'సౌత్ స్పా' సౌందర్యం "కుట్రాలం" జలపాతం..!!

Ganesh|
FILE
"భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు.. అదే ఆనందం.. అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు"... అంటూ ప్రతి ఒక్కరూ పాడుకునేలా, అందరినీ ఓ రకమైన ఉద్వేగంలో ముంచెత్తుతుంది సుందరమైన "కుట్రాలం" జలపాతం. ఎన్నిసార్లు చూసినా తనివితీరని అందం ఆ జలపాతం సొంతం. కనువిందు చేసే ప్రకృతి, ఎత్తయిన కొండల పైనుంచి దుమికే జలపాతాలు, సెలయేటి గలగలలు, ఆహ్లాదపరిచే పచ్చదనంతో ఈ ప్రాంతం ఓ అద్భుతమైన ప్రపంచంలా అనిపిస్తుంది.

ఇక వర్షాకాలంలో అయితే కుట్రాలం భూలోక స్వర్గంగా మారుతుందనటంలో అతిశయోక్తి లేదు. సందర్శకుల తాకిడి, వారి హర్షాతిరేకాలతో కుట్రాలం మార్మోగుతూ ఉంటుంది. "దక్షిణ స్పా"గా వ్యవహరించే ఈ కుట్రాలంలోని జలపాతాలు చాలా ప్రఖ్యాతిగాంచాయి. ఇక్కడ పలు జలపాతాలు ఉన్నా... వాటిలో మెయిన్ ఫాల్స్ ప్రధానమైంది. దీనినే స్థానికులు పెరియ అరువి (అరువి అంటే తమిళంలో జలపాతం అని అర్థం) అని పిలుస్తుంటారు.

ఈ పెరియ అరువియే కుట్రాలం జలపాతంగా పేరుగాంచింది. దీనికి సమీపంలో షన్బగదేవి, చిట్టరువి, తేనరువి, ఐందరువి, పులి అరువి, పళతోట్ట అరువి, పాత కుట్రాలం, బాలరువి... తదితర జలపాతాలున్నాయి. అయితే వీటన్నింటికంటే కుట్రాలం జలపాతంలో వర్షాకాలంలో సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.
నటరాజు నర్తించెనిచట..!
నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే కలదు. అలాగే ఈ ప్రాంతంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు...


తేనరువి వద్ద తేనెపట్టులు అధికంగా ఉండటంతో దానికా పేరు వచ్చినట్లు చెబుతుంటారు. ఇది ప్రమాదకరమైనది కావటంతో ఆ ప్రాంతంలోకి సందర్శకులను అనుమతించరు. ఇక ప్రతి సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు నెల వరకూ కుట్రాలం సీజన్ ఉంటుంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావడంతో తొలి అర్ధభాగంలోనే కుట్రాలం సీజన్ ప్రారంభమయ్యింది.

మహిళలు కుట్రాలంలో స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతులను కల్పించారు. జలపాతాల వద్ద తైల మర్దనం కూడా చేస్తారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు స్థానిక అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవటం వల్ల ప్రశాంతంగా ఇక్కడ సందర్శించవచ్చు. అయితే జలపాతం ఉధృతి పెరిగే సమయాల్లో మాత్రం కుట్రాలం జలపాతాల్లో స్నానాలకు సందర్శకులను అనుమతించరు.

ఇదిలా ఉంటే... కుట్రాలం ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలవబడే ఈ కుట్రాలంలో తెన్‌కాశి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుట్రాలనాథుడుగా కొలువైన శివుడు... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులచే నిత్యపూజలు అందుకుంటున్నాడు.

అలాగే కుట్రాలంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ ఆలయం సమీపంలోని సిద్ధుల గుహ కూడా ప్రసిద్ధి చెందినదే. నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే కలదు. చిట్టూరు, మణి ముత్తారు, పచ్చయారు, తామపర్ణి నదుల జన్మస్థలం కూడా "కుట్రాలమే"..!

ఎలా వెళ్లాలంటే... కుట్రాలం, తమిళనాడులోని చెన్నై నగరానికి 620 కిలోమీటర్ల దూరంలోనూ, కన్యాకుమారికి 137 కిలోమీటర్ల దూరంలోనూ, తిరునల్వేలికి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. కుట్రాలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో "తెన్‌కాశి" రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే.. తిరుచ్చి, మధురై, రాజపాళయం, కోవిల్‌పట్టి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. కుట్రాలంలో సందర్శకుల సౌకర్యార్థం పలు విడిది గృహాలు కూడా అందుబాటులో ఉంటాయి.


దీనిపై మరింత చదవండి :