3 భవనాలు, ఒక కారు, 3 ఆటోలు వున్నా రోడ్డుపై భిక్షాటన చేస్తున్నాడు
మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భిక్షాటన రహిత ఇండోర్ నగరంలో భాగంగా యాచకులు కనబడితే వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ఇందులో భాగంగా ఇండోర్ వీధుల్లో మంగీలాల్ అనే ఓ భిక్షగాడిని చూసి అతడి గురించి వివరాలు ఆరా తీసారు. ఆ వివరాలు తెలుసుకుని అధికారులు షాక్ తిన్నారు.
ఎందుకంటే.. అతడికి 3 భవనాలు, ఒక కారు, 3 ఆటోలు వున్నాయి. ప్రతి నెలా వేలల్లో అద్దె వస్తోంది. అంతేకాదు, ఇండోర్ నగరంలోని సరాఫా బజారులో అతడు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అవసరమైనవారికి వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడు. ఇక ఖాళీ సమయం దొరికితే చాలు ఇండోర్ నగర వీధుల్లో యాచన చేసేందుకు బయలుదేరుతాడు. అలా రోజుకి రూ. 400 నుంచి రూ. 500 వరకూ ఆర్జిస్తున్నాడు. ఈ కోటీశ్వరుడైన భిక్షగాడి వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.