శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

సింధులోయ సౌందర్య చిహ్నం "లడక్‌"

FILE
ప్రకృతి శోభకు పులకించిపోయిన సూర్యదేవుడు తన కిరణాలనే చేతులతో ఈ ప్రాంతాన్ని తేజోవంతం చేస్తుంటాడు. ఈ ప్రాంతంలోని మంచు కొండలమీద నుంచి దూకే జలప్రవాహాల గంభీర ధ్వనులు వేదాల ఘోషలాగా వినిపిస్తుంటాయి. అక్కడి సెలయేళ్ల ధ్వనులు మృదంగ నాదాల్లా హాయిగా ఉంటాయి. గాలి తాకిడికి ఆ ప్రాంతంలో శబ్దంచేసే చెట్ల కొమ్మలు పిల్లనగ్రోవి నాదాలై సుస్వరాలు వినిపిస్తుంటాయి. ఎన్నో అందాలు, మరెన్నో ప్రత్యేకతలతో నిండి ఉన్న ఈ ప్రాంతపు శోభ వర్ణించాలంటే మాటలు చాలవు. ఇంతటి సౌందర్యాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే "లడక్".

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోగల ఈ "లడక్" ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలోని మరే ప్రాంతానికి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయా, కారకోరమ్ పర్వతాల మధ్య ఇది విస్తరించి ఉంది కాబట్టి. హిమాలయాల నుంచి వచ్చే శీతల గాలుల కారణంగా సంవత్సరం పొడవునా ఈ ప్రాంతంలో వాతావరణం చల్లగా, హాయిగా ఉంటుంది. లడక్‌లోని కార్గిల్ ప్రాంతం సముద్ర మట్టానికి 9వేల అడుగుల ఎత్తులో ఉండగా, కారకోరమ్ సమీపంలోని సాసెర్ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది.

లడక్‌ ప్రాంతాన్ని గతంలో చాలామంది రాజులు చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకుని పరిపాలించారు. వారిలో ఫియాంగ్‌, హెమిస్‌, చిబ్రా అనేవారు ముఖ్యులు. బౌద్ధమత విస్తరణకు ముందుగానే వీరు అనేక మతాలకు ప్రాణం పోసిన దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో అనేక తెగలు కూడా మనుగడ సాగించాయనీ.. ఆ సమయంలో వారు ఎన్నో దేవాలయాలను సైతం నిర్మించారని పూర్వీకుల కథనం.
ఎండ బాగా కాయాలి దేవుడా..!
ఇక్కడి ప్రజలు వర్షాలు కురవాలని కోరుకోరు. ఎండ బాగా కాయాలని మాత్రమే వారు కోరుకుంటారు. ఎందుకంటే... ఎండ బాగా కాస్తే మంచు కరిగి నీరుగామారి తమ పంటలకు కావల్సినంత అందుతుందన్న ఆశే అందుకు కారణం. అయితే వారి ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించాడో ఏమోగానీ.. ఇక్కడ ఏడాది..


అలాంటి వాటిలో ఐదు దేవాలయాల సమూహమైన "అల్చి" ప్రార్థనా స్థలం ఒకటి. ఈ ఆలయాల లోపలి అద్భుతమైన వర్ణచిత్రాలను చూసినట్లయితే ఆశ్చర్యం కలిగించకమానవు. 11 లేదా 12వ శతాబ్ద కాలానికి చెందిన ఈ ఆలయంలో పూజాదికాలు నిలిచిపోయి చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. "లికిర్" మత ప్రముఖులు కొంతమంది వీటిని ఇప్పటికీ సంరక్షిస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

లడక్‌లో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల విషయానికి వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సింధులోయ నాగరికతా చిహ్నాలు. దీనికి నిదర్శనంగా నిలిచిన లడక్‌లోని "లెహ్" అనే ప్రాంతానికి చాలా చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్ అనే రాజు ఇక్కడ నిర్మించిన 9 అంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

అలాగే.. "ఇండస్‌"కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న "షె" అనే పట్టణంలో కూడా అనేకమైన రాజభవనాలు, పురాతల ఆలయాలు ఉన్నాయి. అయితే వీటిలో చాలా భవనాలను 1980వ సంవత్సరంలో పునర్నిర్మించారు. దీనికి సమీపంలో ఉండే బాస్గో, టంగ్‌మాస్కాంగ్ ప్రాంతాలు కూడా 15వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగినట్లు చారిత్రక కథనాలు వెల్లడిస్తున్నాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా నేడు శిథిలావస్థలో ఉండే కట్టడాలు, ఆలయాలు సాక్షీభూతాలుగా నేటికీ నిలిచే ఉన్నాయి.

