ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే మరింతగా నష్టపోతామని కాంగ్రెస్ అధిష్టానంతోపాటు రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు వాపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉందని, ఇది ఈ నెల 18వ తేదీన, ఆ తర్వాత జరిగే 17 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపుతుందన్న భావనను వారు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీన వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తిన్న విషయం తెల్సిందే. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోగా.. భాజపా పాలిత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక యూపీలో పార్టీ పరిస్థితి కొత్తగా చెప్పనక్కర్లేదు. రాహుల్, ప్రియాంక, సోనియా, మన్మోహన్ ఇలా ఎందరో ఉద్ధండులు ప్రచార బరిలోకి దిగినా.. అభ్యర్థులను గెలిపించుకోవడంలో అర్థ సెంచరీ మార్కును కూడా దాటలేక పోయారు.