శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పర్వత ప్రాంతాలు
Written By WD
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2007 (12:49 IST)

హిమాలయాల మాటున దాగిన జమ్ము

సమోన్నత ఉత్తుంగ హిమాలయ పర్వతశ్రేణులకు ఆనుకుని ఉన్న సుందరమైన ప్రాంతం జమ్ము. తీర్చిదిద్దినట్టు ఉండే పూలవనాలు, గలగల పారే సెలయేళ్ళతో అమాయకత్వం ఉట్టిపడే ప్రాంతం జమ్ము. స్వచ్ఛమైన తావి నది - జమ్ముకు ప్రకృతి ప్రసాదించిన మరో వరం.

WD
జమ్ము పట్టణానికి మరో పేరు ఆలయాల నగరం (సిటీ ఆఫ్‌ టెంపుల్స్). ఆకాశాన్నంటే శిఖరాలపై కొలువైన అనేక దేవతామూర్తులు, ఎన్నో దేవాలయాలు ఈ నగరంలో కనిపిస్తాయి కాబట్టే జమ్ముకు ఆ పేరు వచ్చింది. ఇక్కడి ప్రజలు హిందీ, పంజాబి, ఉర్దు, ఇంగ్లీషుతో పాటు స్థానిక భాష అయిన డోగ్రీని కూడా మాట్లాడతారు.

చూడాల్సిన ప్రదేశాలు:
పెర్‌ఖోహ్‌: జమ్ముకు మూడు కిలోమీటర్ల దూరంలో సర్కులర్‌ రోడ్డులో ఉన్న పెర్‌ఖోహ్‌, చారిత్రక ప్రదేశమే కాదు, పుణ్యక్షేత్రం కూడా. ఇక్కడి ఒక గుహలో సహజసిద్ధంగా రూపొందిన శివలింగం ఉంది. మహత్తుగల ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ గుహలోంచి వెడితే మరికొన్ని దేవతామూర్తులు దర్శనమిస్తాయి. సుదీర్ఘంగా ఉండే ఈ గుహ రెండవ కొన మనల్ని దేశం వెలుపలకు తీసుకుపోతుంది!

రణ్‌బీరేశ్వర ఆలయం: కొత్త సెక్రటేరియట్‌ సమీపాన షాలిమార్‌ రోడ్డులో ఉన్న ఆలయం పేరే రణ్‌బీరేశ్వర్‌ ఆలయం. దీనిని 1883లో మహారాజా రణ్‌బీర్‌సింగ్‌ నిర్మించినట్టు చెబుతారు. గర్భాలయంలో ఏడున్నర అడుగుల ఎత్తున ఉండే శివలింగం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుంది. ఈ మహాలింగం చుట్టూ 15 నుంచి 38 సెంటీమీటర్ల ఎత్తున ఉండే పన్నెండు శివలింగాలు ఉన్నాయి. ఆలయం చుట్టూరా గోడలలోపల శివలింగాలు పొదిగారు.

రఘునాథ ఆలయం: జమ్ము నగరం నడిబొడ్డున ఉన్న రామాలయమిది. దీనిచుట్టూ అనేక ఆలయాలు ఉన్నాయి. జమ్ము, కాశ్మీర్‌ రాజ్యస్థాపకుడైన మహారాజా గులాబ్‌సింగ్‌ 1835లో రఘునాథ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన కుమారుడు మహారాజా రణ్‌బీర్‌ సింగ్‌ 1860లో పూర్తి చేశాడు. ప్రధాన ఆలయం లోపలివైపున గోడలకు బంగారు రేకులతో తాపడం చేశారు. ప్రహరీగోడలలో లక్షలాది సాలిగ్రామాలను పొదిగారు. చుట్టూ ఉన్న ఆలయాలు కూడా రామాయణంలో మనకు తగిలే వివిధ దేవుళ్ళకు చెందినవే కావడం విశేషం.

రణ్‌బీర్‌ కెనాల్‌: జమ్ముకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రణ్‌బీర్‌ నది, ఆ పక్కనే ఆహ్లాదం గొలిపే చిన్న ఉద్యానవనం చూపరులను ఆకర్షిస్తాయి. చినాబ్‌ నది అక్నుర్‌ వద్ద చీలగా ఏర్పడిన పాయనే రణ్‌బీర్‌ కెనాల్‌ అంటున్నారు. ఈ నదిలో నీళ్ళు ఏడాది పొడవునా మంచుకంటే చల్లగా ఉంటాయి.

బహుఫోర్ట్: జమ్ములోని అతి పురాతనమైన కోటలలో ఇది ఒకటి. తావి నది ఎడమగట్టుపై ఉన్న ఈ కోటను మూడు వేల ఏళ్ళ క్రితం రాజా బహులోచన్‌ నిర్మించాడని చెబుతారు. ఈ కోటనే డోగ్రా పాలకులు పునర్‌నిర్మించారు. కోటలోపల కాళికాదేవి ఆలయం కూడా ఉంది.

బాగ్‌-ఇ-బహు: బహు ఫోర్ట్ చుట్టూ ఉన్న అందమైన ఉద్యానవనాలనే బాగ్‌-ఇ-బహుగా వ్యవహరిస్తారు.

పీర్‌బాబా: జమ్ములోని విమానాశ్రయం వెనకగా పీర్‌బుధన్‌ అలీషా దర్గా వుంది. ఇది ముస్లింల ఆరాధ్యదైవమైన పీర్‌బాబాదే అయినా, ప్రతి గురువారం హిందువులు, సిక్కులు కూడా ఈ దర్గాను సందర్శిస్తుంటారు.

