నర్మదా నదీమతల్లి జన్మస్థలం "అమర్ కంటక్"

FILE

దారిపొడవునా దేవదారు, సాల్, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పేర్లుండే పెద్ద పెద్ద పచ్చటి వృక్షాలు, పేర్లు తెలియని తీగలతో అల్లుకున్న పొదలు, చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతం పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అలా వెళ్ళగా, వెళ్ళగా కనుచూపుమేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యాన్ని చూస్తే గుండె లయ తప్పదు కదా అనిపిస్తుంది.

ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే "అమర్ కంటక్" ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉంది. నర్మదానది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే... దట్టమైన అడవులగుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్ కంటక్ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది.

పురూరవుడి తపస్సు ఫలితంగానే...!
  పురూరవుడు తపస్సు చేస్తే... శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను కానీ మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచేవారెవరని ప్రశ్నిస్తాడు. వింధ్య పర్వతుడు తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట...      
నర్మదా నది స్థానిక మైకేల్ కొండల్లో పుట్టి వింధ్యసాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

నర్మదానది పుట్టిన చోటనే గుడి వెలసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతర్లు జరుగుతుంటాయి. అన్నింటికంటే, శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది.

అమర్ కంటక్ మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు జాతర్ల సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రినాడు నర్మదానదిలో స్నానం చేసి, ముందుగా శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతారాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

Ganesh|
నర్మదామాత ఆలయం గురించి అనేక పురాణ కథలు వినిపిస్తుంటాయి. క్రీ.శ. 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే నర్మదానది అమర్ కంటక్‌లోనే పుట్టేందుకు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే, దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట.


దీనిపై మరింత చదవండి :