కోలీవుడ్‌లో కలకలం.. డ్రగ్స్ కేసులో నటి అంజు కృష్ణ అరెస్టు
తమిళ చిత్రసీమలో కలకలం చెలరేగింది. డ్రగ్స్ కేసులో తమిళ, మలయాళ నటి అంజు కృష్ణను అరెస్టు చేశారు. ఇది ఇండస్ట్రీలో కలకలం రేపింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిటీ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో చెన్నై నగర పోలీసులు భారీ డ్రగ్స్ నెట్ వర్క్‌ను ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ నటి అంజుకృష్ణ, తమిళ కో డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అంజుకృష్ణ, వినీ నివేత, కార్తిక్ రాజు, యశ్వంత్, శ్రీరామ్, అల్విబిన్షా, వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నట్టు ఆధికారులు వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి ఆరు గ్రాముల మెతాంఫేటమైన్, ఏడు గ్రాముల ఓజీ గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, ఎల్ఎస్‌డీ స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తొమ్మిది మొబైల్ ఫోన్లు, ఒక కారును సైతం సీజ్ చేశారు.
అరెస్టు చేసిన నిందితులందరినీ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. కాగా, కొన్ని నెలల క్రితం హీరో కోలీవుడ్ హీరో శ్రీరామ్, మరో అసిస్టెంట్ డైరెక్టర్‌ను చెన్నై నుంగంబాక్కం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.