. కానీ దర్శకుడిగా ఆయన ఎప్పుడూ సక్సెసే.
 
కృష్ణవంశీగారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌కానీ దర్శకుడనే పేరుంది కదా? 
నాకూ అలాంటి దర్శకుడే కావాలి. కథను నమ్ముకునే రావాలి. మన నుంచి ఆయనకు ఏమికావాలో అది రాబట్టుకోవాలి.
 
కాజల్‌తో మూడవ సినిమా ఎలాంటి పాత్ర చేస్తుంది? 
'ఎవడు'లో చిన్న పాత్ర చేసింది. మగధీరలో ఫుల్‌లెంగ్త్‌.. తర్వాత ఇందులో.. ఆమె అందలోనేకాదు పెర్‌ఫార్మెన్స్‌ కూడా చూపించగలదు.
 
పరుచూరి బ్రదర్స్‌ ఎంతవరకు వుపయోగపడ్డారు? 
కథ కృష్ణవంశీగారిది. స్క్రీన్‌ప్లేలో 80 శాతం ఆయనదే. సీన్స్‌, డైలాగ్స్‌ను టేకప్‌ చేసే విధానంలో పరుచూరి బ్రదర్స్‌ ముద్ర వుంటుంది.
 
మాస్‌ చిత్రాలు చేసి మళ్ళీ ఫ్యామిలీకి వచ్చారు? 
అన్ని తరహా చిత్రాలు చేయాలనుకున్నా. 'మగధీర' తర్వాత లవ్‌ స్టోరీ చేయాలనుకున్నాను. 'ఆరెంజ్‌' చేశాను. అది సరిగ్గా ట్రీట్‌ చేయకపోవడంతో ఫెయిలయింది.
 
ఈ సినిమా అభిమానులకు ఎలా వుంటుంది? 
ఖచ్చితంగా వారిని నిరుత్సాహ పర్చదు. వారికి కావాల్సిన అంశాలన్నీ ఇందులో వుంటాయి. 
 
ప్రకాష్‌రాజ్‌ ప్రవేశానికి ముందు? తర్వాత కథలో మార్పుజరిగిందా? 
కంటెంట్‌లో ఫీల్‌ ఏమి మారలేదు. ప్రకాష్‌ రావడంతో ఎన్నో సీన్స్‌ వచ్చాయి. ఆయన బాగా పండించాడు. తాతగారిలా నటించాలి. అందులో ఆయన నటన చూస్తుంటే.. ఎస్‌వి రంగారావు గుర్తుకు వచ్చారు. ఈ జనరేషన్‌కు ఎస్‌విఆర్‌ అంటే ఆయనే. ఇండస్ట్రీ ఆయన్ను ఇంకా సరిగ్గా వుపయోగించుకోలేదని నా ఫీలింగ్‌. ఈ సినిమాలో ఆయన సత్తాను మరోసారి నిరూపించాడు.
రాజ్‌కిరణ్‌ను తప్పించడం ఎవరి నిర్ణయం? 
మొదటి షెడ్యూల్‌ అయ్యాక... నేను, నాన్నగారు రష్‌ చూసి ఏదో ఫీల్‌ మిస్‌ అవుతుందని గ్రహించి మార్పు చేయడం జరిగింది. మన నేటివిటీకీ ఆయన సింక్‌ కాలేదు. ఆయన గొప్ప నటుడు కూడా.
 
ఆరు పాటల్లో ఐదే పెట్టడానికి కారణం? 
కథ సీరియస్‌గా సాగుతుండగా పాటలు స్పీడ్‌బ్రేకర్‌లా వుండకూడదని అలా చేశాం. ఇందులో నాకు నచ్చిన పాట 'కొక్కో...' అనేది.
 
ఎన్‌ఆర్‌ఐగా పలు చిత్రాలు వచ్చాయి. ఇందులో మీరు చూపించే కొత్తదనం? 
పుట్టిపెరిగింది సినిమాలో లండన్‌లోనే. నాన్నగారి పెంచిన విధానం మన కట్టుబాట్లను ఎక్కడా మిస్‌ కాకుండా ఇందులో చూపించారు. ఇటీవలే లండన్‌లో షూట్‌ చేస్తుండగా.. అక్కడ మన డిస్ట్రిబ్యూటర్లు తాలూకు కుటుంబ సభ్యులుకానీ ఇతరులు కానీ.. వారు అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఇచ్చే గౌరవం ఆశ్చర్యపర్చింది. 
 
కృష్ణవంశీ మిమ్మల్ని ఎంతవరకు పిండారు? 
ఆయనేకాదు నేను కూడా పిండాను. కృష్ణవంశీగారితో కలిసి పనిచేయడంతో ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నారో.. మనం ఏమి ఇవ్వాలో తెలిసిపోతుంది.
 
ఆయన చిత్రాల్లో ఏవేవి నచ్చాయి? 
చందమామ, మురారి, నిన్నే పెళ్లాడుతా.. వంటివి.
 
