శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: గురువారం, 11 సెప్టెంబరు 2014 (13:40 IST)

శంకర్ 'అపరిచితుడు'తో జనం మారారా... నేనలాంటివి తీయను.. వర్మ ఇంటర్వ్యూ

రాంగోపాల్‌ వర్మ అనగానే... ఏదో ఒక కాంట్రవర్సీతో పబ్లిసిటీతో ముందుంటాడు. సినిమా బాగోకపోయినా మరో సినిమా తీస్తూ.. మధ్యలో ఏదో ఒక కొత్త పద్ధతి అంటూ టెక్నికల్‌ గురించి మాట్లాడటం. సమాజంలో జరిగే విషయాలపై స్పందించడం.. ఆఖరికి వినాయకుడి గురించి కూడా మాట్లాడి యావత్‌ భక్తుల నోళ్ళలో నానిన వర్మ... ఇది నాకు చిన్నతనం నుంచి అబ్బిన విద్యేనంటూ చెబుతున్నాడు. హత్యలు, దోపిడీలు, మాఫియా అంటూ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసే వర్మ.. మంచు విష్ణుతో 'అనుక్షణం' అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఈ నెల 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
'అనుక్షణం'కు ప్రేరణ ఏమిటి? 
జూబ్లీహిల్స్‌లో ఆమధ్య జరిగిన కొన్ని సంఘటనలు. సాప్ట్‌వేర్‌ ఉద్యోగినులను క్యాబ్ డ్రైవర్‌ డ్యూటీ అయ్యాక తీసుకెళుతూ.. రేప్‌ చేసి చంపడం, అలాగే ఆటోడ్రైవర్లు.. ఇలా సమాజంలో జరిగిన సంఘటనే ఈ చిత్రం.
 
క్రిమినల్‌ లాయర్‌ అయితే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? 
రెండూ సెపరేట్‌ ప్రొఫెషన్స్‌, క్రిమినల్‌ క్రిమినలే. లాయర్‌ అనేది కన్‌సల్‌టెంట్‌ సర్వీస్‌ కాదు.
 
ఇంతకుముందు ఇలాంటి కథను టచ్‌ చేశారా? 
ఇదే మొదటిసారి. 
 
విష్ణునే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? 
'రౌడీ' సినిమా చేస్తున్న టైమ్‌లోనే ఆయనలో ఇంకో కోణం చూశాను. మామూలుగా ఆయన సినిమాల్లో కామెడీ టచ్‌ వుంటుంది. అది సినిమా వరకే. కానీ పర్సనల్‌గా ఆయనలో సీరియస్‌నెస్‌ కన్పించేది. అందుకే పర్టిక్యులర్ రోల్‌కు పోలీస్‌లాగా ఇతనే బెటర్‌ అని అనుకున్నా.
 
'రౌడీ'గానా, పోలీసుగానా ఎలా బాగున్నాడు? 
పెర్‌ఫార్మెన్స్‌ పరంగా పోలీస్‌ విష్ణే నచ్చాడు. లుక్‌ పరంగా రౌడీగా నచ్చుతాడు.
 
నానాపటేకర్‌ వంటి వారు ఇలాంటి పాత్రలు చేశాక. ఇలాంటి వారిని తీసుకోవడం..?
అది కరెక్ట్‌ పోలిక కాదు. 'సర్‌ఫ్రోజ్‌'లో అమీర్‌ఖాన్‌తో కంపేర్‌ చేయవచ్చు. అందులో తెలుగు వెర్షన్‌ విష్ణు చేశాడు. అనుక్షణంలో ఎడ్యుకేటెడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాడు. అంటే ఇంటిలిజెంట్‌ ఆఫీసర్‌ అన్నమాట.
 
సీరియల్‌ కిల్లర్‌గా హిందీలో తీస్తారా? 
సీరియల్‌ కిల్లింగ్‌లో ఎన్ని హత్యలు జరిగాయి. చేయలేనివారు చూసుకుంటారా! అనేది కాదు. సీరియల్‌ కిల్లర్‌ను చూడాలని పాషన్‌ చాలామందిలో వుంటుంది. అమెరికాలో 5,6 సినిమాలు ఏడాదికి అలాంటివాటిపై వస్తుంటాయి. వారిపై డాక్యుమెంటరీలు, పుస్తకాలు కూడా రాసేస్తుంటారు. ఆయన్ను చూడాలని ప్రజలు విపరీతంగా వస్తుంటారు.
 
మీరు చూపే హత్యలు ఎడ్యుకేట్‌ చేసేవిగా ఉంటుందంటారుగదా? 
దీనికి నేను చెప్పేది ఒక్కటే. చెట్టు ముందా? విత్తు ముందా? అనేది. మాగ్జిమమ్‌ మర్డర్లు, రేప్‌లు అనేవి సినిమా కెమెరా కనిపెట్టక ముందే వున్నాయి. రియల్‌ లైఫ్‌లో దాన్ని పదిశాతం మాత్రమే చూపిస్తున్నాం. సినిమా చూసి నేర్చుకునేంత మూర్ఖులు కాదు. 'శివ' సినిమా కూడా కాలేజీలో జరిగిన సంఘటనే చూపించాను.
 
