శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By PNR
Last Updated : మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (18:05 IST)

వర్మ మాటలు సీరియస్‌గా తీసుకోరు.. ప్రకాష్‌రాజ్‌ గురించి మాట్లాడడం అనవసరం : శ్రీను వైట్ల

'ఆనందం' చిత్రంతో దర్శకునిగా కొత్త ట్రెండ్‌ను సృష్టించిన దర్శకుడు శ్రీను వైట్ల.. తర్వాత తర్వాత అగ్ర హీరోతో చిత్రాలు తీసి తనకంటూ మాస్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ముందు తాను రచయిత అనీ, ఆ తర్వాతే దర్శకుడిననీ, అందుకే తన సినిమాల్లో పంచ్‌డైలాగ్స్‌లు ఎక్కువగా ఉంటాయని అంటున్న శ్రీను వైట్ల... తన కింద పనిచేసిన రచయితల పేర్లను వాడుకునే దుస్థితి కలగలేదని చెబుతున్నారు. మహేష్‌బాబుతో 'దూకుడు' చేశాక.. మళ్ళీ 'ఆగడు' చేశాడు. ఈ చిత్రం డివైడ్‌ టాక్‌తో రన్నింగ్‌లో ఉంది. అయినా కలెక్షన్లు బాగున్నాయి అంటున్న శ్రీనువైట్ల పుట్టిన రోజు ఈనెల 24. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు... 
 
* ఈ పుట్టినరోజు ప్రత్యేకతలు ఏమైనా వున్నాయా? 
ప్రత్యేకించి నేను పుట్టినరోజు ఎక్కడో చోట జరుపుకోను. ఇంట్లోనే వుంటాను. కొత్త ప్రణాళికలు ఏమీలేదు. నాకు సినిమా అంటే మరోటి తెలీదు. సినిమాల గురించే ఆలోచిస్తా. 
 
* తదుపరి సినిమా రామ్‌చరణ్‌తో చేస్తున్నారా? 
ఏ హీరో అనేది చెప్పలేను. ఒక వారంలో రోజుల్లో సినిమా గురించి చెబుతాను. అప్పుడే అన్ని వివరాలు తెలియజేస్తాను. డిఫెనెట్‌గా పెద్ద ప్రాజెక్ట్‌ అవుతుంది. 
 
* 'ఆగడు' ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయింది? 
మహేష్‌తో 'దూకుడు' చేశాక.. కొత్తగా చేయాలని అనుకున్నప్పుడు ఆయన్ను రూరల్‌కాప్‌గా చూపించాలనుకున్నాను. అది విని చాలా ఫీలయ్యారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేశాం. 
 
* 'దూకుడు'లాగానే వుందనే విమర్శ వుంది? 
కొంతమంది ఖచ్చితంగా ఆలోచిస్తారు. కానీ ప్రేక్షకులకు ఆ కంపేరిజన్‌ లేదు. దూకుడుతో కంపేర్‌ చేయకుంటే విపరీతంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ శంకర్‌ అనే మాట ఎలా పెట్టారు? ఓపెనింగ్‌ సీన్‌లో మహేష్‌ టపటపా కొంతమందిని కాల్చేస్తాడు. ఆ రీజన్‌ తను ఎన్‌కౌంటర్లు చేస్తున్నాడని. అదే తర్వాత ఎస్టాబ్లిష్‌ చేశాం. పైగా తన మైండ్‌గేమ్‌తో విలన్లు కంట్రోల్‌ చేస్తాడు. 
 
* మహేష్‌ చేత భారీ డైలాగ్‌లు చెప్పించడం కరెక్టేనా? 
ఏదో కొత్తదనం కావాలి. రిథమిక్‌గా డైలాగ్స్‌కు వాల్యూవుంది. చిన్నతనంలో ఒకడు కథలు బాగా చెబుతాడు. అలాంటి క్యారెక్టర్‌ మహేష్‌ది. పెద్ద డైలాగ్‌ అయినా బ్రీత్‌లెస్‌ అయినా సింగిల్‌ టేక్‌లో చెప్పేశాడు. 
 
* ఓవరాల్‌గా కలెక్షన్లు ఎలా వున్నాయి? 
బాగానే వున్నాయి. దసరా ముందు కూడా బాగున్నాయి. తర్వాత ఎక్కువగా వుంటాయి. 
 
* మీ చిత్రాలన్నీ ఒకే ఫార్మెట్‌లో వుంటాయి. రకరకాలుగా స్కూప్‌లు వేస్తుంటారు? 
ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్‌ వుంటుంది. నాది అది. నేను చేసిన చిత్రాల్లాంటివే వేరేవారివి రావడంతో ఆ తరహా చిత్రాలు ఎక్కువయినట్లు 
అనిపిస్తుంది. 
 
