తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయన ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ గడచిన రెండేళ్ళ కాలంలో చంద్రబాబు దృష్టంతా మహానేత దివంగత వైఎస్ఆర్ను అప్రతిష్టపాలుచేయడమే లక్ష్యంగా సాగిందన్నారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైఎస్ మరణించిన తర్వాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నారని, అందుకే ఈ రాజకీయ కుట్రలను కోర్టు గడప వరకు తీసుకెళ్ళారని జగన్ విమర్శించారు. మహానేత మననుంచి దూరమయ్యాక రాష్ట్రం పరిస్థితి చూస్తే బాధేస్తోందన్నారు.