ప్రియతమా! ఏమని పిలువను...?!!

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified సోమవారం, 30 జనవరి 2012 (14:22 IST)
WD
ప్రియతమా!
ఏమని పిలువను...
మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..

నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ
మనం పాడుకునే చెణుకును గుర్తు చేస్తూ..

ప్రపంచం సాక్షిగా..
మనం నడకను కొనసాగిద్దామంటూ...
మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...

నువ్వొచ్చావు.
ఆశాజీవన లతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..

నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...

సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...
ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...
నువ్వొచ్చావు..

జనజీవన సంస్కృతులను
కళ్లముందు ఆవిష్కరిస్తూ...
ఇన్నాళ్లుగా.. మనిషి సాగిస్తున్న
సహస్ర వృత్తుల శ్రమజీవిత పాఠాలు నేర్పుతూ..
నువ్వొచ్చావు...

ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?


దీనిపై మరింత చదవండి :