శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By Ganesh

సైకిలెక్కి "హిమ" పర్వతాల్ని చుట్టేద్దామా...?

FILE
ఓ వైపు కొండ.. మరోవైపు లోయలో గలగలా పారే బియాస్ నదీమతల్లి పరవళ్లు, కొండచిలువలా మలుపులు తిరిగిన తారు రోడ్డు, 50 నుంచి 100 అడుగుల ఎత్తుదాకా పెరిగిన దేవదారు చెట్ల పరిమళం, నీరెండలో చల్లటి చలి...ఇంతటి వింత అనుభూతిని అందించే ఈ ప్రాంతంలో ఆహ్లాదం తప్ప మరేమీ కనిపించదు. అదే మన హిమాచల్‌ప్రదేశ్.

భగభగా మండే ఎండల నుంచి మంచు కొండలకు, కాంక్రీట్ అడవుల నుంచి కీకారణ్యానికి, రణగొణ ధ్వనుల నుంచి కిలకిలారావాల వైపుకు.. మహా కాలుష్యం నుంచి స్వచ్ఛమైన వాతావరణానికి.. యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ప్రకృతీమాత ఒడిలో హాయిగా గడపాలంటే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్ళాల్సిందే..!

హిమాచల్‌ప్రదేశ్‌లో బోలెడన్ని పర్యాటక ప్రాంతాలున్నప్పటికీ.. "నేషనల్ హిమాలయన్ మౌంటెన్ బైకింగ్" అనే ప్రోగ్రాంలో భాగంగా కొండల వెంబడి సరదాగా సైకిల్ తొక్కుతూ వెళ్లేందుకే చాలామంది పర్యాటకులు ఆసక్తిని ప్రదర్శిస్తారు. చల్లచల్లగా ఉండే "కులు" అనే పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలోని "ఓట్" అనే ప్రాంతం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది.

సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది "ఓట్". ఇక్కడినుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాల్సిన ప్రదేశం "జలోరీ పాస్". ఇది సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొదటి రోజున 16 కిలోమీటర్ల దూరంపాటు సైక్లింగ్ చేస్తూ.. "బాలి" అనే ఊరు దాటి ఐదు కిలోమీటర్లదాకా వెళ్లాల్సి ఉంటుంది.
ఆనందం వెంటే అపాయం..!
తిరుగు ప్రయాణంలో పైకి ఎక్కడం కంటే.. కిందికి దిగటం సులువే కాబట్టి.. హాయిగా, ఆనందంగా బయలుదేరవచ్చు. అయితే ఆ ఆనందం వెనుకే అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే.. సైకిల్ బ్రేక్ ఏ మాత్రం ఫెయిల్ అయినా.. అదుపు తప్పినా ఇక అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా...


యాత్రను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఇచ్చే... విదేశీ తయారీ అయిన గేర్ల సైకిల్, తలకు హెల్మెట్, మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్, చేతులకు గ్లవ్స్, కళ్లకు గాగుల్స్ వేసుకున్నట్లయితే.. మనల్ని మనమే గుర్తుపట్టలేనంతా ఉంటుంది. ఉదయం 8 గంటలకు ఉల్లాసంగా, హాయిగా మొదలవుతుందీ పర్యటన.

"ఓట్" వద్దనే సుమారు 3 కిలోమీటర్ల పొడవైన సొరంగంగుండా వెళ్ళాల్సి ఉంటుంది. దారి పల్లంగా ఉన్నట్లయితే సర్రున దూసుకుపోతూ.. ఎత్తైన చోట సైకిల్ దిగి నడుచుకుంటూ.. ఒక్కో కిలోమీటర్‌ను అధిగమిస్తూ.. మైలురాయి కనిపించినప్పుడల్లా విజయగర్వంతో ముందుకు సాగిపోతుందీ ప్రయాణం.

మధ్యాహ్నం సమయానికి బియాస్ నది ఒడ్డుకు చేరుకోవచ్చు. అక్కడ నది ఒడ్డున బండరాళ్లపై కూర్చుని, నీటి గలగలల చప్పుడును ఆస్వాదిస్తూ.. వెంట తెచ్చుకున్న భోజనాన్ని ఆరగిస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. అలా సాగే మొదటిరోజు యాత్ర తరువాత నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదేశంలో బస చేయవచ్చు. ఎప్పుడూ అలవాటులేని పనికాబట్టి.. రాత్రి భోజనాలయ్యాక ఆదమరచి నిద్రపోతుంటారు.

రెండోరోజు యాత్రలో "జిబి" అనే ఊరు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే.. మొదటిరోజు బస చేసిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అయితే ఇది బాగా ఎత్తు ప్రదేశం కాబట్టి.. సైకిల్ తొక్కడం కంటే.. ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నానికల్లా "జిబి" చేరుకోవచ్చు.

