గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

సాహస, సంభ్రమాల సమ్మేళనం "ఎవరెస్ట్ బేస్‌క్యాంప్"

FILE
సరదా ప్రయాణాలను ఇష్టపడేవారు కొందరయితే, సాహసాలు చేస్తూ ముందుకు ఉరికేవారు మరికొంతమంది. ఇక హిమాలయాల్లో ట్రెక్కింగ్ అంటే బోలెడంత సరదా, అంతే స్థాయిలో సాహసం.. కలగలసి ఉంటాయి. ఇక కొండలు ఎక్కి దిగుతూ గడిపేందుకు ఇష్టపడేవాళ్లు జీవితంలో ఒక్కసారయినా "ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌"కు వెళ్లి రావాలని కలలు కంటుంటారు.

అయితే సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో ఉండే ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లటం అంటే అంత సులభం కాదు. ఈ ప్రయాణానికి సిద్ధపడేవాళ్లు రెండు మూడు నెలలు ముందునుంచే దేహ ధారుడ్యం కోసం జాగింగ్, రన్నింగ్ లాంటి ఎక్సర్‌సైజులు చేయాల్సి ఉంటుంది. అలాగే మెట్లు ఎక్కి దిగటాన్ని కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.

ఈ బేస్‌క్యాంపుకు వెళ్లాలంటే హైదరాబాదు నుంచి బయల్దేరి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి దగ్గర్లో ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతమైన సినౌలీకి ట్యాక్సీలో వెళ్లి... భారత సరిహద్దులను రిక్షాలో దాటవచ్చు. భారత సరిహద్దులను దాటిన తరువాత ట్యాక్సీలో ఖాట్మండుకు చేరుకోవాలి.

ఖాట్మండు వ్యాలీ మీదుగా సముద్ర మట్టానికి 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండల్లో, ఘాట్ రోడ్డుల గుండా ప్రయాణిస్తుంటే... ఆకాశం అంతా తారా తోరణంలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది. అలా వెళ్తూ వెళ్తూ నాగర్‌కోట్ అనే ప్రాంతంలోకి ప్రవేశిస్తాము.
లోబోచే నుంచి గోర్కోషెప్
సముద్ర మట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తులో ఉండే "లోబోచే"కు బయలుదేరాల్సి ఉంటుంది. "కుంభు" పర్వతం చేరుకుని అక్కడ్నించి "దుగ్లా", ఆపై "లోబేచే"కు సాగుతుంది ప్రయాణం. అలా వెళ్లున్నప్పుడు క్లైంబర్స్ మొమోరియల్‌ను చూడవచ్చు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే...


సముద్ర మట్టానికి 7 వేల అడుగుల ఎత్తులో, ఖాట్మండుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే నాగర్‌కోట్‌లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ప్రయాణానికి ముందుగానే తగు ఏర్పాట్లను చూసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ అందుబాటు తక్కువగా ఉన్నప్పటికీ.. అక్కడ పచ్చగా పరచుకున్న పచ్చదనం అంతకుముందు ప్రయాణంలో పడే బాధనంతటినీ మర్చిపోయేలా చేస్తుంది.

నాగర్‌కోట్‌‌లోని కొండవాలుల్లో ఉన్న హోటల్స్, దట్టమైన అడవిలో మిణుకుమిణుకుమంటూ కనిపించే లైట్లు, ఆకాశంలో స్పష్టంగా నక్షత్రాల దర్శనం... ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ చేసేందుకు వచ్చి ఎలాంటి పర్యాటకులకైనా జీవితంలో ఓ మరచిపోలేని జ్ఞాపకాన్ని, చల్లని చలిలో నులివెచ్చటి అనుభూతిని ఇస్తుందంటే అతిశయోక్తి కాదు.

ఇక ఖాట్మండు నగరానికి చేరుకున్న తరువాత.. హై ఆల్టిట్యూడ్ గేర్ అయిన స్నో జాకెట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, వాకింగ్ స్టిక్‌లతోపాటు ట్రెక్కింగ్‌కు కావాల్సిన సరంజామానంతటినీ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎప్పుడూ సందడిగా, గజిబిజిగా ఉంటుంది. ఈ ఖాట్మండునుంచి 9,380 అడుగుల ఎత్తులో ఉండే "లుక్లా" ప్రయాణం సాగుతుంది.

లుక్లా చేరుకోవాలంటే విమానంలో వెళ్లాల్సి ఉంటుంది. మంచుపరదాలను కప్పుకున్న హిమాలయా అందాలను వీక్షిస్తూ.. మేఘాలలో తేలిపోతూ ఈ ప్రయాణం సాగుతుంది. దాదాపు 25 నిమిషాల ప్రయాణం తరువాత లుక్లా చేరుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రయాణం మొదలవుతుంది. లుక్లా నుంచి "ఫక్డింగ్"కు మూడు గంటలసేపు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో లీచీ ప్లాంట్లు, ఆపిల్ తోటలు విస్తారంగా కనిపిస్తూ కళ్లకు విందు చేస్తాయి.

