"కుమావన్"లో దేవతలు నివాసం ఉండేవారట..!

Himalayas
Ganesh|
FILE
ఆకాశాన్ని అంటుతున్న హిమాలయా పర్వతాలు ఓవైపు.. వాటి నుంచి జాలువారే సెలయేర్లు మరోవైపు.. ఆ పర్వత సానువుల మీద ఆకాశంలోకి ఏపుగా పెరుగుతూ.. ఒకదాని ప్రక్కన మరొకటిగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా దర్శనమిచ్చే ఫైన్ చెట్ల అందాలు.. ఎన్నెన్నో లోయలు.. ఆ లోయలనిండా రంగు రంగుల పుష్పాలు.. వెరసీ "కుమావన్ పర్వతాలు".

భారతావనికి ఉత్తరాదిన పెట్టని కోట గోడల్లాగా ఉండే హిమాలయా పర్వతాలను భారతీయులు అత్యంత పవిత్రమైనవిగా పూజిస్తుంటారు. ఈ హిమ పర్వతాల్లో దేవతలు నివాసం ఉంటారని హిందువుల నమ్మకం. హనుమంతుడు నేటికీ హిమాలయాల్లో ఉన్నాడని విశ్వసిస్తుంటారు కూడా..! ఇక పరమశివుడి కైలాస పర్వతం సైతం ఇక్కడే ఉంది.

అలాగే.. పవిత్ర నదులైన గంగ, యమున, సింధు, నదుల జన్మస్థానం కూడా హిమాలయా పర్వాతాల్లోనే..! పవిత్ర రుద్రాక్షలను అందించే మొక్కలతో పాటు వందలాది ఔషధ మొక్కల నిలయం కూడా హిమాలయాల్లోనే. హైందవ పురాణాలన్నింటిలోనూ హిమాలయాల ప్రాశస్త్యం వర్ణించబడింది.

ఆ సంగతలా ఉంచితే.. హిమాలయా పర్వతాలను పలు శ్రేణులుగా విడగొట్టి పిలుస్తుంటారు. వాయువ్యంలో కాశ్మీర్ మొదలుకుని ఈశాన్య భారతదేశం వరకు విస్తరించిన ఈ హిమాలయా పర్వతాలలో పైన మనం చెప్పుకున్న "కుమావన్ ప్రాంతం" అత్యంత సుందరమైనది. ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ కుమావన్ పర్వతాలలో హిమాలయాలలోనే అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడే పుణ్యక్షేత్రాలున్నాయి.

కాశ్మీరీ అందాలకు సాటిగా నిలిచే లోయ ఒకటి కుమావన్ పర్వతాలలో ఉంది. అదే "సౌర్ లోయ". ఆ లోయనుంచి ఎటు చూసినా పచ్చటి ప్రకృతే మనకు దర్శనమిస్తుంది. ఎత్తుగా లేచి నిలబడ్డట్లుగా ఉండే పర్వతాలు, ఆ పర్వతాల మధ్య పాము మెలికలను పోలిన కాలిబాటలు, ఆ బాటల వెంట ప్రయాణం చేస్తుంటే అడగడుగా ఓ దేవతా మందిరం.. ఇలా వర్ణించేందుకు వీలులేనంతటి విశేషాలను తనలో దాచుకున్నదే "కుమావన్".

Himalayas
FILE
ప్రకృతి దేవతల ప్రతిరూపాలను ఇక్కడి కొండలు, గుట్టలు, లోయలలో ప్రతిష్టించారు. ఈ లోయల్లో ఉండే అలాంటి మందిరాల్లో ఒకటైన "చితాయ మందిరం" ముందు వందలకొద్దీ గంటలు వేలాడగట్టబడి ఉంటాయి. అక్కడి దేవతకు మన కష్టాలను విన్నవించుకునేందుకు కాగితాలను వాడతారు. తమ కోరికలను ఆ కాగితాలపై రాసి.. గంటతో సహా మందిర ప్రాంగణంలో వేలాడదీస్తారు. ఇలా చేస్తే.. ఆ దేవత తమ విన్నపాలను తప్పనిసరిగా మన్నిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

ప్రకృతి సహజంగా ఏర్పడిన 48 సరస్సులు కుమావన్ పర్వతాల అందాలను మరింత ద్విగుణీకృతం చేసేలా ఉంటాయి. ప్రతి పర్వతం మధ్యన ఒక సరస్సు ఉంటుంది. ఆ పర్వతం మీద పడిన వర్షపు నీరు, కరిగిన మంచు సరస్సును చేరతాయి. ఆ సరస్సుల్లో అత్యంత స్వచ్ఛమైన నీరు, ఆ నీటిలోపల చుట్టూ ఉన్న ప్రకృతి అందాల ప్రతిబింబం గోచరిస్తూ.. కళ్లకు విందు చేస్తుంటుంది.

కుమావన్ మొత్తం 73 పర్వతాలను కలిగి ఉంది. ప్రతి పర్వతం నేరుగా ఆకాశంలోకి చొచ్చుకుని వెళుతున్న పదునైన ఖడ్గంలాగా రూపుదిద్దుకుని ఉంటుంది. వీటితోపాటు 17 హిమఖండాలున్నాయి. ఇలాంటి ప్రకృతి మధ్య దేవతలు కాకుండా మనుషులెందుకు ఉంటారు చెప్మా అనిపించకమానదు సుమా..!


దీనిపై మరింత చదవండి :