ప్రకృతి అందాల నిలయం సిమ్లా

Munibabu|
భారతావనిలో వేసవి పర్యాటక కేంద్రాలుగా పేరొందిన వాటిలో సిమ్లాను ప్రముఖంగా చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ పర్వత ప్రాతం దేశ విదేశీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆనందంతో పాటు ఓ అద్భుతమైన అనుభవాన్ని మనకు పరిచయం చేసేదిగా సిమ్లా యాత్రను చెప్పుకోవచ్చు. ఘాట్ రోడ్లు పర్వతాల్లో దూరిపోయే సొరంగ మార్గాలు, పొడవైన వంతెనలు ఇలా ప్రతీదీ సిమ్లా యాత్ర సందర్భంగా మనకు కనువిందు చేస్తాయి.

సిమ్లాలో చూడాల్సిన ప్రదేశాలు
అద్భుతమైన అందాల నడుమ కొండల్లో ఉన్న సిమ్లా ప్రాంతం చేరుకోవడం ఓ మధురానుభూతి. దీంతోపాటు సిమ్లాలో ప్రకృతి అందాలకు కొదవలేదు. అలాగే ఇక్కడి వాతావరణం సైతం పర్యాటకులకు వింతైన అనుభూతిని మిగుల్చుతుంది. సిమ్లా ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఎర్రని యాపిల్స్ వేలాడుతుండే ఆ చెట్లను చూస్తూంటే భలే ముచ్చటగా ఉంటాయి.

పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్నా అద్భుతమై ప్రకృతి మనకు కనువిందు చేస్తుంటుంది. నాటి బ్రిటీష్ పాలనలో సిమ్లా వేసవి విడిదిగా ఉపయోగించేవారు దేశ విభజన సమయంలో కాశ్మీర్ సమస్యపై చర్చ సిమ్లాలోని వైస్ రాయ్ భవనంలోనే జరగడం విశేషం. పర్యాటకులు తమ పర్యటనలో భాగంగా ఈ భవనాన్ని సందర్శిస్తుంటారు.

ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా సిమ్లాలో ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. దూరంగా ఉన్న హిమాలయా పర్వతాలను అందంగా కళ్లముందు సాక్షాత్కరింపజేసే స్కాండల్ పాయింట్, చర్చి లైబ్రరీ, లక్కడ్ బజార్ లాంటివి సిమ్లాలోని చూడదగ్గ ప్రదేశాలు.
దీనిపై మరింత చదవండి :