క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్, నీలగిరి కా రాణి "ఊటీ"

Ooty
Ganesh|
FILE
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం "ఊటీ". దీని అధికారిక నామం "ఉదక మండలం" కాగా, "క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్‌"గా పేరుగాంచింది. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. అందుకే మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశంలో సేదదీరేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు రెక్కలుగట్టుకుని వాలిపోతుంటారు.

ఊటీ చరిత్రను చూస్తే.. పూర్వకాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఆ తరువాత గంగరాజులు, 12వ శతాబ్దంలో హొయసాలల వంశ రాజైన విష్ణువర్ధనుడి సామ్రాజ్యాలలో భాగమయ్యాయి. చివరగా టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి ఆ తరువాత 18వ శతాబ్దంలో తెల్లవారి సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి.

ఆంగ్లేయుల కాలంలోనే కోయంబత్తూర్ ప్రావిన్స్ గవర్నర్‌గా పనిచేసిన జాన్ సుల్లివాన్ నీలగిరి పర్వత శ్రేణుల్లో కొలువైయున్న ఊటీ చల్లటి వాతావరణం, అక్కడి వన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఊటీ ప్రాంతంలో అప్పట్లో నివసిస్తున్న కోయజాతి ప్రజలకు అతి తక్కువ పైకం ముట్టజెప్పి ఆ ప్రాంతాన్ని కొనుగోలు చేశాడు. అలా ఊటీ ప్రాంతంలోని స్థలాలన్నీ మెల్లిమెల్లిగా ఆంగ్లేయులపరం కావటంతో చాలా వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది.

ఆ తరువాత మద్రాసు సంస్థానానికి ఊటీ వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఊటీలో ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయల సౌందర్యానికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని "క్వీన్ ఆఫ్ హిల్స్" అంటూ ముద్దుగా పిలుచుకునేవారు.

ఊటీలో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంట్ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్‌హౌస్, కాఫీ తోటలు హిందూ దేవాలయాలైన మురుగన్ కోయిల్, వెంకటేశ్వర స్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఊటీ సమ్మర్ ఫెస్టివల్‍‌కు పెట్టింది పేరు. అలాగే మే నెలలో ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి.

ఊటీ పరిసర ప్రాంతాలలో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్‌బాక్‌ డాన్స్‌, వెక్‌ హిల్స్‌, స్నోడెన్‌ పీక్‌, కూనూరు, డాల్ఫిన్స్‌ నోస్‌, లాంబ్స్‌ రాక్‌, లాన్‌ ఫాల్స్‌, సెయింట్‌ కేధరిన్‌ ఫాల్స్‌, సిమ్స్‌ పార్క్‌, సిమ్స్‌ పార్క్‌, కోటగిరి, కొడనాడ్‌ పాయింట్ తదితరాలు మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు.


దీనిపై మరింత చదవండి :