పోలీసు నన్ను మోసం చేసి వేరొకర్ని పెళ్లాడుతున్నాడు: ప్రధానికి వీడియో షేర్ చేసి యువతి సూసైడ్
ఆగ్రాకు చెందిన ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కి తన ఆవేదనను వీడియో ద్వారా చెప్పుకుని అనంతరం ఆత్మహత్య చేసుకున్నది. తన సమస్యను సోషల్ మీడియా ద్వారా ప్రధానికి, యూపి సీఎంకి ట్యాగ్ చేస్తూ వీడియోను షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. బాధిత మహిళ వీడియోలో వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్గంజ్ జిల్లాకు చెందిన మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈమెకి ఇంతకుముందే పెళ్లయి విడాకులు తీసుకున్నది. ఈ క్రమంలో తాజ్ గంజ్ పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా పనిచేస్తున్న గౌతమ్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఇద్దరూ గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతడితో కలిసి వుంటోంది.
ఐతే ఇటీవల అతడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఇంట్లో పెద్దలు అంగీకరించడంలేదనీ, తనకు వేరే అమ్మాయిని చూసారని, ఆమెను వివాహమాడుతానంటూ చెప్పాడు. దాంతో మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లింది. ఐతే వారు తమ చేతుల్లో ఏమీ లేదనీ, ఇరువురూ ఇష్టపడి సహజీవనం చేసారు కనుక ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేసారు.
కనీసం గౌతమ్ తల్లిదండ్రులైనా న్యాయం చేస్తారని వెళితే వారు కూడా తనను మోసం చేసారంటూ బాధిత మహిళ వీడియోలో ఆరోపించింది. తను బ్రతికి వుండగా గౌతమ్‌ను ఏమీ చేయలేకపోతున్నాననీ, అందుకే చనిపోయిన తర్వాత అయినా మరో మహిళ మోసపోకూడదని ఈ వీడియోను పెడుతున్నట్లు వెల్లడించింది. వీడియోను షేర్ చేసిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కానిస్టేబుల్ గౌతమ్ ను అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.