"కుంటాల జలపాతం"లో స్నానం చేసొద్దామా...?!

FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జలపాతం.. కుంటాల జలపాతం. ఇది అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాదు జిల్లాలో నెలకొన్న సహ్యాద్రి పర్వత ఫంక్తుల్లో.. కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో కలదు. ఏడవ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాదు వెళ్లే మార్గంలో.. నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొద్దిగా కుడివైపున ఈ జలపాతం ఉంది.

45 మీటర్ల ఎత్తు నుంచి గలగలా సవ్వడి చేస్తూ, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ కుంటాల జలపాతం. ఏక శిలలోనే జలపాతం ఏర్పడటం వల్ల చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. దిగువభాగంలో... సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో... గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా భావించబడే ఈ జలపాతాన్ని పూర్వం "శకుంతల జలపాతం"గా పిలిచేవారట. ఎందుకంటే, దుష్యంతుడి భార్య అయిన శకుంతల ఈ జలపాతం మరియు పరిసరాల సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలై, మైమరిచిపోయి... తరుచుగా ఇక్కడికివచ్చి, ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజల నమ్మకం. అందుకనే దీన్ని శకుంతల జలపాతంగా ప్రజలు పిలుస్తుంటారు.

ఈ అటవీ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు "సోమన్న గుండం"గా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.

ప్రకృతి వర ప్రసాదంగా భావించబడే ఈ జలపాతాన్ని సందర్శించడానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా.. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ జలపాతానికి చుట్టూ ఉండే అరణ్యంలో అన్ని జాతుల వృక్షాలు ఉండగా, ఎక్కువగా టేకు చెట్లతో నిండి ఉన్నాయి. అలాగే అనేక రకాల జంతువులు, పక్షులు కూడా నివసిస్తున్నాయి.

Ganesh|
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే... కుంటాల జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండటం, సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం. గతంలో ఈ జలపాతంలో పలువురు పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. 2000 సంవత్సరపు వర్షాకాలము నుండి 2006 వర్షాకాలము వరకు 35 మంది ఇక్కడ ప్రమాదానికి గురై మరణించడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


దీనిపై మరింత చదవండి :