శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Pavan Kumar
Last Modified: మంగళవారం, 10 జూన్ 2008 (20:14 IST)

కార్తవీర్యార్జున రాజధాని మహేశ్వర్

మధ్య ప్రదేశ్‌లో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉంది మహేశ్వర్. మహా శివుడు వెలసిన ప్రాంతం కాబట్టి దీనిని మహేశ్వర్‌గా పిలుస్తారు. రామాయణ కాలంలో దక్షిణ అవంతి రాజ్యానికి రాజధాని మహిషమతి. దీనికి రాజు కార్తవీర్యార్జున. కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు ఉండేవి. అతను దత్తాత్రేయుడి పరమ భక్తుడు. రామాయణ, మహాభారతాల్లో మహశ్వర్ గురించి ప్రస్తావించబడింది.

హోల్కర్ వంశ రాణి రాజమాత అహల్యా దేవి బాయి మహేశ్వర్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించింది. మహేశ్వర్‌లో కోటతో పాటుగా భవంతులు, అనేక దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించింది. నర్మదా నదికి ఎదురుగా మహేశ్వర్ కోట ఉంది.

మహేశ్వర్‌లో శివుని రూపాలైన కాశీ విశ్వనాథ్, రాజరాజేశ్వర్, ఓంకారేశ్వర్, తిలబందేశ్వర్, కాళేశ్వరుడు. జలకంఠేశ్వరుడు, పండరినాథుడు పేరిట దేవాలయాలు రాణి అహల్యా దేవి నిర్మించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది.

చూడవలసిన ప్రాంతాలు
మహేశ్వర్ కోట
నర్మదా నదికి సమీపంలోని కొండపై రాణి అహల్యా దేవి కాలంలో నిర్మించారు మహేశ్వర్ కోట. వాస్తు పరంగా భిన్నమైనది మహేశ్వర్ కోట. కోటలోని శిల్పాలు చాలా అందమైనవి. కోటపైకి ఎక్కిచూస్తే నర్మదా నది అందాలను తనివితీరా చూడవచ్చు. నర్మదా నదిలో పడవ షికారు సందర్శకులు చేయవచ్చు.

హోల్కర్ వంశస్థుల సమాధి
మహేశ్వర్‌కు సమీపంలోని రౌఎరాలో హోల్కర్ వంశ రాజుల సమాధులు ఉన్నాయి. పీష్వా వంశస్థుడైన తొలి పీష్వా బాజీ రావు సమాధి ఇక్కడ ఉంది. ఇందులో ఆయన అస్థికలు ఉంటాయని అంటారు.

మాండ్లేశ్వర్
మహేశ్వర్‌కు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది మాండ్లేశ్వర్. ఇక్కడ ముస్లిం రాజుల నిర్మించిన రాతి కోట ఉంది. నర్మదా నది ఒడ్డున ఉన్న కొండపై ఈ కోట ఉంది. కోట దగ్గరలో నర్మదా నదిలోకి దిగటానికి 123 మెట్లతో ఘాట్ ఏర్పాటుచేశారు. రెండో హోల్కర్ రాజు అయిన తుకోజి రావు ఇక్కడ ఒక భవంతిని నిర్మించాడు. బ్రిటీష్ వారి కాలమైన 1919-1864 మధ్య నీమర్ ప్రాంత కంట్మోనెంట్ ఇక్కడే ఉంది.

ఓన్
వెయ్యేళ్ల క్రితం నిర్మించిన దేవాలయాల సముదాయం ఇక్కడ ఉంది. ఖారాగావ్‌కు 18 కి.మీ. దూరంలో ఉంది ఓన్. హిందూ, జైన మతాలకు చెందిన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. దేవాలయాలుపై చెక్కిన శిల్పాలు ఖజురాహో శిల్పాలను పోలి ఉంటాయి. మాళ్వా ప్రాంతాన్ని పాలించిన పర్మారా రాజులు ఈ దేవాలయాలకు ఆర్ధిక తోడ్పాటు అందించారు.

వసతి
మధ్య ప్రదేశ పర్యాటక శాఖకు చెందిన హోటెల్ ఇక్కడ ఉంది.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : ఇండోర్ (91 కి.మీ.). సమీపంలోని విమానాశ్రయం.
రైలు మార్గం : ఇండోర్ (91 కి.మీ.), బార్వాహ (39 కి.మీ.), ఖాండ్వా (110 కి.మీ.)
రహదారి మార్గం : అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సులు ఉన్నాయి.