అద్భుత అనుభూతి : అమర్‌నాథ్ సందర్శనం

Munibabu| Last Modified మంగళవారం, 22 జులై 2008 (12:19 IST)
భారతదేశంలోని హిమాలయా పర్వతాల్లో వెలసిన అమర్‌నాథ్ సందర్శనం ఓ అద్భుత అనుభూతిని మనకు సొంతం చేస్తుంది. గడ్డకట్టే మంచులో అమరనాథ్ సందర్శన కోసం చేసే పయనంలో ఓ అందమైన లోకం మన కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అమరనాథ్ యాత్ర కోసం దేశంలోని అనేకమంది ఎప్పుడా అని ఎదురు చూస్తుంటారు.

జులై నెలలో జరిగే ఈ పర్యటనకోసం దేశ వ్యాప్తంగా అనేకవేలమంది ముందస్తుగానే సిద్ధమవుతారు. హిమాలయాల్లోని అమర్‌నాథ్‌లో ఏర్పడే సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించడం కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగే ఈ యాత్ర అటు ఆధ్యాత్మికతతోపాటు ఇటు మనలో కాస్త భయాన్ని సైతం రేకెత్తించడం గమనార్హం.

ఎత్తైన పర్వతాలు ఓపక్క, అగాధాలను తలపించే లోయలు మరోపక్క పూర్తిగా నడక మీద ఆధారపడి సాగే ఈ పయనంలో మధ్య మధ్యలో స్థానికులచే ఏర్పాటు చేయబడిన భండారా క్యాంపుల్లో లభించే ఆతిధ్యం మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. జమ్ము నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మధ్యలో ఎన్నో మజిలీలను దాటుతూ చివరకు అమర్‌నాథ్ చేరుకుంటుంది.

సతీసమేతుడైన పరమశివుడు సృష్టి రహస్యాలను తన భార్యకు వివరించడానికి కాలినడకన అమరనాథ్ పరిసరప్రాంతాల్లో విహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా పరమశివుడు చుట్టిన ప్రదేశాలే అమర్‌నాథ్ యాత్రా సమయంలో మనకు మజిలీలై ఆకట్టుకుంటాయి.
దీనిపై మరింత చదవండి :