గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

సిమ్లా వెండి కొండల్లో అడ్వెంచరస్ టూర్

FILE
మంచును కుప్పగా రాశి పోసినట్లుగా ఉండే పర్వతాలు, దట్టంగా పరచుకున్నట్లుగా ఉండే ఆ మంచు పర్వతాల మీద సూర్యకిరణాలు పడి మెరిసిపోతూ వెండికొండలన్న విశేషణానికి అక్షరాలా అర్థాన్నిస్తున్నట్లుగా ఉండే ప్రకృతి సౌందర్యం సిమ్లాకు సొంతం. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్ చెట్లు అడుగడుగునా సిమ్లాలో ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్ చేయాలనుకునేవారికి ఇది ఓ స్వర్గధామమే.

సిమ్లానుంచి కుఫ్రి వెళ్లేదారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు, మరోవైపు లోతెంతో కూడా అంతుపట్టలేని అగాథాలుంటాయి. ఈ పర్వత శ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటే, లోయలన్నీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లా ఉంటాయి. వింటర్ స్పోర్ట్స్‌కు కేంద్రమైన సిమ్లాలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో స్పోర్ట్స్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

సిమ్లా పట్టణం ఓ కొండ వాలులో విస్తరించి ఉంటుంది. అర్ధచంద్రాకారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా ఫైన్, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నంటాలన్న తాపత్రయంతో పెరుగుతున్నట్లుగా ఉంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లను మంచుదుప్పటి కప్పేసి, ముగ్గుబుట్ట తలపై కుమ్మరించుకున్న పాపాయిల్లాగా ఉంటాయి. ఇక్కడి ఇళ్లన్నీ దూరంనుంచి చూస్తే ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి.
హాట్ వాటర్ స్ప్రింగ్ మాయ..!
ఈ వేడినీటి గుండంలోని నీరు తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. అయితే ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే..


సిమ్లా వెళ్లినవారు మొట్టమొదటగా దర్శించేది మాల్ రోడ్‌నే. మాల్ సెంటర్ ఇక్కడ ఓ ప్రత్యేక ఆకర్షణ. షాపింగ్ చేసినా, చేయకపోయినా అంతా తిరిగి చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. గుర్రమెక్కి మాల్ అంతా చుట్టి, పనిలో పనిగా ఒక ఫొటో తీసుకుంటే ఆ మధురానుభూతే వేరు. సిమ్లాలోను, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలోనూ ఆపిల్ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు ఏమీ అనరు. అయితే పండు కాకుండా పచ్చికాయను మాత్రం ముట్టుకుంటే అస్సలు ఒప్పుకోరు.

సిమ్లాలో ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో హిమాలయా పర్వతాలు అత్యద్భుతంగా కనిపించే స్కాండల్ పాయింట్, చర్చి, లైబ్రరీ, లక్కడ్ బజార్.. తదితరాలు ముఖ్యమైనవి. లక్కడ్ బజార్‌లో కొయ్యలతో చేసిన హస్తకళల వస్తువులు విరివిగా దొరుకుతాయి. స్కాండల్ పాయింట్ నుంచి జనరల్ పోస్ట్ ఆఫీస్ వైపు కాస్త దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుంది. ఇందులో ఉన్న దేవత శ్యామలా దేవి. ఈ దేవత నుంచే సిమ్లాకు ఆ పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు.

సిమ్లాలోనే ఉన్న జాకూ ఆలయం ఉన్న శిఖరం కూడా ప్రత్యేకంగా చూసి తీరాల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అంతా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాస్త ఓపికతో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నడవలేనివారి కోసం గుర్రాలు, ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇక ఇక్కడి స్టేట్ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతోందో కూడా అంతుపట్టకుండా ఇట్టే గడిచిపోతుంది.

FILE
అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ కూడా చూడదగ్గ ప్రాంతమే. అక్కడినుంచి 15 నిమిషాలు నడిస్తే ప్రాస్పెక్ట్ హిల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ కామనదేవి ఆలయాన్ని దర్శించవచ్చు. దాని నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సమ్మర్ హిల్ చూడవచ్చు. అక్కడ ఉండే జార్జియన్ హౌస్‌లోనే మహాత్మాగాంధీ విడిది చేశారట. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది.

సిమ్లా నుంచి బయలుదేరినప్పటినుంచి ప్రతి ఐదు లేక ఆరు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్ ప్లేస్ దర్శనమిస్తుంది. అలాంటి వాటిలో తత్తపాని, హాట్ వాటర్ స్ప్రింగ్ (వేడినీటి గుండం) మర్చిపోకుండా దర్శించాలి. ఈ వేడినీటి గుండంలోని నీరు తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. అయితే ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతుంటారు.

ఒక్క సిమ్లానే కాదు హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం అనువైంది. ఇంకా చెప్పాలంటే మే, జూన్ నెలలో సిమ్లాను దర్శించేందుకు మంచి అనువైన కాలమని చెప్పవచ్చు. సిమ్లాకు చేరుకోవాలంటే.. ఢిల్లీ నుంచి చండీగఢ్, కల్కాల మీదుగా చేరాలి. కల్కా నుంచి సిమ్లా వెళ్లే టాయ్ ట్రైన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్ ట్రైన్‌లో వెళ్లవచ్చు.

నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుంచే మొదలవుతుంది. అక్కడి నుంచి నారోగేజ్ రూట్‌లో టాయ్ ట్రైన్‌లో ప్రయాణించటం పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగుల్చుతుంది. ఎటుచూసినా హిమాలయా పర్వతశ్రేణులు, లోయలు, ఫైన్, ఓక్ చెట్లతో ఆ దేవుడు ఈ భూప్రపంచంపైనే స్వర్గాన్ని సృష్టించాడా అనిపించక మానదు.

సిమ్లా, కల్కాల మధ్య 103 సొరంగాలు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. టాయ్ ట్రైన్‌లో వెళ్లేటప్పుడు వీటన్నింటినీ చూస్తూ, అంతులేని ఉద్వేగంతో నోటమాటరాదు. సొరంగం బయటికి వచ్చాకే కేరింతలు తప్పు. "గ్రేటెస్ట్ నారో గేజ్ ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియా"గా గిన్నిస్ బుక్‌లో ఈ మార్గం రికార్డయ్యింది.

ఈ మార్గంలో లెక్కలేనన్ని చిన్నా పెద్ద నదులు కనిపిస్తాయి. వీటిలోని చాలా నదుల్లో ఎండాకాలంలో నీళ్లుండవు. కొండపక్కగా కాసేపు, సొరంగంలో మరికాసేపు, కిందకు చూస్తే నది, ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా సోయగాలు యాత్రికుల మనస్సుల్లో ఎల్లప్పటికీ నిలిచిపోతాయి.