కాంగ్రెస్- డీఎంకే సంబంధాలు బలంగా ఉన్నాయి

Phani|
తమిళనాడుతో అధికార డీఎంకే పార్టీతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్- డీఎంకే మధ్య విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రెండు పార్టీల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేతో తమ పార్టీకి బలమైన సంబంధాలు ఉన్నాయని ఈ యువనేత ఉద్ఘాటించారు. ఎం.కరుణానిధిని మరోసారి కలుసుకోకుండానే చెన్నై నుంచి వెనక్కు వెళుతుండటంపై వ్యక్తమవుతున్న పలు ఊహాగానాలను కూడా రాహుల్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు.

యువజన కాంగ్రెస్ వ్యవహారాల పని చూసేందుకు ఇక్కడకు వచ్చాను. గతంలోనూ వివిధ కార్యక్రమాల కోసం మూడు, నాలుగు సార్లు తమిళనాడులో పర్యటించాను. ఈ పర్యటనల్లో కరుణానిధిని కలుసుకోకపోవడం వెనుక ఎటువంటి ఉద్దేశం లేదు. ఆయనెంటే నాకెంతో అభిమానం, గౌరవం ఉన్నాయి.

తాను కరుణానిధిని కలుసుకోకపోవడం వెనుక ఊహించుకోవడానికి ఎటువంటి అంశం లేదు. కరుణానిధి నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనంటే తనకెంతో గౌరవం కూడా ఉందని రాహుల్ ఈ సందర్భంగా చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్- డీఎంకే బంధం కొనసాగుతుందని, ఇప్పటికీ కాంగ్రెస్ కీలక భాగస్వాముల్లో డీఎంకే కూడా ఒకటని రాహుల్ తెలిపారు.


దీనిపై మరింత చదవండి :