'గోవిందుడులో..' అన్ని మిక్స్‌ అయి వుంటాయా? 
(ఒక్కసారిగా నవ్వుతూ).. లేదు.. ఇది సెపరేట్‌.
 
సీతారామయ్యగారి మనవరాలు పోలినట్లు వుంటుందనే వార్తలు విన్పిస్తున్నాయి? 
అది స్పూర్తి మాత్రమే. కథకానీ సీన్స్‌ కానీ ఎక్కడా సింక్‌ కావు. అందులోని త్యాగాలు చేసినట్లు ఇందులో వుండదు.
 
సీతమ్మ వాకిట్లో.. వంటి చిత్రాలు ఏమైనా? 
అలాంటి జోనర్లు హిట్టవుతున్నాయి. 'ఆరెంజ్‌' నుంచి చేయాలనుకున్నాను. లక్కీగా అలాంటివివచ్చేశాయి.
 
చిత్రాన్ని చూసి నిర్మాత పదిసార్లు ఏడ్చానన్నారు? ప్రేక్షకుడికి భారీగా అనిపిస్తుందా? 
కళ్ళవెంట నీళ్లు తెప్పిస్తాయి.. కానీ అది కూడా లైటర్‌వేలో వుండేట్లుగా తర్వాత సన్నివేశాలుంటాయి.
 
'గోవిందుడు.. 'చేశాక మీలో వచ్చిన మార్పు? 
చాలా మార్పు కన్పిస్తుంది. నన్ను రకరకాలు షేడ్స్‌లో ఆయన చూపించారు. ప్రతి ఆదివారం ఫ్యామిలీతో కలిసి గడుపుతుంటాను. ఈ సినిమాలో 50 మంది దాకా వుంటారు. అలా కుటుంబమంతా కలిసి వుండటమంటే ఇష్టం.
 
కథ విషయంలో పవన్‌గారితో చర్చించారా? 
ఇలాంటి కథలు చేయాలని మాట్లాడుకునేవాళ్ళం.
 
చిరంజీవిగారు సినిమా చూశారా? 
ఇంకా చూడలేదు. మంగళవారంనాడు చూస్తారు. 
 
ఆయన ఏమైనా సలహాలు ఇస్తుంటారా? 
ఏవైనా అనుమానాలుంటే ఇది ఇలా వుండాలనే సలహాలు ఇస్తుంటారు.
 
శ్రీకాంత్‌తో చేయడం ఎలా అనిపించింది? 
'శంకర్‌దాదా..' నుంచి తను బాగా తెలుసు. నాన్నగారితో మంచి సంబంధాలున్నాయి. అచ్చం బాబాయ్‌లా సూటయ్యాడు.
 
కథ ఎంపికలో చిరంజీవిగారి ప్రమేయం ఎంతవరకు? 
కథ ఎంపికలో తప్పకుండా వుంటుంది. చేయాల్సింది నేను కాబట్టి .. ఫైనల్‌గా నాకు వదిలేస్తారు.
 
శ్రీనువైట్లతో సినిమా ఎంతవరకు వచ్చింది? 
చర్చలు జరిగాయి. ఇంకా కమిట్‌ కాలేదు. కథ బాగుంటే చేస్తానన్నాను. 
 
కథ చెప్పకుండానే ఓకే చేస్తుంటారా? 
అలాంటిది ఏమీలేదు. కొరటాల శివ చిత్రం ఏదో ఆబ్లిగేషన్‌పై ఓపెనింగ్‌ వరకు వచ్చాం. మంచి ఫ్యామిలీ కథ అని గణేష్‌ చెప్పారు. అది ఒత్తిడి మీద ఓపెనింగ్‌ వరకు రావాల్సి వచ్చింది.
 
మణిరత్నంతో సినిమా? 
మణిరత్నంగారు వచ్చి కథ చెప్పారు. కానీ ఇప్పటి ట్రెండ్‌కు అది కరెక్ట్‌ కాదనిపించింది. సినిమా చేస్తే నిర్మాతకు లాభం రావాలి. లేకపోతే వేస్ట్‌. కానీ ఆయన దర్శకత్వంలో తప్పకుండా చేయాలనుంది.
 
ప్రతి పండక్కి మీ ఒక్క సినిమానే వస్తుందే? 
అలాంటిది ఏమీలేదు. ఎవడు, రచ్చ, నాయక్‌ విడుదలయినప్పుడు మరో హీరో సినిమాలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రమే నాది ఒక్కటే వస్తుంది.
 
'జంజీర్‌' సినిమా ఎలాంటి అనుభూతి కల్గించింది? 
కొన్ని సందర్భాల్లో క్యారెక్టర్‌ మిస్‌ అయ్యాననే అనిపించింది. బహుశా నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ సరిగ్గా లేదేమోననిపించింది.
 