మహామాయా టెంపుల్‌, సిటీ ఫారెస్ట్: బహు ఫోర్ట్ వెనుకవైపు ఉన్న సిటీ ఫారెస్ట్‌లో మహామాయ ఆలయం ఉంది.

ముబారక్‌ మండీ ప్యాలెస్‌: పురాతన రాజభవనాల సముదాయమిది. వీటిని 1824కు ముందు నిర్మించారు. భవనాల నిర్మాణంలో రాజస్తానీ, మొఘుల్‌, యూరోపియన్‌ కళలు ఉట్టిపడతాయి. వీటిలో శేష్‌మహల్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

జమ్ము :
మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు అమర్‌మహల్‌ ప్యాలెస్‌ మ్యూజియం, రామ్‌నగర్‌, టెలిఫోన్‌:5676:
పహరి పెయింటింగ్‌లతో పాటు జమ్ము కాశ్మీర్‌ను ఏలిన రాజుల వర్ణ చిత్రాలను ఈ మ్మూజియంలో పొందుపరిచారు.

కాట్రా: త్రికూట పర్వతగిరులపై కొలువై ఉన్న వైష్ణోదేవిని దర్శించుకునేందుకు వెళ్ళే భక్తులకు జమ్ము దాటాక తారసపడే చిన్నపట్టణమిది. జమ్ముకు 50 కి.మీ దూరంలో ఉంది కాట్రా పట్టణం. ఏటా వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే నాలుగు లక్షల మంది భక్తులు ఈ పట్టణం మీదుగానే వెలుతుంటారు. యాత్రికులు బస చేసేందుకు ప్రైవేటు హోటళ్ళు, టూరిస్టు బంగ్లాలు ఇక్కడ ఉన్నాయి.

కుద్‌: జమ్ము కాశ్మీర్‌ ప్రధాన రహదారిపై సముద్ర మట్టానికి 1738 మీటర్ల ఎత్తున ఉన్న చక్కటి రిసార్ట్ ఇది.

పాట్నిటాప్‌: ఎత్తైన పర్వతంపై రూపొందించిన రిసార్ట్ ఇది. కాశ్మీర్‌ అందాలను తనివితీరా పరికించాలంటే ఈ రిసార్ట్‌ను సందర్శించాలిందే. చలికాలంలో ఈ రిసార్ట్ చుట్టుపక్కల పర్వతాలు, ప్రాంతాలు అన్నీ తెల్లటి మంచుతో కప్పబడిపోతాయి. స్కీయింగ్‌ లాంటి క్రీడలకు ఇది అనువైన ప్రాంతం.

సనసర్‌: పాట్నిటాప్‌కు 17 కి.మీ దూరంలో ఉన్న పచ్చికబయలు ఇది. దీనిని గోల్ఫ్ కోర్స్‌గా తీర్చిదిద్దుతున్నారు.

సుధ్‌మహదేవ్‌: పాట్నిటాప్‌కు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమిది. జులై-ఆగస్టు నెలల్లో పౌర్ణమి రోజుల్లో ఈ క్షేత్రాన్ని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. మహాశివుడికి చెందిన త్రిశూలం, దండంలకు పూజలు జరుపుతారు. సుధ్‌మహదేవ్‌ క్షేత్రంనుంచి కొండలమీదుగా కిందకు దుమికే దేవాక్‌ జలపాతం యాత్రికులను ఎంతో ఆకర్షిస్తుంది.

శివకోరి: జమ్ముకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది శివకోరి. ఇక్కడి గుహలో సహజసిద్ధంగా వెలసిన శివలింగం ఎంతో మహిమ గలదిగా భక్తులు భావిస్తారు. వైష్ణోదేవి ఆలయం తర్వాత భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేది శివకోరికే. శివరాత్రినాడు ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ నిర్వహిస్తారు.

డేరా బాబా బందా: జమ్ముకు 75 కి.మీ దూరంలో ఉన్న హిందు-సిక్కుల పర్యాటక స్థలమిది. గురుగోవింద్‌ సింగ్‌కు సన్నిహితుడైన బాబా బంద బైరాగీ చీనాబ్‌ నది ఒడ్డున గురుద్వారా నిర్మించి, తన చివరి రోజులను అక్కడే గడిపాడు.

పుర్‌మందల్‌: పఠాన్‌ కోటకు వెళ్ళే దారిలో ఉన్న పుర్‌మందల్‌- కొన్ని ఆలయాల సమూహం. ప్రజలు ఛోటా కాశీగా పిలుస్తుంటారు. అంతర్వాహినిగా ప్రవహించే దేవకి నది ఒడ్డున నిర్మించిన ఉమాపతి ఆలయం వీటిలో ప్రధానమైనది. జమ్ము నుంచి పుర్‌మందల్‌కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

జజ్జర్‌ కోట్లి: శ్రీనగర్‌కు వెళ్ళే జాతీయ రహదారిపై జజ్జర్‌ నది ఒడ్డున నిర్మించిన టూరిస్ట్ కాంప్లెక్సెనే జజ్జర్‌ కోట్లీ అంటారు. స్వచ్ఛమైన, చల్లటి జజ్జర్‌ నది నీళ్ళు ఎందరో యాత్రికులకు సేదతీరుస్తాయి.