చూపు తిప్పుకోనీయని హిల్ స్టేషన్ "ఖండాలా"

waterfall
Ganesh|
FILE
భారతదేశంలోని ప్రధాన హిల్ స్టేషన్లలో "ఖండాలా" ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో రాష్ట్రానికి పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహా నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో కొలువైయున్న ఖండాలాలో ట్రెక్కింగ్ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.

చిన్నది మరియు అందమైన ఈ ఖండాలా హిల్‌ స్టేషన్‌లో కనుచూపుమేరా పచ్చని ప్రకృతి మినహా మరేమీ కనిపించదు. ప్రకృతి ప్రేమికులకు, మరియు కొత్త జంటలకు, లవర్స్‌కు స్వర్గధామంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాల పర్వత ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది.

గతంలో ఖండాలా చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అనంతరం బ్రిటీష్ వారి పాలన వచ్చాక... దక్కన్ పీఠభూమి మరియు కొంకణ్ మైదానాల మధ్య గల రోడ్డు మార్గంలో గల భోర్‌ఘాట్‌లో భాగమయ్యింది. బోర్ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలను కలిగి ఉండేవి. ముంబై-పూణే ఎక్ర్స్‌ప్రెస్ రైలు మార్గం, అలాగే ముంబై మరియు పూనేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.

అదలా ఉంచితే.. ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో "లోనవాలా" అనే మరో ప్రఖ్యాత హిల్ స్టేషన్ కూడా చూడదగ్గది. ఖండాలాకంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు.. తుగవులి, లోనావాలా మరియు భుషి సరస్సుల హొయలు.. ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశేషాలతో లోనావాలా అలరారుతుంటుంది.

ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువైయున్న కర్ల మరియు భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని రాతి ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్ పాయింట్‌ కూడా తప్పక చూడాల్సిందే.


దీనిపై మరింత చదవండి :