* గత మూడు చిత్రాల్లోనూ పోలీసు క్యారెక్టర్లే తీసుకోవడంలో ఆంతర్యం? 
ఏమీలేదు. బాద్‌షా, దూకుడులో... కొంతమేరకే పోలీసు గెటప్‌ వుంటుంది. ఆగడులో పూర్తిస్థాయి పోలీసు. 
 
* 'ఆగడు' చిత్రం రెండు మూడు చిత్రాల కలిపి తీసినట్లుందనే విమర్శ వుంది? 
విమర్శలు ఎప్పుడూ వుంటాయి. నేను ఆ తరహా సినిమాలు చేశాను కాబట్టి ఆ కంపేరిజన్‌ వచ్చి వుంటుంది. 
 
* రామ్‌గోపాల్‌వర్మ మీపై చేసిన కామెంట్‌కు మీరెలా స్పందిస్తున్నారు? 
ఆయనంటే నాకు చాలా గౌరవం. ఇంతకుముందు దూకుడులో ఆయన్ను అడిగి ఓ సీన్‌ పెట్టాను. సరదాగా పెట్టానంతే.. ప్రేక్షకులు సరదాగా తీసుకున్నారు. ఆయన కూడా. 
 
* ప్రముఖ దర్శకుడి మాటలు వల్ల కలెక్షన్లు తగ్గే అవకాశం వుంటుంది కదా? 
రాముగారి మాటలు ప్రేక్షకులు అంత సీరియస్‌గా తీసుకుంటారనుకోను. నేనూ తీసుకోను. ఆయన మీద కోపంలేదు. చాలా కూల్‌గా వున్నాను నేను. 
 
* ప్రకాష్‌రాజ్‌పై కూడా సోనూసూద్‌ చేత ఇంటర్‌వెల్‌ ముందు సెటైర్‌ వేయించారు కదా? 
అది అనుకోకుండా విలన్‌ ఓ పద్యం పాడతాడు. సీన్‌కు సెట్‌ అయింది. అయినా ప్రకాష్‌రాజ్‌ పోవడం వల్ల సినిమాకు మైనస్‌ ఏమీ అవ్వలేదు. ఆయన గురించి మాట్లాడుకోవడం అనవసరం. 
 
* కోనవెంకట్‌, గోపీమోహన్‌.. రచయితుల వెళ్ళాక.. మీరు పంచ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ వుంది? 
కోనవెంకట్‌, మరో రైటర్‌ అనేది నేను పట్టించుకోను. నాకింద పనిచేసి రైటర్స్‌ ఇంతకుముందు రెండు సినిమాలకు పని చేశారు. వారు రాసింది నేను పేరు వేసుకోను. నేను బేసిగ్గా రైటర్‌ను. తర్వాతే దర్శకుడిని. 
 
* టైటిల్‌సాంగ్‌లో మోత ఎక్కువైంది? 
అవును.. ఆడియోలో సాంగ్‌ చక్కగా వచ్చింది. హీరో ఎంట్రన్స్‌ భారీగా వుండాలనీ.. కొన్ని ఎఫెక్ట్స్‌ పెట్టాం. దాంతో సాహిత్యం వినిపించలేదు. 
 
* ఇటీవలే చంద్రబాబునాయుడ్ని కలిశారు? 
అవును. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాను. మరే ఉద్దేశ్యంలేదు. 
 
* బకరా పాత్ర పెట్టి హీరోకంటే హైలైట్‌ చేస్తున్నారే? 
ఏదిఏమైనా.. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయాలి. ఆ ఫార్ములా ప్రతిసారీ హిట్‌ అవుతున్నప్పుడు మార్చడం ఎందుకు. ఇది బిజినెస్‌ ఫీల్డు. ఏది బాగుంటే అదే ఉపయోగిస్తాం. 
 
* శ్రుతిహాసన్‌ సాంగ్‌ ప్రత్యేకత వుందా? 
ఆ అమ్మాయి మంచి డాన్సర్‌. ఇప్పటివరకు ఐటంసాంగ్‌ చేయలేదు. అందుకే ఈ సినిమాలో కావాలని ఫోన్‌ చేస్తే వెంటనే ఒప్పుకుంది. రెండుసార్లు డేట్స్‌లేక వాయిదా కూడా వేశాం. మొత్తంగా ఆ డాన్స్‌ ప్లస్‌ అయింది. అంటూ ముగించారు.