లడక్‌లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన, చారిత్రక ప్రసిద్ధి పొందిన ప్రదేశం "లెహ్". టిబెటన్ల శిల్పకళారీతిలో సెంగె నంగ్యాల్ రాజు నిర్మించిన 9 అంతస్తుల భవనం చూడదగ్గది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉండే "నంగ్యాల్ సెమో" అనే పర్వతంపై 16వ శతాబ్దంలో తాహి నంగ్యాల్ అనే రాజు నిర్మించిన కోట తాలూకు శిథిలాలు కూడా చూడదగ్గవే.

FILE
అలాగే "జో-ఖంగ్" అనే బౌద్ధుల ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. మెయిన్ బజార్, దాని పక్కనే ఉండే చాంగ్ గలి దుకాణాల సముదాయాలు.. అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయి. టిబెట్ వ్యాపారులు అమ్మే రత్నాలు, ఇతర ఆభరణాలు ఇక్కడ విరివిగా లభిస్తుంటాయి.

లెహ్ ప్రధాన రహదారిలోని "డాక్ బంగ్లా కాంప్లెక్స్" దిగువన ఉండే ఫోర్ట్ రోడ్డు నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే స్కరా అనే కుగ్రామం ఉంటుంది. ఇక్కడ "జొరావర్ సింగ్" అనే రాజు నిర్మించిన కోటను చూడవచ్చు. ప్రస్తుతం ఈ కోట "ఆర్మీ బారక్స్‌"గా సేవలందిస్తోంది. ఇక లెహ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోగల "చొగ్లంసర్" అనే గ్రామం కూడా చూడదగ్గదే. టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోన్న ఈ గ్రామం కార్పెట్ల తయారీకి చెందిన అతిపెద్ద కుటీర పరిశ్రమకు నెలవు. కాగా.. టిబెటన్ల మత గురువు దలైలామా ప్రార్థనలు జరిపిన స్థలం అయిన "జీవత్సల్" ఇదే గ్రామంలో ఉండటం మరో విశేషం.

"ఇండస్‌"కు దిగువన "ఖలాట్సి-షయోక్‌ ఇండస్‌"ల మధ్య "డ్రోకా-పా" అనే ప్రాంతం కూడా చూడదగ్గ మరో పర్యాటక ప్రాంతం. ఇక్కడ నివసించేవారంతా బౌద్ధమతస్తులు కావడం విశేషం కాగా... మిగతా లడక్‌ వాసులతో పోలిస్తే వీరి జీవన విధానం చాలా వేరుగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఐదు గ్రామాలు ఉండగా.. దహ్‌, బయామా అనే గ్రామాల ప్రకృతి సౌందర్యం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు నదీనదాలతో పచ్చిక బయళ్ళతో అలరారిన లడక్‌ ప్రాంతం ఇప్పుడు తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. శీతాకాలంలో పర్వత ప్రాంతాలపై ఉండే మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్‌ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా మారింది. ఇక్కడ వర్షాలు కురిసినా అవి అననుకూల వర్షాలు కావడంతో అంతగా ఉపయోగం ఉండదు.

నిజం చెప్పాలంటే ఇక్కడి ప్రజలు వర్షాలు కురవాలని కోరుకోరు. ఎండ బాగా కాయాలని మాత్రమే వారు కోరుకుంటారు. ఎందుకంటే... ఎండ బాగా కాస్తే మంచు కరిగి నీరుగామారి తమ పంటలకు కావల్సినంత అందుతుందన్న ఆశే అందుకు కారణం. అయితే వారి ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించాడో ఏమోగానీ.. ఇక్కడ ఏడాదిలో 300 రోజులు ఎండ విపరీతంగా ఉంటుంది. అయితే వేసవికాలంలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉండే ఉష్ణోగ్రత శీతాకాలంలో మైనస్‌ 20 డిగ్రీలకు పడిపోతుంది. అయితే గాలిలో తేమ తక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతంలోకి సూర్య కిరణాలు చొచ్చుకుని వస్తుంటాయి.

మరోవైపు.. కాశ్మీర్ విషయంలో మనకు, మన దాయాది దేశానికి మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతలు, సమస్యల కారణంగా "లడక్"లోని అనేక ప్రాంతాలలోకి వచ్చే విదేశీ పర్యాటకుల ప్రవేశంపై అనేక పరిమితులను విధించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే విదేశీయుల ప్రవేశం పూర్తిగా నిషిద్ధమనే చెప్పవచ్చు. అయితే, మరికొన్ని ప్రాంతాలకు మాత్రం విదేశీయులు గుంపుగా వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. దీనికి కూడా డిప్యూటీ కమీషనర్ అనుమతి మాత్రం తప్పనిసరి. అలాగే శ్రీలంక, మయన్మార్ దేశస్థులకయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.