శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 7 మే 2015 (17:57 IST)

దుబాయ్‌లో ఈ-తాటిచెట్లు... ఉచితంగా వైఫై అందించే స్మార్ట్ పామ్!

సాధారణగా నక్షత్ర హోటల్స్, పార్కులు, మాల్స్‌లలో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కానీ, దుబాయ్ బీచ్‌లలో తాటి చెట్ల నుంచి ఈ సౌకర్యం పొందవచ్చు. అంటే... దుబాయ్ బీచ్‌‌లలో ఈ-తాటి చెట్లు సందడి చేస్తున్నాయి. దుబాయ్ మున్సిపాలిటీకి చెందిన స్మార్ట్ పామ్ సోలార్ టెక్ హచ్ ప్రాజెక్టు ద్వారా బీచ్‌లలో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాటి చెట్లను నమూనాగా తీసుకుని రూపొందించిన ఇవి అచ్చం అదే రూపంలో ఉండడం విశేషం. 
 
ఈ 'చెట్టు' కేవలం ఆరు మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఇది పనిచేయడానికి కావలసిన విద్యుత్తును దీనికి అమర్చిన సోలార్ పవర్ ప్యానెల్స్ ద్వారా తయారు చేసుకుంటుంది. దీనికి 12 ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. దీనికి ఒకేసారి 12 పరికరాలను అనుసంధానం చేసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ చెట్ల నుంచి చార్జింగ్‌తో పాటు.. ఉచితంగా వైఫై సౌకర్యం కూడా పొందవచ్చు. 
 
అంతేకాదండోయ్... బీచ్లో వాతావరణం ఎలా ఉండబోతోందన్న హెచ్చరికలు కూడా వీటి నుంచి వస్తాయట. వీటికే కెమెరా లౌడ్స్పీకర్లు కూడా అమర్చి ఉండటంతో వాటి నుంచి హెచ్చరికలను బయటకు కూడా వినిపిస్తుంటారు. నిజానికి ఇది తాటిచెట్టు కాదు.. అచ్చం తాటిచెట్టు రూపంలోనే కనిపించే ఒక టెక్ హబ్ అన్నమాట. త్వరలోనే దుబాయ్లో ఉన్న బీచ్లన్నీ కూడా స్మార్ట్ అయిపోతాయని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా చెప్పారు.