మేఘాలయ "మేఘాలలో" తేలిపోదామా...?!

Meghalaya
Ganesh|
FILE
పచ్చని చెట్లమధ్య తెల్లని మేఘాలు రాసి పోసినట్లుండే మేఘాలయకు వర్షాకాలంలో వెళ్లటం ఒక అందమైన అనుభూతి. రోడ్ల పక్కన ఉండే చెట్లు, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం పచ్చని రంగుతో పెయింట్ వేసినట్లుగా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపుతో మేఘాలకు ఆలయంగా, ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తుంటుంది.

భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రమైన 300 కిలోమీటర్ల పొడవు, వంద కిలోమీటర్ల వెడల్పుతో పర్వతమయంగా ఉంటుంది. మేఘాలయకు ఉత్తరాన అస్సాం రాష్ట్ర సరిహద్దుగా నది.. దక్షిణాన షిల్లాంగ్ పట్టణం ఉంటుంది. ఇదే మేఘాలయ రాష్ట్ర రాజధాని కూడా...!

మేఘాలయ వాతావరణం మరీ వేడికాదు, మరీ చల్లన కాదు. కానీ వర్షాలు మాత్రం భారతదేశంలోనే అత్యధికం. కొన్ని ప్రాంతాలలో 1200 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. షిల్లాంగ్ దక్షిణాన ఉన్న చిరపుంజి పట్టణం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆ దగ్గరలోని మాసిన్రామ్ కూడా అత్యధిక వర్షపాతం నమోదైనదిగా ప్రపంచ రికార్డును కలిగి ఉంది.
ఆసియాలోనే పరిశుభ్రమైనది..!
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని మాలినోంగ్ గ్రామం కూడా మేఘాలయలో చూడదగ్గది. ఇది ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. రంగురంగులతో పూచే పూలు, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి గృహాలు కలిగిన మాలినోంగ్... మేఘాలయలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాలలో ఒకటిగా...


షిల్లాంగ్ సమీపాన ఉన్న "ఉమియం" సరస్సు మేఘాలయ రాష్ట్రంలో మూడోవంతు అటవీమయం. పశ్చిమాన 'గారో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి', 'జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి కాని ఇవి మరీ ఎత్తైనవి కావు. 'షిల్లాంగ్ శిఖరం' అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు). పర్వతాలలో చాలా గుహలలో విలక్షణమైన 'స్టేలక్టైటు', 'స్టేలగ్మైటు' సున్నపురాయి ఆకృతులు దర్శనమిస్తుంటాయి.

వర్షాలు ప్రారంభం అయిన తరువాత మేఘాలయలో పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లే ప్రదేశం షిల్లాంగ్‌కు సమీపంలోగల చిన్న చిన్న గుట్టలు.. వాటి మధ్యలో రాళ్లు.. వాటి చుట్టూ పెరిగిన పెద్ద పెద్ద చెట్లు కలిగిన ప్రదేశమే. వీటిని ఖాశీ తెగకు చెందిన ఆదివాసీలు ప్రకృతి శక్తులను తృప్తిపరచేందుకు ప్రత్యేకంగా రూపొందించారని చెబుతుంటారు.

షిల్లాంగ్ నుంచి చిరపుంజికి ప్రయాణమార్గం కళ్లకు కనువిందుచేసేలా హాయిగా సాగిపోతుంది. చిరపుంజికి వెళ్లే దారి పొడవునా బంగ్లాదేశ్ మైదాన ప్రాంతాలు, సుడులు తిరుగుతూ పర్వతాలను కప్పేసే పొగమంచు, గలగలమనే చప్పుళ్లతో చిన్న చిన్న జలపాతాలు.. ఎక్కడా ఒక్క క్షణమైనా రెప్ప వేయాలనిపించనీయకుండా చేసే ప్రకృతి సౌందర్యం ప్రతి ఎదనూ అలరిస్తుంది.


దీనిపై మరింత చదవండి :