కళా సంపద ఉట్టిపడే "నల్‌దుర్గ్"

FILE

కళా సంపద, వాస్తు నైపుణ్యంతో అలరారే పురాతన చరిత్ర కలిగిన కట్టడాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో మహారాష్ట్రలో విలసిల్లుతున్న "నల్‌దుర్గ్" కోట ఒకటి. మన పురాణాల్లోని నలుడు, దమయంతి నివసించినదిగా చెప్పబడుతున్న ఈ కోట పేరుతోనే అక్కడో గ్రామం కూడా వెలిసిందని పూర్వీకులు చెబుతుంటారు.

హైదరాబాద్-పూణే జాతీయ రహదారికి పక్కగా ఎత్తయిన కొండపైన కట్టిన బలిష్టమైన కోటనే "నల్‌దుర్గ్". 126 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ కోటలో 114 బురుజులు ఉన్నాయి. వాటిలో ఉప్లి బురుజు, నల్ బురుజు ప్రధానమైనవి, ఇవి రెండూ ఎంతో ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దారు.

నల్‌దుర్గ్‌ను చూడగానే... దాని రాజఠీవికి, వైశాల్యానికి ఆశ్చర్యం కలుగకమానదు. భారతీయ శిల్ప, వాస్తు కళా నైపుణ్యాలకు నిలువెత్తు నిదర్శనంగా అనిపించే ఆ కోట.. భారతీయులకు ఒక గొప్ప చారిత్రక సంపద అనడంలో అతిశయోక్తి కాదు. ప్రభుత్వం గనుక మరికాస్త శ్రద్ధ తీసుకున్నట్లయితే, నల్‌దుర్గ్ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందగలదు.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉస్మానాబాద్‌లో ఉంటుంది నల్‌దుర్గ్ ఊరు. అక్కడి నుంచి షిరిడీ సాయిబాబా సమాధి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరింత వివరంగా చెప్పాలంటే... షోలాపూర్‌కు 40 కిలోమీటర్ల ఇవతల ఉండేదే నల్‌దుర్గ్. నల్‌దుర్గ్ నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చరిత్ర సుప్రసిద్ధమైన తుల్జాపూర్ భవానీ ఆలయానికి చేరుకోవచ్చు.
వెలుతురు కోసం వజ్రాలు...!
  ఆ రోజుల్లోనే పడకగదులకు ఆనుకుని ఉండే బాత్‌రూంలను నిర్మించారు. గాలి, వెలుతురుల కోసం తీసుకున్న శ్రద్ధ కూడా విస్మయం కలిగిస్తుంది. బాత్రూంలలో రాత్రి వేళల్లో వెలుగుకోసం కాంతులీనే వజ్రాలను పెట్టేవారట...!      


చూసేందుకు నల్‌దుర్గ్ ఓ చిన్న పల్లెటూరులాగా స్తబ్దంగా కనిపించవచ్చుగానీ, పదిహేడో శతాబ్దం దాకా చరిత్రలో ఇదో కీలకమైన ప్రదేశంగా విరాజిల్లింది. ఈ కోటలోని పానీ మహల్, అంబర్‌ఖానా, మున్సిఫ్ కోర్టు భవనం, బారాదరి, రాణీ మహల్, రంగ మహల్, హాథీ ట్యాంక్ లాంటివన్నీ చూడదగ్గ పర్యాటక స్థలాలే.

నల్‌దుర్గ్ కోట చుట్టూ 1613లో పటిష్టమైన గోడ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా ఈ కోటను బలోపేతం చేశాడని పురావస్తు శాఖవారు ఏర్పాటు చేసిన నీలంరంగు బోర్డు పేర్కొంటున్నది. 15, 16 శతాబ్దాలలో చాళుక్య రాజులు, బహమనీలు, ఆదిల్‌షాహీ ప్రభువులు కూడా ఈ కోటను శత్రు దుర్బేధ్యంగా తయారు చేశారు. ఇప్పుడు కోటలోని బారాదరి, రంగ మహల్‌కు మరమ్మత్తులు చేస్తున్నారు.

కోట అందం ఒక ఎత్తయితే, పానీ మహల్ శోభ మరో ఎత్తు. నది మధ్యలో కట్టిన అద్భుతమైన నిర్మాణమిది. రెండవ ఇబ్రహీం ఆదిల్‌షా కాలంలోనే మహమ్మద్ ఇమాదిన్ అనే శిల్పి ఈ భవనాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కోట అంతర్భాగంలోనే బోరీ అనే చిన్న నది ప్రవహిస్తూ ఉండటం, 86 అడుగుల వెడల్పయిన ఆ నది మధ్యలో మహల్ ఉండటం చూసేవారికి అద్భుతం అనిపిస్తుంది.

50 మెట్లు ఎక్కి ఈ మహల్‌కి చేరుకోవాల్సి ఉంటుంది. మెట్ల చివర సొరంగం లాంటి ప్రదేశం ఉంటుంది. అది దాటి వెళ్లగానే విశాలమైన పడక గదులు, వరండాలు, బాల్కనీలు కనిపిస్తాయి. ఆ రోజుల్లోనే పడకగదులకు ఆనుకుని ఉండే బాత్‌రూంలను నిర్మించారు. గాలి, వెలుతురుల కోసం తీసుకున్న శ్రద్ధ కూడా విస్మయం కలిగిస్తుంది. బాత్రూంలలో రాత్రి వేళల్లో వెలుగుకోసం కాంతులీనే వజ్రాలను పెట్టేవారట.

నాలుగు శతాబ్దాలు గడచినా నల్‌దుర్గ్ మహల్ సౌందర్యం చెక్కుచెదరకుండా ఉంటుంది. అప్పట్లో ఎంతమంది శత్రు రాజుల కళ్లు దీనిపై ఉండోవోగానీ... మహల్ వద్ద ఉంచిన శిలాఫలకం మీద రాసిపెట్టిన నాలుగు ఫంక్తులు మనల్ని చకితుల్ని చేస్తాయి. అందాన్ని అందంగా ఆస్వాదించాలని, లేకపోతే అంది అంధత్వంతో సమానమని వాటి సారాంశం.

మంచిదృష్టితో స్నేహితులుగా చూస్తే మీ కనులు వెలుగులతో నిండుతాయి. లేదంటే, కళ్లులేని కబోదులవుతారంటూ... అరబ్బీ భాషలో రాసిన ఓ శిలాఫలకాన్ని నల్‌దుర్గ్ ప్రధాన మందిరంలోని ఒక గోడలో అమర్చారు. శిల్పపరంగా, చారిత్రికంగా ఇంతటి ప్రాధాన్యం కలిగిన నల్‌దుర్గ్ ప్రస్తుతం గబ్బిలాల నివాస ప్రాంతమైపోయింది.

Ganesh|
కోట అందాలు చూడదగ్గవే అయినా, గబ్బిలాల దుర్గంధాన్ని భరించి అక్కడి వెళ్లే పర్యాటకులను వేళ్లమీద లెక్కించవచ్చు. ఇంత అద్భుతమైన అందాలను తనలో ఇముడ్చుకున్న నల్‌దుర్గ్‌ను నిర్లక్ష్యంగా వదిలేయకుండా మన పర్యాటక శాఖ అభివృద్ధి చేసినట్లయితే... పర్యాటకులు ఇక్కడి బారులు తీరడం మాత్రం ఖాయం.


దీనిపై మరింత చదవండి :