జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడక్ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలోని మరే ప్రాంతానికీ లేదనే చెప్పాలి. ప్రపంచంలో ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్ మధ్య విస్తరించుకుని ఉన్న ప్రాంతమే లడక్. లడక్‌లోని కార్గిల్ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉండగా, కారకోరమ్ సమీపాన ఉన్న సాసెర్ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల నుంచి వచ్చే శీతలగాలుల కారణంగా ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది. ఒకప్పుడు నదీనదాలతో పచ్చిక బయళ్ళతో అలరారిన లడక్ ప్రాంతం ఇప్పుడు తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. శీతాకాలంలో పర్వతప్రాంతాలపై ఉన్న మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా మారింది. వర్షాలు కురిసినా అవి అననుకూల వర్షాలు కావడంతో అంతగా ఉపయోగం ఉండదు. నిజం చెప్పాలంటే ఇక్కడి ప్రజలు వర్షాలు కురవాలని కోరుకోరు. ఎండ బాగా కాయాలనే కోరుకుంటారు.