బెంగాల్‌లో ఘోరం : స్కూలు వ్యానును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ముర్షిదాబాద్‌లో పాఠశాల వ్యాన్‌ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద వ్యాన్ పట్టాలు దాటుతుండగా.. నిమ్‌తీతా - కటవా రైలు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, అందులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పట్టాలపై వ్యాన్ నుజ్జునుజ్జు అయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు 10 మంది సభ్యుల బృందం ఘటనా స్థలానికి వెళ్లిందని తూర్పు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో లెవల్ క్రాసింగ్ గేట్ తెరిచి ఉండటంతో.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న గేట్‌మ్యాన్, సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు.
