మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

వెనీస్ ఆఫ్ ద ఈస్ట్.. కాశ్మీర్ ఆఫ్ రాజస్థాన్.. "ఉదయ్‌పూర్"

FILE
వెనీస్ ఆఫ్ ద ఈస్ట్, కాశ్మీర్ ఆఫ్ రాజస్థాన్, కోటల నగరం, లేక్ సిటీ, విలాసవంతమైన హౌటళ్ల నగరం.... ఇలా ఏ పేరుతో పిలిచినా వెంటనే పలికే నగరం ఉదయ్‌పూర్. పర్యాటకులను గౌరవించటం, నోరూరించే రుచుల్ని అందించటం, కలర్‌ఫుల్ పండుగలు... లాంటివన్నీ ఈ నగరానికి ఓ సరికొత్త హోదానిస్తున్నాయి కూడా. అందుకే "ట్రావెల్ అండ్ లీజర్" మ్యాగజైన్ 2009 సంవత్సరానికిగానూ.. "ప్రపంచంలో పర్యాటకులకు అత్యుత్తమ నగరం"గా ఉదయ్‌పూర్‌ను ఎంపిక చేసింది.

ఉదయ్‌పూర్‌లోని అందమైన సరస్సులు ఆ పట్టణానికి ఎంతో ఖ్యాతిని చేకూర్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్షాధార సరస్సుల మధ్యలో ఈ పట్టణాన్ని నిర్మించటం విశేషం. ఆరావళీ పర్వతాలు, చుట్టూ సరస్సులు, ఉద్యానవనాలు, రాజస్థానీ చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రతిబింబించే నిర్మాణశైలితో ఆకట్టుకునే కోటలు, ఆలయాలు, హోటళ్లుగా మారిపోయిన ఒకనాటి విలాసవంతమైన రాజభవనాలు..... ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేసేవే.

ముఖ్యంగా ఉదయ్‌పూర్ ఇప్పుడు కొత్తజంటల హనీమూన్ కేంద్రంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అందుకే రాజస్థాన్‌లో జైపూర్ తరువాత పర్యాటకులు ఈ నగరానికే ఎక్కువగా వస్తుంటారు. ఈ నగరాన్ని "కాశ్మీర్ ఆఫ్ రాజస్థాన్"గా మార్చిన ఘనత కూడా అక్కడి సరస్సులదే. అలాంటి వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది "ఫతే సాగర్ సరస్సు".

1678లో ఏర్పాటు చేసిన ఫతే సాగర్ సరస్సు.. పిచోలా సరస్సుకు ఉత్తరాన, సరిగ్గా ఎదురుగా ఉంటుంది. ఇది కృత్రిమ సరస్సు. ఇందులో మూడు దీవులు కూడా ఉన్నాయి. పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించేవి కూడా ఇవే. వీటిలో పెద్దది నెహ్రూ పార్క్. ఈ ఉద్యానవనంలో జూ, రెస్టారెంట్‌లు ఉన్నాయి. రెండో దీవిలో భారీ వాటర్‌జెట్ ఫౌంటెయిన్, మూడో దీవిలో సోలార్ ఆబ్జర్వేటరీలు కనువిందు కలిగిస్తాయి. ఈ సోలార్ ఆబ్జర్వేటరీ ఆసియా ఖండంలోనే అత్యున్నతమైనదిగా పేరుగాంచింది.

తరువాత చెప్పుకోవాల్సింది "జైసమంద్ సరస్సు". ఇది ఆసియాలోనే రెండో అతిపెద్ద కృత్రిమ సరస్సు. ఇది ఉదయ్‌పూర్ పట్టణానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడోది.. "రాజ్ సమంద్ సరస్సు". ఇది ఉదయ్‌పూర్‌కు 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాలుగోది "ఉదయ్ సాగర్ సరస్సు" ఇది ఉదయ్‌పూర్ పట్టణానికి తూర్పున 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

FILE
చివరిగా చెప్పుకోవాల్సింది "పిచోలా సరస్సు". దీంట్లో రెండు దీవులున్నాయి. వాటిలో ఒకటి జగ్‌నివాస్, రెండోది జగ్‌మందిర్. జగ్‌నివాస్‌లో ఒక కోట ఉంది. దాన్ని "లేక్ ప్యాలెస్" అంటారు. ప్రస్తుతం ఇది ప్యాలెస్ హోటల్‌గా మారిపోయింది. జగ్‌మందిర్ కూడా చిన్న రాజభవనం. పైన చెప్పుకున్న సరస్సులన్నింట్లోనూ షికార్లు చేసేందురు మోటారు పడవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడ షికార్లు చేస్తుంటే.. కాశ్మీర్‌లో విహరిస్తున్నట్లే ఉంటుందంటే నమ్మండి...!

సరస్సుల తరువాత చెప్పుకోవాల్సింది "సిటీ ప్యాలెస్". ఉదయ్‌పూర్ నగరానికి దక్షిణాన, సుమారు 350 సంవత్సరాల క్రితం పిచోలా సరస్సులో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఇది 11 కోటల సముదాయం. లేత పసుపు పచ్చ పాలరాతితో నిర్మితమైన ఈ ప్యాలెస్‌పై సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూస్తే.. ఆ అందం వర్ణనాతీతంగా ఉంటుంది. అలాగే ఈ ప్యాలెస్ బాల్కనీల్లోంచి ఉదయ్‌పూర్ సౌందర్యాన్ని వీక్షించటం కూడా ఓ మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

సిటీ ప్యాలెస్‌లోని కోటల్లో కిటికీలు, తలుపులు, పై కప్పులు, స్తంభాలలో జీవకళ ఉట్టిపడుతూ అద్భుతంగా అనిపిస్తాయి. ఈ ప్యాలెస్‌లోనే ఓ మ్యూజియం కూడా ఉంది. కొన్ని వందల సంవత్సరాలనాటి శిల్పాలు, పెయింటింగులు, వస్తువులు, ఫర్నీచర్లను ఇందులో చూడవచ్చు.