కరెక్టే.. కానీ అది తెరపైకి వచ్చాక యూత్‌ చూసి ఇన్‌స్పైర్‌ అయ్యారు కదా? 
లైఫ్‌ ఇమిటేషన్‌, ఆర్ట్‌ ఇమిటేషన్‌ అనేది ఇంగ్లీషు కొటేషన్‌. మనిషి పుట్టకముందే ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి సంఘటనలు. 1960, 70లో  ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేవి. హాలీవుడ్‌ సినిమాలు కూడా దాన్ని క్యాప్చర్‌ చేయలేకపోయాయి. కానీ అలా చేసేవారిని పట్టుకోవచ్చని సినిమా చెబుతుంది.
 
ప్రేమకథా చిత్రాలు చేస్తారా? 
ఇప్పుడు చేయబోతున్నాను. వచ్చే నెలలో మొదలైంది. వివరాలు తర్వాత చెబుతాను.
 
సైకో కిల్లర్‌పై గ్రౌండ్‌ వర్క్‌ చేశారా? 
రీసెర్చ్‌ అనేది నేను దర్శకుడిగా కాకముందే చాలా పుస్తకాలు స్టడీ చేశాను. డాక్యుమెంటరీలు చూశాను. వాటి ఆధారంగానే క్రియేట్‌ చేసిన క్యారెక్టర్లు ఇవి. ఇలాంటివారి వల్ల సిటీ మొత్తం స్తంభిస్తుంది. అమెరికాలో క్యారీగిడ్జ్‌ అనేవాడు 100 మందిని చంపాడు. అతన్ని పట్టుకోవడానికి 20 ఏళ్ళుపట్టింది. 
 
సైకో కిల్లర్‌గా కొత్తవాడిని తీసుకోవడానికి కారణం? 
కొత్తవాడైతే అతని గురించి తెలీదు. అతను భయపెట్టగలడు. ఎస్టాబ్లిష్‌ అయిన తర్వాత అతనిలో పెర్‌ఫార్మెన్స్‌ చూస్తాను. తెలుగువాడే అయిన సూర్య బొంబైలో స్థిరపడ్డాడు. అతనే ఆ పాత్ర చేశాడు.
 
సమాజాన్ని ఆలోచింపజేసే భారతీయుడు వంటి కథాంశాలు ఆశించవచ్చా? 
ఇన్నిరోజులు నాగురించి తెలీక అడుగుతున్నారా? లేదా నేను నిద్రపోతున్నానా అనేది అర్థంకావడం లేదు. నేను క్రైమ్‌, టెర్రరిజం వంటి కథలు తీశాను. పేపర్లో, టీవీల్లో వచ్చిన విషయాలే. మీరన్నట్లు.. శంకర్‌ చేసిన సందేశాత్మక చిత్రాలు వల్ల ఎవరైనా మారారా? 'ఒకేఒక్కడు' వచ్చాక లంచం తీసుకోవడం మానేశారా? ఇవ్వడం మానేశారా? నాకయితే అలాంటి సినిమాలు తీసే సదుద్దేశ్యంలేదు.
 
సమాజానికి వర్మ ఎంతవరకు ఉపయోగపడతాడు? 
ఏమాత్రం వుపయోగం లేదు. ఇప్పటికే పలు కేసులు నాపై పెట్టారు.
 
డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకెళ్ళడం కరెక్టేనా? 
థియేటర్‌ అనేది ఒక వ్యాపారం. అంటే ఒక షాప్‌. అందులో వస్తువులు బాగుంటే అందరూ కొంటారు. ఆ వస్తువు మంచిదంటే డబ్బులిచ్చి హోల్‌సేల్‌గా కొని.. రిటైల్‌గా అమ్ముతారు. ఆ అవకాశం సామాన్యుడికి ఇవ్వాలనుకున్నాను.
 
ఇండియాలో ఏ ప్రాంత జర్నలిస్టులంటే ఇష్టపడతారు? 
ఇక్కడ ప్రాంతంవారీగా జర్నలిస్టుల ఆలోచనలు వుంటాయి. సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిన జర్నలిస్టులు, టెక్నీషియన్స్‌తో రాపోలో వుండటంవల్ల ఆ ఆలోచనలు వేరు. తెలీని చోట జర్నలిస్టు ఆలోచనలు వేరుగా వుంటాయి. అలా అందరూ జర్నలిస్టులు కాదు. చాలామంది మంచి దర్శకులు, నాలాంటి చెడ్డ దర్శకులు వుండవచ్చు. కానీ ఇద్దరినీ దర్శకులు అనలేం.
 
ఇటీవల ఇండస్ట్రీలో జరుగుతున్న.. ముఖ్యంగా శ్వేతాబసు ఉదంతంపై మీరేమంటారు? 
నాకు పూర్తి డిటైల్స్‌ తెలీవు. సో... నో కామెంట్‌ అని ముగించారు.