శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా "షిమ్లా"

FILE
పచ్చటి ప్రకృతి పరచుకున్న దారులు, అందమైన కొండలు, ఘాట్ రోడ్లలో పర్వతాలపై దూసుకెళ్లే సొరంగ మార్గాలు, పొడవాటి వంతెనలు.. ఇలా ఒకటేమిటి "షిమ్లా"లో కనిపించే ప్రతి దృశ్యం మనల్ని అలాగే కట్టిపడేస్తుంది. స్థానిక దేవత శ్యామలాదేవి పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది. 1819లో బ్రిటీష్ వారిచే కనుగొనబడిన షిమ్లా, ఆ తరువాత 1864వ సంవత్సరంలో "సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా"గా ప్రకటించబడింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన కొండల మధ్య కొలువైయున్న షిమ్లా చేరుకోవటం పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. ముఖ్యంగా షిమ్లా ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరించే ఆపిల్ పండ్లు చెట్లలో గుత్తులు గుత్తులుగా వేలాడుతూ దారి పొడవునా తోరణాలవలె స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.

షిమ్లా పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్యామలాదేవి ఆలయం. ఈ ఆలయాన్నే అక్కడి స్థానికులు కాలి బరి ఆలయంగా పిలుస్తుంటారు. ఈ ఆలయంలో కొలువైయున్న దేవత శ్యామలాదేవి వల్లనే షిమ్లాకు ఆపేరు వచ్చినట్లుగా చెబుతుంటారు.

బ్రిటీష్‌వారి కాలంలో షిమ్లాను వేసవి విడిదిగా ఉపయోగించుకునేవారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌కు సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రాయ్ భవనంలోనే జరగటం విశేషంగా చెప్పవచ్చు. అందుకనే షిమ్లాను సందర్శించే పర్యాటకులు తప్పకుండా వైశ్రాయ్ భవనాన్ని కూడా దర్శిస్తుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు.

సిమ్లాలో ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలు చాలానే ఉన్నప్పటికీ.. అల్లంత దూరాన ఉండే హిమాలయా పర్వతాలను కళ్లముందు సాక్షాత్కరింపజేసేలా ఉండే స్కాండల్ పాయింట్, చర్చి లైబ్రరీ, లక్కడ్ బజార్ తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించాల్సిందే. ఇక్కడి లక్కడ్ బజార్‌లో దొరికే కొయ్యతో చేసిన కళాకృతులు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

FILE
వీటితోపాటు శిఖరం అంచుల్లో ఉండే జాకూ ఆలయాన్ని కూడా తప్పకుండా చూడాల్సిందే. ఈ ప్రాంతం నుంచి చూస్తే షిమ్లా పూర్తి దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇంకా షిమ్లా చుట్టుప్రక్కల ప్రాంతాలలో సైతం అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అలాంటివాటిలో ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశం "వేడినీటి గుంటలు".

ఎముకలు కొరికే చలి ఓవైపు చంపేస్తుంటే, ఇక్కడి వేడినీటి గుంటల్లోని నీరు మాత్రం ఎప్పుడుచూసినా వేడిగానే ఉంటుంది. ఈ నీటి గుంటల్లో స్నానం చేసినట్లయితే చర్మ వ్యాధులన్నీ నయం అవుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకనే ఇక్కడికి వచ్చేవారు స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లే దారిలో నిలువెత్తు పర్వత శిఖరాలు అబ్బురపరుస్తుంటే, మరోవైపు అంతులేని అగాధాల్లాంటి లోయలు గుండెల్లో గుబులు పుట్టించక మానవు.

ఇంకా.. రిడ్జ్, మాల్, జాకో టెంపుల్, స్టేట్ మ్యూజియం, ప్రాస్పెక్ట్ హిల్, సమ్మర్ హిల్, చాడ్విక్ ఫాల్స్, సంకత్ మోచన్, తారా దేవీ, ఫాగు, నర్కంద, కోట్‌గర్హ్, రాంపూర్, సారాహన్, ఖారపత్తార్, జుబ్బల్, హట్‌కోటి, మాసోబ్రా, క్రైగ్‌నానో, నల్‌దేహ్రా, తట్టపని, చిండిలాంటి చూడదగిన ఎన్నో ప్రదేశాలు షిమ్లాలో కలవు.

షిమ్లా చేరుకోవటం ఎలాగంటే.. న్యూఢిల్లీ నుంచి చండీఘడ్, కల్కాల మీదుగా షిమ్లా చేరుకోవాల్సి ఉంటుంది. కల్కా అనేది షిమ్లాకు ప్రవేశ ద్వారంలాంటిదని చెప్పవచ్చు. కల్కా నుంచి షిమ్లా వెళ్లేందుకు రైలు సౌకర్యం కూడా కలదు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు దారి పొడవునా ఎత్తైన హిమాలయా పర్వతశ్రేణులు, వాటిపై పెరిగిన ఫైన్, ఓక్ చెట్ల సౌందర్యం కళ్లు తిప్పుకోనీయకుండా చేస్తుంది. అలా రైలు సొరంగ మార్గాలు, బ్రిడ్జీల గుండా పయనిస్తుంటే ఓవైపు సంతోషం, మరోవైపు కాస్తంత గుబులు కలుగకమానదు. మే-జూలై, సెప్టెంబర్-నవంబర్ మాసాలలో పర్యటనకు అనువుగా ఉండే "షిమ్లా"ను ఈ సమ్మర్‌లో మీరూ చుట్టివస్తారు కదూ..?!