ఈ ప్యాలెస్ మరో ప్రత్యేక ఆకర్షణ "జగదీశ్వరాలయం". లక్ష్మీనారాయణుడు కొలువైన ఈ మూడంతస్తుల ఆలయం ఉదయ్‌పూర్‌లోనే అతి పెద్దది. అద్భుతంగా చెక్కిన స్తంభాలు, దేవతా చిత్రాలతో నిండిన పై కప్పులు, గోడలు.. పర్యాటకులకు మదినిండా భక్తిభావాన్ని నింపుతాయి.

FILE
"సజ్జన్ నివాస్ గార్డెన్" రాజస్థాన్‌లోని ఉద్యానవనాల్లోకెల్లా అతి పెద్దది. సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ తోటలో గులాబీ పువ్వులే ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని రోజ్ గార్డెన్ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ఒక జూ కూడా ఉంది. పిచోలా సరస్సు ఒడ్డున ఉన్న ఈ గార్డెన్‌లో విహరించేందుకు పర్యాటకులు చాలా ఇష్టపడుతుంటారు.

"సహోలియోంకీ బారీ" ఉద్యానవనం.. 18 శతాబ్దంలో మహారాణా సంగ్రామ్ సింగ్ తన భార్య కోసం దీన్ని రూపొందించాడు. తరువాత ఆమె తన 48 మంది దాసీలకు అప్పగించింది. ఇది ఫతే సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ గార్డెన్‌లోని ప్రవేశ ద్వారాలు, వాటిపైనగల సూక్ష్మ చిత్రకళ సందర్శకులను అబ్బురపరుస్తాయి.

ఉదయ్‌పూర్ మరో ఆకర్షణ "అహర్". దీన్నే మేవాడ్ రాజపుత్రుల స్మృతి చిహ్నం అనవచ్చు. స్థానికులకు రాజపుత్ర రాజులంటే ఎంతో గౌరవం. అందుకే ఇక్కడ ఎంతోమంది రాజపుత్రవీరుల సమాధులున్నాయి. సమాధి అంటే ఏదో మామూలు సమాధి అనుకోకండి. ఒక్కోటి ఓ చిన్నసైజు కోటలాగా ఉంటుంది. పాలరాతితో నిర్మించిన ఈ సమాధుల్లో కూడా చిత్రకళ ఉట్టిపడుతూ ఉంటుంది.

ఉదయ్‌పూర్‌కు సమీపంలోగల "సజ్జన్‌గఢ్ ప్యాలెస్" కూడా చూడదగ్గదే. ఇక్కడినుంచి చూస్తే ఉదయ్‌పూర్‌లోని ఐదు సరస్సులూ దర్శనమిస్తాయి. ఇక్కడకు వర్షాకాలంలో పర్యటిస్తే బాగుంటుంది. ఎందుకంటే, సరస్సులన్నీ నీటితో కళకళలాడుతుంటే చూసే దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. అందుకే.. ఈ ప్యాలెస్‌ను "మాన్‌సూన్ ప్యాలెస్" అని కూడా పిలుస్తుంటారు. దీనికి దగ్గర్లోనే "సజ్జన్‌గఢ్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం" ఉంది.

అలాగే ఉదయ్‌పూర్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో "కుంభాల్‌గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం" ఉంది. 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో.. పులులు, చిరుతలు, లేళ్లు, కుందేళ్లు, కోతులు, అనేక రకాల పక్షులు ఉన్నాయి. ఇక ఉదయ్‌పూర్‌కు 22 కి.మీ. దూరంలో "ఏకలింగనాథ ఆలయం".. 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న "నాథ ద్వారం".. రాజ్‌సమంద్ సరస్సు ఒడ్డున ఉండే "శ్రీకృష్ణుడి ఆలయం"..తదితరాలు కూడా చూడదగ్గవే.

ఉదయ్‌పూర్ పర్యటనకు అక్టోబర్-ఏఫ్రిల్ నెలల మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే వర్షాకాలంలో వానలూ ఎక్కువే అయినప్పటికీ.. సరస్సులన్నీ నీటితో కళకళలాడుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

ఇక్కడికి వెళ్లేందుకు ఢిల్లీ, ముంబయి నగరాల నుంచి రైలు, విమాన సౌకర్యాలున్నాయి. ఉదయ్‌పూర్ విమానాశ్రయం "దబోక్". ఇది నగరానికి సమీపంలోని సిటీ సెంటర్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, అహ్మదాబాద్, ముంబయి, ఔరంగాబాద్‌లకు విమాన సేవలు నడుస్తున్నాయి.

అయితే ఉదయ్‌పూర్ అందాలను ఆస్వాదించాలంటే రైలు ప్రయాణమే అనుకూలంగా ఉంటుంది. చిత్తోర్‌ఘర్, కోట, అజ్మీర్, జైపూర్, ఢిల్లీలకు నేరుగా రైలు సేవలు ఉన్నాయి. అహ్మదాబాద్‌కు మీటర్ గేజి మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. రోడ్డు మార్గంలో అయితే.. ఆగ్రా 630 కి.మీ., అహ్మదాబాద్ 262 కి.మీ., జైపూర్ 406 కి.మీ., జోధ్‌పూర్ 275 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అత్యాధునిక వసతులు గల బస్సులను ఈ నగరాలకు నడుపుతోంది.