FILE
అలా ఫక్డింగ్ చేరుకున్నాక దట్టమైన అడవుల గుండా ప్రయాణిస్తూ.. "జోర్ల్సే" చేరుకోవచ్చు. ఎత్తుపళ్లాలతో చాలా చిత్రంగా ఉండే ఈ జోర్ల్సే నుంచి "నామ్చే"కు వెళ్లాలి. ఈ దారిలో వెళ్తుంటే ఎన్నో నీటి ప్రవాహాలు, దోద్ కోషి నదీ తీరం వెంట సాగిపోయే ప్రయాణం.. ఈ ప్రయాణంలో ఎన్నో బ్రిడ్జిలను దాటుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక పైకి వెళ్తున్నకొద్దీ శ్వాస తీసుకోవడమే కష్టమైపోతుంది.

ఎగుడుదిగుడు కొండలతో గల ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ అష్ట కష్టాలు పడి నామ్చేలో సేదతీరుతాం. జోర్ల్సే నుంచి నాన్చింగ్‌కు 6 గంటలకు పైగానే సమయం పట్టేస్తుంది. అయినా కూడా నామ్చే గ్రామంలో సూర్యోదయం చూస్తుంటే ప్రయాణంలో పడ్డ కష్టమంతా దూదిపింజలా తేలిపోతుంది.

నామ్చే నుండి బయలుదేరి 1,2500 అడుగుల ఎత్తులో ఉండే "టెంగ్‌బోచే"కు ప్రయాణం సాగుతుంది. ఈ ప్రాంతంనుంచే హిమాలయా పర్వతాలను చాలా దగ్గరినుంచి చూసే అద్భుత అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. అలాగే హిమాలయాలకు దగ్గర్లో ఉన్న "అమాదాబ్లం"ను కూడా దగ్గర్నించి చూసేయవచ్చు.

నామ్చే నుంచి ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తే సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉండే "పుంకీతెంగా" చేరుకోవచ్చు. అక్కడ్నించీ టెంగ్‌బోచే చేరుకోవాలి. అయితే ఈ టెంగ్‌బోచే ప్రయాణం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి మంచువల్ల మనకు పది మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి సైతం కనిపించడు. ఇక్కడ వీచే గాలులు శరీరంలోని వేడినంతటినీ లాగేసుకుంటాయి.

టెంగ్‌బోచే నుంచి సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉండే "దింగ్‌బోచే"కు ప్రయాణం సాగుతుంది. నేపాల్‌లో ఎత్తయిన గ్రామం కూడా ఇదేనట. పైకి వెళ్లే కొద్దీ చిన్న చిన్న పొదలు తప్పప, చెట్లనేవే కనిపించవు. అలా ముందుకు సాగి మంచుదుప్పటి పరచుకున్న పర్వతాలు కనువిందు చేస్తున్న ఈ ప్రాంతంలోని బౌద్ధ దేవాలయాన్ని దర్శించవచ్చు.

ఆ తరువాత సముద్ర మట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తులో ఉండే "లోబోచే"కు బయలుదేరాల్సి ఉంటుంది. "కుంభు" పర్వతం చేరుకుని అక్కడ్నించి "దుగ్లా", ఆపై "లోబేచే"కు సాగుతుంది ప్రయాణం. అలా వెళ్లున్నప్పుడు క్లైంబర్స్ మొమోరియల్‌ను చూడవచ్చు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే... ఇక్కడే సమాధి చేస్తారట. అయితే ఈ శవాలను సొంత ఊళ్లకు తీసుకెళ్లేందుకు ఎంత డబ్బు అవసరమో, ఇక్కడ సమాధి చేసేందుకు అంతే అవసరమవుతుందని తెలిసి నోళ్లెళ్లబెట్టకమానం.

ఇక చివరిగా.. సముద్ర మట్టానికి 16,900 అడుగుల ఎత్తులోగల "గోర్కోషెప్" ప్రయాణం సాగించాలి. గోర్కోషెప్‌కు చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకున్నాక... సముద్ర మట్టానికి 17,600 అడుగుల ఎత్తులోనున్న చివరి మజిలీ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు చేరడమే తరువాయి. ఇక్కడికి చేరుకున్నాక ప్రపంచాన్నే జయించేసినంత సంతోషం కలుగక మానదు.

ఇంతటి ప్రకృతి అద్భుతాలను భగవంతుడెలా సృష్టించాడోనని మురిసిపోతూ గడిపేస్తాం. మళ్లీ వెళ్లినదారిలోనే తిరిగీ ప్రయాణించి ఖాట్మండు చేరుకుని... సొంతగూళ్లకు చేరుకుని దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయినా.. "ఎవరెస్ట్ బేస్‌క్యాంప్" అనుభవాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ హిమపర్వత సౌందర్యం మనసు మూలల్లో కలకాలం నిలిచిపోతుంది. తలచుకున్నప్పుడు జ్ఞాపకాల దొంతరలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది..!