శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Munibabu

ప్రకృతి అందాల నిలయం సిమ్లా

భారతావనిలో వేసవి పర్యాటక కేంద్రాలుగా పేరొందిన వాటిలో సిమ్లాను ప్రముఖంగా చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఈ పర్వత ప్రాతం దేశ విదేశీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆనందంతో పాటు ఓ అద్భుతమైన అనుభవాన్ని మనకు పరిచయం చేసేదిగా సిమ్లా యాత్రను చెప్పుకోవచ్చు. ఘాట్ రోడ్లు పర్వతాల్లో దూరిపోయే సొరంగ మార్గాలు, పొడవైన వంతెనలు ఇలా ప్రతీదీ సిమ్లా యాత్ర సందర్భంగా మనకు కనువిందు చేస్తాయి.

సిమ్లాలో చూడాల్సిన ప్రదేశాలు
అద్భుతమైన అందాల నడుమ కొండల్లో ఉన్న సిమ్లా ప్రాంతం చేరుకోవడం ఓ మధురానుభూతి. దీంతోపాటు సిమ్లాలో ప్రకృతి అందాలకు కొదవలేదు. అలాగే ఇక్కడి వాతావరణం సైతం పర్యాటకులకు వింతైన అనుభూతిని మిగుల్చుతుంది. సిమ్లా ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఎర్రని యాపిల్స్ వేలాడుతుండే ఆ చెట్లను చూస్తూంటే భలే ముచ్చటగా ఉంటాయి.

పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్నా అద్భుతమై ప్రకృతి మనకు కనువిందు చేస్తుంటుంది. నాటి బ్రిటీష్ పాలనలో సిమ్లా వేసవి విడిదిగా ఉపయోగించేవారు దేశ విభజన సమయంలో కాశ్మీర్ సమస్యపై చర్చ సిమ్లాలోని వైస్ రాయ్ భవనంలోనే జరగడం విశేషం. పర్యాటకులు తమ పర్యటనలో భాగంగా ఈ భవనాన్ని సందర్శిస్తుంటారు.

ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా సిమ్లాలో ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. దూరంగా ఉన్న హిమాలయా పర్వతాలను అందంగా కళ్లముందు సాక్షాత్కరింపజేసే స్కాండల్ పాయింట్, చర్చి లైబ్రరీ, లక్కడ్ బజార్ లాంటివి సిమ్లాలోని చూడదగ్గ ప్రదేశాలు.


లక్కడ్ బజార్‌లో దొరికే కొయ్యతో చేసిన కళాకృతులు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. వీటి తర్వాత సిమ్లాలో ప్రముఖంగా పేర్కొనేది శ్యామలదేవి ఆలయం. స్థానికులు కాలాబరి ఆలయంగా పిలిచే ఈ దేవాలయంలో కొలువైన శ్యామలా దేవి వల్లే ఈ ప్రాంతానికి సిమ్లా అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు.

దీంతోపాటు శిఖరంపై ఉన్న జాకూ ఆలయానికి సందర్శించి తీరాల్సిందే. ఈ ప్రదేశం నుంచి చూస్తే పూర్తి సిమ్లా మన కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. వీటితోపాటు సిమ్లా నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సిమ్లా వెళ్లినవారు తప్పకుండా చూడాల్సినవి వేడినీటి గుంటలు.

చుట్టూ వాతావరణం ఎముకలు కొరికే చలితో చుట్టు ముట్టేస్తుంటే ఇందులో నీరు మాత్రం ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. ఈ నీటి గుంటల్లో స్నానం చేస్తే సకల చర్మ వ్యాధులు తీరిపోతాయని చెబుతారు. అలాగే సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లే దారిలో ఓ వైపు ఎత్తైన శిఖరాలు ఔరా అనిపిస్తుంటే మరోవైపు అంతు చిక్కని అగాధలోయలు గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఇక్కడ వ్యాపించిన మంచు శిఖరాల్లో ప్రతి ఏడాది మంచు క్రీడల పోటీలు జరుగుతుంటాయి.

సిమ్లాకు రవాణా సౌకర్యాలు
సిమ్లా వెళ్లాలనుకునేవారు ఢిల్లీ నుంచి చండీగడ్, కల్కా మీదుగా సిమ్లా చేరుకోవాల్సి ఉంటుంది. కల్కా అనేది సిమ్లాకు పాద ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచి ట్రైన్‌లో గనుక వెళ్లగల్గితే సిమ్లా చేరడానికి ముందే ఓ అద్వితీయ సుందర ప్రపంచ కళ్లముందు సాక్షాత్కారమవుతుంది.

దారిపొడవునా ఎత్తైన హిమాలయా పర్వతశ్రేణులు ఠీవీగా దర్శనమిస్తుంటే దాంతోపాటే కొండలమీద పెరిగిన ఫైన్, ఓక్ చెట్లు కనువిందు చేస్తాయి. మార్గమధ్యంలో వచ్చే సొరంగ మార్గాలు, బ్రిడ్జిలు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కల్కా నుంచి సిమ్లాకు నిర్మితమైన ఈ నారోగేజ్ రైలు మార్గం ఓ అద్భుతమైన నిర్మాణంగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించడం విశేషం.