శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
Written By SELVI.M

నేను బిజినెస్‌మేన్‌ని కాదు: వెంకీ

WD

మనకున్న అగ్రహీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. చిత్రం చేసినప్పుడే దాని గురించి ఆలోచించి... ఆ తర్వాత జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోని కథానాయకుడు వెంకీ. అలాగని సినిమా అటు ఇటూ అయితే దాని గురించి ఆలోచించడు అనుకుంటే మాత్రం పొరబాటే.

ఇందుకు తాజాగా విడుదలైన "చింతకాయల రవి" చిత్రమే ఉదాహరణ. కరెక్ట్‌గా ఆ చిత్రం విడుదలకు ముందు రెండువారాల టిక్కెట్ రేటు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం తొలగిస్తే... దానివల్ల నిర్మాత చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పెట్టిన బడ్జెట్‌కు ఆదాయం పడిపోతుండంతో తనకు మనోధైర్యాన్నిచ్చింది వెంకటేష్ అని నిర్మాతే చెప్పడం విశేషం.

ఏదైనా తాను చిత్రానికి ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకోనని చెబుతున్న విక్టరీ వెంకటేష్ తాజాగా రెండు చిత్రాల స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 13వ తేదీన వెంకీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం...

ప్రశ్న... ఈసారి పుట్టినరోజు ఎక్కడ, ఎలా జరుపుకుంటున్నారు?
జ... పుట్టినరోజు జరుపుకునే ఆనవాయితీ లేదు. ఇంట్లో కూడా పెద్దగా చేసుకోను. ప్రతిరోజూ పుట్టినరోజుగానే భావిస్తాను.

ప్రశ్న... చింతకాయలరవి ఎటువంటి సంతృప్తిని మిగిల్చింది?
జ.. చింతకాయల రవి చాలా హ్యాపీ సినిమా. సింపుల్ కామెడీతో తెరకెక్కింది. విదేశాల్లో చాలాసార్లు షూటింగ్ చేసినా అదొక కొత్త అనుభూతి. కమర్షియల్‌గా సేఫ్ ప్రాజెక్ట్. రిలీజ్ సమయంలో టిక్కెట్ రేట్ తగ్గడంతో నిర్మాతకు రావాల్సిన 4, 5 కోట్లకు గండిపడిందనే చెప్పాలి. ఏమైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇండస్త్రీ అంతా ఒక్కతాటిపై నిలబడి దాని గురించి ఆలోచించాలి.

ప్రశ్న... హీరోలు పారితోషికం పెంచేయడం వల్ల నిర్మాతకు నష్టం వస్తుందని అంటున్నారు. ఈ విషయంపై మీ సమాధానం.?
జ... అది ప్రతి హీరో ఆలోచించాలి. నేను ఎప్పుడూ నిర్మాతకు, బయ్యర్లకు అందుబాటులో ఉంటాను. నా పారితోషికం కూడా రీజనబుల్‌గా ఉంటుంది. షూటింగ్‌కు ముందు పైసా కూడా తీసుకోను. 6, 7 నెలలు పూర్తయ్యాక తీసుకుంటాను. అలాగైతే అన్ని నెలల ఇంట్రస్ట్ తగ్గిపోతుంది కదా. ముందుగా అడ్వాన్స్ తీసుకుంటే.. పొరపాటున ఆ సినిమా వాయిదా పడితే... నాకు వేరే సినిమాలు ఉండవు.

ప్రశ్న... మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే అవకాశముందా?
జ... ఇప్పటికే హై బడ్జెట్ అంటూ గోల చేస్తున్నారు. అవికూడా చేస్తే మరింత గోల అవుతుంది. ఆ ఆలోచన మాత్రం లేదు.

ప్రశ్న... నాగచైతన్యపై మీ అభిప్రాయం..?
జ... గొప్ప భవిష్యత్ ఉంది. వాడిపై మా బాధ్యత కూడా ఉంది. సెల్ప్ డిసిప్లైన్ ముఖ్యం. వీడనే కాదు... నేటి యువ హీరోలందరికీ చాలా ఫ్యూచర్ ఉంది. ఏదైనా సరే రిస్క్ తీసుకోవాలి. సక్సెస్ కాకపోయినా ట్రెండ్‌ను బట్టి మార్చుకోవాలి.