వైజాగ్‌లో స్టూడియో కడుతున్నారా? 
ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇండస్ట్రీ రావడం కరెక్ట్‌ కాదని అప్పట్లో అనుకున్నారట. కానీ పరిస్థితులు మారాయి. వైజాగ్‌లోకూడా ఇండస్ట్రీ రావాలి. ఆలోచనైతే వుంది. యుఎస్‌లో చూస్తే.. న్యూయార్క్, డల్లాస్‌ వంటి చోట్ల స్టూడియోలు వున్నాయి. నేను వైజాగ్‌లో నలభైరోజులు వుండాలంటే.. అక్కడ తప్పనిసరిగా స్టూడియో వుంటే నిర్మాతలకే ఖర్చు తక్కువ అవుతుంది.
 
మీ కెరీర్‌కు ఉపాసన ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? 
మంచి లవ్‌ స్టోరీలు చేయమని మాత్రమే చెబుతుంది. ఎందుకంటే ఆమెకు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలీదు.
 
చిరంజీవిగారి 150వ సినిమా మీరే నిర్మాతగా ఎందుకనుకున్నారు? 
అది అమ్మగారి కోరిక. ఎప్పటినుంచో చేయాలనుంది.. 
 
ఎంతవరకు వచ్చింది? 
రెండు మూడు కథలు అనుకున్నాం. ఇంకా ఫైనల్‌ కాలేదు. దర్శకుడు ఎవరనేది కూడా ఇంకా నిర్ణయించలేదు. కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం వుంటుంది.
 
ప్రతివారు కృష్ణవంశీతో నటించాలనుకుంటారు? ఎందుకని? 
నాకూ అలానే అనిపించింది. ఆయనతో సినిమా చేసేటప్పుడు.. చెప్పే విధానం, మార్పులు తీసుకునే తీరు చాలా క్రియేటివిటీగా వుంటాయి. ఇలాక్కూడా చేయవచ్చా అనేంత కొత్తగా వుంటుంది. కంటెంట్‌ మారకుండా చేసే విధానంలో మార్పు చూపిస్తారు.
బోయపాటి శ్రీను కథ చెప్పారా? 
రెండు, మూడు కథలు చెప్పారు. కానీ ఏవీ నచ్చలేదు.
 
కోన వెంకట్‌, గోపీ మోహన్‌ కూడా చెప్పారని తెలిసింది? 
అవును. వారు చెప్పిన కథ బాగుంది. దర్శకుడు ఎవరో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
 
మీ ఫ్యామిలీ చిత్రాల టైటిల్స్‌.. 'గోవిందుడు' పేరుతోనే వస్తున్నాయి? 
అనుకోలేదు. అలా కుదిరాయంతే.
 
చిరంజీవిగారు తర్వాత నెంబర్‌ 1 స్థానం అలానే వుంది? దానికోసం మీరు ప్రయత్నిస్తున్నారా? 
మంచి సినిమాలు చేయాలనే ఆలోచిస్తాం. నెంబర్‌ 1 స్థానం కోసం పోటీపడను. ఎప్పుడూ బిజీగా వుండాలనే కోరుకుంటాను. అప్పట్లో నాన్నగారు కూడా ఆ స్థానం గురించి పాటుపడలేదు. కష్టపడ్డారంతే..
 
తెలుగు హీరోలకు 8వ సినిమా 'ఫోబియా' అనేది వుందనే వార్తకు మీరెలా స్పందిస్తారు? 
ఇప్పుడే మా మేనేజర్‌ ప్రవీణ్‌ చెప్పారు. అప్పటివరకు నాకూ తెలీదు. 7వ సినిమాలు అందరి హీరోలకే హిట్టే అట. 8వ సినిమా ప్లాప్‌లంటూ కొన్నిచోట్ల రాశారని అన్నాడు. వాటిని బ్రేక్‌ చేస్తాననే నమ్మకముంది.
 
రీష్యూట్‌ వల్ల 5 కోట్లు నష్టమని వార్తలు వస్తున్నాయి?
రీ ష్యూట్‌ వల్ల ప్రకాష్‌రాజ్‌ వచ్చారు. ఆయన రాకతో మంచి డెప్త్‌లోకి వెళ్ళింది. దానివల్ల పదికోట్లు లాభమే అవుతుంది.
 
మీపై వచ్చే విమర్శలు ఎలా తీసుకుంటారు? 
నేను పేపర్‌ చదవను. చూసినవి ఎవరైనా చెబితే వింటాను. మేనేజర్‌ ప్రవీణ్‌ చెబుతుంటాడు. లేదంటే మా స్నేహితులు. ఫలానా చోట నీ గురించి ఆర్టికల్‌ బాగా రాశారనీ, లేదంటే ఏదో విమర్శించారని. 100 వెబ్‌సైట్లు వున్నాయి. అందులో ఎవరో ఏదో రాశారని అన్నీ చూడలేం కదా.
 
రివ్యూలను సీరియస్‌గా తీసుకుంటారా? 
దాన్ని పరిశీలిస్తాను. ఏదో కారణం లేకపోతే అలా రాయరని గ్రహిస్తాను.
 
నాన్నగారిలా సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వస్తారా? 
అలాంటి ఆలోచన రాదు. లేదు కూడా అని ముగించారు.