మంచులో పరుగెడుతూ చిన్నపిల్లల్లా ఆడుకోవాలన్న కోరిక కలిగినవారు తప్పనిసరిగా పర్యటించాల్సిన ప్రాంతమే కులు-మనాలి. కులు మనాలి అంటే ఒకే ఊరి పేరు అని ఎవరైనా అనుకుంటారు. అయితే కులు, మనాలి అనేవి రెండు వేరు వేరు ఊరి పేర్లు. ఇవి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చిట్టచివర్లో ఉంటాయి. ముందుగా కులు, అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మనాలిలు... తెల్లటి మంచుదుప్పటి కప్పుకుని మరీ మనకు స్వాగతం పలుకుతాయి. సిమ్లా నుంచి మనాలి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా తొమ్మిది గంటలసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచీ సరాసరి మనాలికి వెళ్లే ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుంచయితే సుమారు 18 గంటలసేపు ప్రయాణించాలి.