శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (14:58 IST)

తొలి భారతీయుడుగా ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో ఆయన్ను అనుసరిస్తున్న వారి సంఖ్య ఏకంగా ఐదు కోట్ల మందిని దాటేసింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. తద్వారా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. 
 
ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 10.8 కోట్ల మంది ఫాలోవర్లతో ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉండగా, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 6.4 కోట్ల మంది ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఒబామా, ట్రంప్ తర్వాత మోడీ మూడో స్థానంలో నిలిచారు.
 
కాగా, ఈ సందర్భంగా ఐదు కోట్ల మంది ఫాలోవర్లు దాటిన ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షితులైన ఆనేక మంది ప్రజలు ప్రధానిని సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. 
 
కాగా, ప్రస్తుతం మోడీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో 4.48 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ రెండింటిని కలుపుకుని ఐదు కోట్లకు చేరుకుంది. 
 
సోషల్ మీడియా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒబామా 18.27 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉండగా, మోడీ 11.09 కోట్ల మంది ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచినట్లు 'సెమ్ రష్' అనే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ ప్రకటించింది.