ఆకాశాన్ని తాకే శిఖరాలు, పాతాళాన్ని మరిపించే లోయలు, చుట్టూ పచ్చని అడవులు, పర్వతాలు, కొండచరియల నుండి జాలువారే సెలయేటి గలగలను చూడాలంటే... ఈశాన్య సుందరాంగి అయిన షిల్లాంగ్‌ను దర్శించాల్సిందే. భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రమైన మేఘాలయ రాజధానియే ఈ షిల్లాంగ్. ఈశాన్య భారతావనిలో అతి సుందర ప్రదేశాలలో షిల్లాంగ్ ప్రముఖమైనది. షిల్లాంగ్ ప్రకృతి అందాలను చూసి, మోహించి, చుంబించేందుకేనా మేఘరాజు పర్వతాలమీదికి దిగివచ్చాడా అని అనిపిస్తుంది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే, కొండల మీద పాము మెలికలను తలపించే కాలిబాటలు, దట్టమైన అడవులను చుట్టుకుని వస్తుంటాయి...