ఈ ప్రాంతం దాంటి రెండు మూడు ఫర్లాంగుల దూరం అడవిలోకి వెళితే చూడముచ్చటైన ఓ చిన్న జలపాతం మనల్ని ఆహ్వానిస్తుంది. అప్పడే కరిగి నీరైన ఐస్‌లాగా ఈ జలపాతం నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. ఈ నీటిలో స్నానం కాదు కదా.. అసలు తాకేందుకు కూడా సాహసం చేయలేము. అంతగా చల్లగా ఉంటాయి.

FILE
మూడో రోజున "జిబి" తరువాత "షోజా" అనే ప్రాంతానికి ప్రయాణం ఉంటుంది. అక్కడికి వెళ్లాల్సింది కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ.. ఒక్క అడుగైనా సైకిల్ తొక్కలేని పరిస్థితి. దాదాపు నిట్టనిలువు రోడ్డు, పక్కనే పెద్ద పెద్ద లోయలు.. తేలికపాటి సైకిల్ అయినా, చాలా బరువుగా ఉన్నట్లు తోస్తుంది. ఇలాంటి కొండల్లో సైతం అక్కడక్కడా ఉండే ఇళ్లను చూస్తే నోరెళ్లబెట్టకమానం.

అయితే ఇలాంటి చోట్లలో నివాసం ఉండేవారు.. ఇళ్లలో ఒక్క ఫ్రిజ్ తప్ప అన్నిరకాల వసతులూ అందుబాటులో ఉంటాయని తెలిస్తే మరింత ఆశ్చర్యానికి గురవుతాము. భూమికి ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉండే షోజాలో చలి జిల్లుమనిపిస్తుంది. వేసవిలోనే చాలా చలిగా ఉండే ఈ ప్రాంతంలో చలికాలం రోజుల్లో అయితే అసలు ఊహించుకునేందుకే వణికిపోతామనిపించక మానదు.

ఇక చివరిగా "జలోరీ బాస్"కు చేరేందుకు ప్రయాణం. షోజా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. అయితే వెళ్లాల్సిన ఎత్తు మాత్రం 2,500 కిలోమీటర్లు. సైకిల్ తీసుకెళ్లినా లాభం ఉండదు. అందుకే నడుస్తూ వెళ్లాలి. అలా వెళ్తుంటే వచ్చే మలుపుల ముందు తిరుమల కొండ మలుపులు బలాదూర్. ఇక్కడ పొరపాటున జారిపడితే సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు. అయితే అక్కడక్కడా కొండరాళ్లపై పేరుకుపోయిన మంచును తాకుతూ ఆనందించే అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది.

అలా జలోరీపాస్ చేరుకున్నాక.. అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే "శేషనాగ సరస్సు" చూడదగ్గది. ఇక్కడికి వెళ్లాలంటే మొత్తం అడవిలోనే నడవాల్సి ఉంటుంది. చిన్న సరస్సు. నల్లటి రంగులో నీళ్లు. చుట్టూ చెట్లున్నా.. సరస్సులో ఆకు అనేదే కనిపించకపోవటం వింతగా అనిపిస్తుంది. అయితే అది స్థానికులకు ఓ పవిత్రమైన కొలను. ఆ పక్కనే గుడి కూడా ఉంటుంది. సరస్సు అందాలు.. దగ్గర్లోని మంచుకొండలు సోయగాలు.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవనిపిస్తుంది.

తిరుగు ప్రయాణంలో పైకి ఎక్కడం కంటే.. కిందికి దిగటం సులువే కాబట్టి.. హాయిగా, ఆనందంగా బయలుదేరవచ్చు. అయితే ఆ ఆనందం వెనుకే అపాయం పొంచే ఉంటుంది. ఎందుకంటే.. సైకిల్ బ్రేక్ ఏ మాత్రం ఫెయిల్ అయినా.. అదుపు తప్పినా ఇక అంతే సంగతులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది.

చల్లటి ఐస్‌లాంటి నీళ్లు, పర్వతాలు, కొండలు, లోయలు.. సైకిల్ తొక్కినందుకు కాళ్ల నొప్పులు, ఆ నొప్పులతోనే ఆదమరచి నిద్ర, ఆనందం, ఆహ్లాదం.. దాని వెంటే పొంచి ఉండే అపాయం.. చలి, ఆ చలిలోనే చెమట.. మంచు, వర్షం.... ఇలాంటి అందమైన, ఆనందమైన అనుభవాన్నిచ్చేదే హిమాచల్‌ప్రదేశ్. ఈ అనుభవం కోసం మనసు మళ్లీ మళ్లీ తహతహలాడటంలో తప్పేముంటుంది చెప్పండి..

నేషనల్ హిమాలయ్ మౌంటైన్ బైకింగ్ పేరుతో వ్యవహరించే ఈ టూర్‌ను యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్ఏఐ) అనే సంస్థ ఏర్పాటు చేస్తోంది. అంతేగాకుండా ఈ సంస్థ పలు ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న పర్యాటకులు తమ పేర్లను నమోదు చేసుకుని ఆపై పర్యటించవచ్చు. మరిన్ని వివరాల కోసం వైహెచ్ఏఐఇండియా డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను చూడవచ్చు.