దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం రికార్డు

PNR| Last Modified మంగళవారం, 4 ఆగస్టు 2009 (10:59 IST)
దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. హెచ్1ఎన్1 వ్యాధి లక్షణాలతో బాధపడుతూ వచ్చిన 14 సంవత్సరాల పూణెకు చెందిన బాలిక రిషా షేక్ సోమవారం మృత్యువాత పడింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల, చికిత్సలో అలసత్వం ప్రదర్శించడంతో ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. గత నెల 29వ తేదీన పూణెలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆ చిన్నారికి వ్యాధి తీవ్రం కావడంతో సోమవారం సాయంత్రం కన్నుమూసింది.

రిషాషేక్ తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి వచ్చింది. స్వదేశానికి రాగానే ఆమెలో స్వైన్ ఫ్లూ రోగ లక్షణాలు కనిపించడంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే, ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు చేరుకుంది.

ఇదిలావుండగా, పూణెలో స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య సెంచరీదాటింది. రియా మరణంతో కేంద్ర ఆరోగ్య శాఖ మేల్కొంది. పూణెలోని ఏడు పాఠశాలలను మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించవద్దని పేర్కొంది.

అంతేకాకుండా, దగ్గు, జలుబు, గొంతునొప్పి, తుమ్ములు, జ్వరం వంటి లక్షణాలు కనిపించే చిన్నారులకు వారం నుంచి పది రోజుల పాటు సెలవులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ ఆదేశించారు. ఇలాంటి చిన్నారులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం చేయించాలని ఆయన కోరారు.


దీనిపై మరింత చదవండి :