హిమాలయాల మాటున దాగిన జమ్ము

Jammu
WD
జమ్ము పట్టణానికి మరో పేరు ఆలయాల నగరం (సిటీ ఆఫ్‌ టెంపుల్స్). ఆకాశాన్నంటే శిఖరాలపై కొలువైన అనేక దేవతామూర్తులు, ఎన్నో దేవాలయాలు ఈ నగరంలో కనిపిస్తాయి కాబట్టే జమ్ముకు ఆ పేరు వచ్చింది. ఇక్కడి ప్రజలు హిందీ, పంజాబి, ఉర్దు, ఇంగ్లీషుతో పాటు స్థానిక భాష అయిన డోగ్రీని కూడా మాట్లాడతారు.

చూడాల్సిన ప్రదేశాలు:
పెర్‌ఖోహ్‌: జమ్ముకు మూడు కిలోమీటర్ల దూరంలో సర్కులర్‌ రోడ్డులో ఉన్న పెర్‌ఖోహ్‌, చారిత్రక ప్రదేశమే కాదు, పుణ్యక్షేత్రం కూడా. ఇక్కడి ఒక గుహలో సహజసిద్ధంగా రూపొందిన శివలింగం ఉంది. మహత్తుగల ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ గుహలోంచి వెడితే మరికొన్ని దేవతామూర్తులు దర్శనమిస్తాయి. సుదీర్ఘంగా ఉండే ఈ గుహ రెండవ కొన మనల్ని దేశం వెలుపలకు తీసుకుపోతుంది!

రణ్‌బీరేశ్వర ఆలయం: కొత్త సెక్రటేరియట్‌ సమీపాన షాలిమార్‌ రోడ్డులో ఉన్న ఆలయం పేరే రణ్‌బీరేశ్వర్‌ ఆలయం. దీనిని 1883లో మహారాజా రణ్‌బీర్‌సింగ్‌ నిర్మించినట్టు చెబుతారు. గర్భాలయంలో ఏడున్నర అడుగుల ఎత్తున ఉండే శివలింగం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుంది. ఈ మహాలింగం చుట్టూ 15 నుంచి 38 సెంటీమీటర్ల ఎత్తున ఉండే పన్నెండు శివలింగాలు ఉన్నాయి. ఆలయం చుట్టూరా గోడలలోపల శివలింగాలు పొదిగారు.

WD| Last Updated: శుక్రవారం, 29 జూన్ 2007 (12:49 IST)
సమోన్నత ఉత్తుంగ హిమాలయ పర్వతశ్రేణులకు ఆనుకుని ఉన్న సుందరమైన ప్రాంతం జమ్ము. తీర్చిదిద్దినట్టు ఉండే పూలవనాలు, గలగల పారే సెలయేళ్ళతో అమాయకత్వం ఉట్టిపడే ప్రాంతం జమ్ము. స్వచ్ఛమైన తావి నది - జమ్ముకు ప్రకృతి ప్రసాదించిన మరో వరం.

రఘునాథ ఆలయం: జమ్ము నగరం నడిబొడ్డున ఉన్న రామాలయమిది. దీనిచుట్టూ అనేక ఆలయాలు ఉన్నాయి. జమ్ము, కాశ్మీర్‌ రాజ్యస్థాపకుడైన మహారాజా గులాబ్‌సింగ్‌ 1835లో రఘునాథ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన కుమారుడు మహారాజా రణ్‌బీర్‌ సింగ్‌ 1860లో పూర్తి చేశాడు. ప్రధాన ఆలయం లోపలివైపున గోడలకు బంగారు రేకులతో తాపడం చేశారు. ప్రహరీగోడలలో లక్షలాది సాలిగ్రామాలను పొదిగారు. చుట్టూ ఉన్న ఆలయాలు కూడా రామాయణంలో మనకు తగిలే వివిధ దేవుళ్ళకు చెందినవే కావడం విశేషం.


దీనిపై మరింత చదవండి :