ప్రశ్న... అలా మీరు రిస్క్ తీసుకున్న సందర్భాలున్నాయా?
జ... నేను తొలిదశలో అలా చేయలేకపోయాను. రాను రాను మార్చుకుంటూ వచ్చాను. "కలియుగ పాండవులు" నుంచి "స్వర్ణకమలం" చేశాను. కె. విశ్వనాథ్ నన్ను కొత్తకోణంలో ఆవిష్కరించారు. అలాగే "బొబ్బిలిరాజా", "క్షణక్షణం" ఇలా రిస్క్ తీసుకుని వైవిధ్యంగా చేశాం. నేను కాదు.. చిరంజీవి, బాలకృష్ణలు కూడా అలా చేసిన వాళ్లే.

WD

ప్రశ్న... నాగచైతన్యతో కలిసి నటించే ఆలోచన ఉందా?
జ.. ముందు హీరోగా సెట్ కానీవ్వండి. ఆ తర్వాత చూద్దాం. వాడికి అనుభవం వచ్చాక. మంచిస్క్రిప్ట్ దొరికాక బాగుంటే... తప్పకుండా చేస్తాను.

ప్రశ్న... "రాణా" చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది?
జ... వచ్చే ఏడాది రావచ్చు. అతను చాలా కష్టపడుతున్నాడు. తనను తాను మౌల్డ్ చేసుకునేలా ఎదుగుతున్నాడు. ఎలాగూ మా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడంతా పోటీ యుగం. దానికి తట్టుకోవాలంటే ప్రేక్షకుల్ని ఇంప్రస్ చేయాలి. అలా వ్యక్తిగా కూడా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు.

ప్రశ్న... ఈ మధ్య మిమ్మల్ని కలచివేసిన సంఘటన?
జ... ముంబై తాజ్ హోటల్‌లో జరిగిన దుర్ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. పరిపాలనాపరంగా నాయకులకు గానీ, ఇటు ప్రజలకు గానీ ఒక పాఠం బోధించింది. ఎవరికివారు తమ లైఫ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదంతం చెప్పింది. ఒక్కరోజు జరగడం, దాన్ని పేపర్లో చూడడం వేరు. కానీ మూడు రోజుల పాటు అలా జరుగుతూనే ఉండటాన్ని ఛానెల్స్‌లో చూపించడంతో పిల్లలు సైతం అభద్రతాభావానికి గురయ్యారు. అందరిలోనూ ఆందోళన కల్గించింది. అందుకే ఎవరికి వారు మనోధైర్యాన్ని పెంచుకోవాలి.

ప్రశ్న... ఈ నెల 14న ఇండస్ట్రీ చేపట్టనున్న శాంతియాత్రలో పాల్గొంటున్నారా?
జ.. నేను ఈ రోజే ఊరెళ్లిపోతున్నాను.

ప్రశ్న.... కొత్త చిత్రాల వివరాలు?
జ... చాలా కథలు విన్నాను. అన్నీ స్క్రిప్ట్‌లు చర్చల దశలోనే ఉన్నాయి. "గమ్యం" దర్శకుడు రాధాకృష్ణతో ఓ చిత్రం, తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్నాను. ఏ సబ్జెక్ట్ ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడు చేస్తున్నారని అడగకండి. అంతా బౌండ్ స్క్రిప్ట్ అయ్యాకే చెబుతాను. ముందుగా చెప్పేస్తే... అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ చెప్పిన టైమ్‌కు ప్రారంభం కాకపోతే... ఇంకా కాలేదా? అయితే అందులో సరుకు లేదమ్మా? హీరో ఇదమ్మా... అదమ్మా... అంటూ లేనిపోని వార్తలు ఇండస్ట్రీలో రాజ్యమేలుతాయి.

ప్రశ్న... రాధాకృష్ణ దర్శకత్వంలో నటించడానికి కారణం?
జ... "గమ్యం"లో చక్కని మానవీయ విలువల్ని చూపించాడు. అన్ని కోణాలు బాగా చూపించాడు. ఆయనలో సిన్సియారిటీ బాగా నచ్చింది.

ప్రశ్న... మీ సంపాదనంతా ఏ వ్యాపారాల్లో పెడుతుంటారు?
జ... నేను బిజినెస్‌మేన్‌ని కాదు. ఎలా వచ్చిందో... అలాగే ఖర్చవుతుంది. ఈ రంగంలో వచ్చింది. ఈ రంగంలోనే ఖర్చుపెడుతుంటాను.