సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...
మధ్యప్రదేశ్ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ వైఫల్యానికి అద్దం పట్టే ఓ దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. చేతికి సెలైన్ డ్రిప్ తగిలించుకుని, సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని ఓ వ్యక్తి మార్కెట్లో తిరుగుతున్న దృశ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శివపురి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అక్కడి ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శివపురి జిల్లాలోని సిర్సౌద్ గ్రామంలో ఓ వ్యక్తి సెలైన్‌తో వీధుల్లో నడుస్తూ కనిపించాడు. ఓ నకిలీ డాక్టర్ (క్వాక్) అతడికి చికిత్స చేసి, సెలైన్ పెట్టి అలా గాలికి వదిలేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇదే జిల్లా ఆసుపత్రి నుంచి ఓ పసికందు అపహరణకు గురైన ఘటన మరువక ముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ ఘటనపై జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ వో) డాక్టర్ సంజయ్ రిషేశ్వర్ స్పందించారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. "పూర్తి విచారణ జరపకుండా ఏమీ చెప్పలేం. ఒకవేళ రోగిని నిజంగానే అలా వదిలేసినట్లు తేలితే అది తీవ్రమైన నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ప్రైవేట్ క్లినిక్‌లో ఇది జరిగి ఉంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఆయన వివరించారు.