గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జనవరి 2026 (14:34 IST)

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

vijay
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు కలిసి జట్టుగా ఏర్పడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీని ఎన్డీయే కూటమిలోకి చేర్చుకునేందుకు అన్నాడీఎంకే నేతలతో పాటు ఆ కూటమి నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయన చిత్రానికి సమస్యలు ఎదురయ్యాయి. 
 
విజయ్‌ పార్టీని ఎన్డీయేలోకి బలవంతంగా చేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఆయన నటించిన 'జన నాయగన్‌' చిత్రానికి సకాలంలో సెన్సార్‌ సర్టిఫికెట్‌ లభించకుండా కేంద్రం అడ్డుపడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పొత్తుపై తమిళగ వెట్రి కళగం స్పందించింది. 
 
రాజకీయంగా తమను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్డీఏతో జట్టు కట్టే ప్రసక్తే లేదని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ స్పష్టంచేశారు. టీవీకేను కూల్చడానికి ఎన్ని కుట్రలు పన్నినా తమ పార్టీ సిద్ధాంత వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. టీవీకేకు భాజపా సిద్ధాంత శత్రువు అయితే డీఎంకే రాజకీయ శత్రువని అన్నారు.
 
'జన నాయగన్‌' సినిమా వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ స్పందనను స్వాగతిస్తున్నట్లు నిర్మల్ కుమార్ తెలిపారు. దీనిని తమ పార్టీకి కాంగ్రెస్‌ ఇస్తున్న స్నేహపూర్వక మద్దతుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆ పార్టీతో పొత్తు విషయంపై తమ పార్టీ అధినేత విజయ్‌ మాత్రమే నిర్ణయం తీసుకుంటారన్నారు. 
 
మరోవైపు కరూర్‌ జిల్లా తొక్కిసలాట దుర్ఘటన వ్యవహారంలోనూ విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేయడంతో ఆయనను ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించడానికి భాజపా యత్నిస్తోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.