అనంత పద్మనాభుని సంపద ఎంతో భక్తులకు చాటిచెప్పాలని కోర్టుకెక్కిన సుందర రాజన్ హఠాత్తుగా మరణించడం తాజా మలుపు. నేలమాళిగల్లో ఇటీవల లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పురాతన సంపద వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. అసలు ఈ సంపద గురించి బయట ప్రపంచానికి తెలియడానికి ప్రధానకారణమైన, నేలమాళిగలు తెరవాలని న్యాయపోరాటం చేసిన వ్యక్తి సుందరరాజన్.ఆయన వయోభారంతో మరణించారా...లేక ఏదైనా బలమైన కారణం ఉన్నదా అన్నది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఏడుపదుల వయసులో కూడా సుందర రాజన్ నిన్నమొన్నటి వరకు హుషారుగానే తిరిగారు. ఆలయం పక్కనే వారి ఇల్లు. ఆయన గతంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భద్రతా విభాగంలో కీలక బాధ్యతలే చేపట్టారు. ఆ తరువాత న్యాయవాదవృత్తిలో స్థిరపడ్డారు. సుందరరాజన్ తండ్రి రాజవంశస్థుల దగ్గర న్యాయ సలహా దారునిగా పనిచేశారు.