దేవరగట్టులో అదుపుతప్పిన కర్రల యుద్ధం!

PNR|
కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతియేడాది కర్రల యుద్ధం జరుగుతుంది. ఇదేంటి.. కర్రల యుద్ధం జరగడమేమిటి? అని ఆశ్చర్య పోతున్నారా? అదే అక్కడి ప్రత్యేకత. దేవరగట్టులో గట్టు మల్లన్న అనే పేరుతో ఆలయం ఉంది. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతియేడాది దసరా పండుగ సందర్భంగా బన్నీ ఉత్సవాలు జరుగుతాయి.

ఈ ఆలయంలో ఉన్న మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల వాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కదూ.! ఇక ఇక్కడ నుంచే అసలు కథ ఆరంభమవుతుంది. మల్లన్న విగ్రహాన్ని కైవసం చేసుకునేందుకు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకుంటారు. ఈ దాడుల్లో చిన్నాపెద్దా అనే తారతమ్యం ఉండదు. ఎవరు ఎదురుపడితే వారిని కర్రలతో కొడుతూ ముందుకు దూసుకెళుతారు.

కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఈ ఏడాది నుంచి అరికట్టాలని ప్రభుత్వం, పోలీసులు నిర్ణయించి, పటిష్టమైన బందోబస్తును కల్పించారు. అయితే బన్నీ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. కర్రల యుద్ధంలో యధావిధిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో పలువురు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బందోబస్తుకు వచ్చిన పోలీసులు మాత్రం మిన్నకుండి పోయారు. ఆచారమా? మజాకా? అని గ్రామస్థులు అంటున్నారు.


దీనిపై మరింత చదవండి :