శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Munibabu
Last Modified: మంగళవారం, 22 జులై 2008 (12:19 IST)

అద్భుత అనుభూతి : అమర్‌నాథ్ సందర్శనం

భారతదేశంలోని హిమాలయా పర్వతాల్లో వెలసిన అమర్‌నాథ్ సందర్శనం ఓ అద్భుత అనుభూతిని మనకు సొంతం చేస్తుంది. గడ్డకట్టే మంచులో అమరనాథ్ సందర్శన కోసం చేసే పయనంలో ఓ అందమైన లోకం మన కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అమరనాథ్ యాత్ర కోసం దేశంలోని అనేకమంది ఎప్పుడా అని ఎదురు చూస్తుంటారు.

జులై నెలలో జరిగే ఈ పర్యటనకోసం దేశ వ్యాప్తంగా అనేకవేలమంది ముందస్తుగానే సిద్ధమవుతారు. హిమాలయాల్లోని అమర్‌నాథ్‌లో ఏర్పడే సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించడం కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగే ఈ యాత్ర అటు ఆధ్యాత్మికతతోపాటు ఇటు మనలో కాస్త భయాన్ని సైతం రేకెత్తించడం గమనార్హం.

ఎత్తైన పర్వతాలు ఓపక్క, అగాధాలను తలపించే లోయలు మరోపక్క పూర్తిగా నడక మీద ఆధారపడి సాగే ఈ పయనంలో మధ్య మధ్యలో స్థానికులచే ఏర్పాటు చేయబడిన భండారా క్యాంపుల్లో లభించే ఆతిధ్యం మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. జమ్ము నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మధ్యలో ఎన్నో మజిలీలను దాటుతూ చివరకు అమర్‌నాథ్ చేరుకుంటుంది.

సతీసమేతుడైన పరమశివుడు సృష్టి రహస్యాలను తన భార్యకు వివరించడానికి కాలినడకన అమరనాథ్ పరిసరప్రాంతాల్లో విహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా పరమశివుడు చుట్టిన ప్రదేశాలే అమర్‌నాథ్ యాత్రా సమయంలో మనకు మజిలీలై ఆకట్టుకుంటాయి.


అమర్‌నాథ్ యాత్రలో జమ్మూ నుంచి బయలుదేరి పహల్‌గాం గుండా చందన్‌వాడి చేరుకోవాలి. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. అనంతరం ఇక్కడినుంచి దాదాపు 12000 అడుగుల ఎత్తులో ఉన్న పిస్సు శిఖరంపైకి చేరుకోవాలి. ఈ శిఖరం పైకి ఎక్కే దారిలో అందమైన జలపాతాలు సుందరంగా కనిపించే ప్రకృతి మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది.

ఇక్కడి నుంచి దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న షెహనాగ్ ప్రాంతాన్న చేరుకోవాలి. ఇక్కడే అద్భుతమైన షెహనాగ్ సరస్సు ఉంది. ఈ సరస్సు గురించి స్థానికులు గొప్పగా చెబుతుంటారు. దీని తర్వాత దాదాపు 14000 అడుగుల ఎత్తులో ఉన్నమహాగునాస్ శిఖరాన్ని చేరాల్సి ఉంటుంది.

దీని తర్వాత ప్రాతం పంచతరుణి అనే ప్రాంతం. అయిదు నదులు ప్రవహించడం ద్వారా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. దీని తర్వాత ప్రాంతమే అమర్‌నాథ్ క్షేత్రం. అమర్‌నాథ్ క్షేత్రానికి చేరే దారిలో అనేక చిన్న చిన్న కొట్లు మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పూజా సాముగ్రితోపాటు తినుబండారాలు కూడా లభిస్తాయి.

అలాగే అమరనాథ్ గుహకు దగ్గరే ఉన్న అమరావతీ నదిలో స్నానం చేసి మంచు లింగాన్ని దర్శించుకుంటారు. అమర్‌నాథ్ యాత్రకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుతోంది. జమ్ములోని బేస్ క్యాంప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్ దర్శనానికి తీసుకుని వెళ్తారు.