1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. After 45 years on the run, wheat theft worth Rs 100 in 1980 lands MP man in jail

45 యేళ్ల క్రితం చోరీ కేసులో 65 యేళ్ల వృద్ధుడి అరెస్టు

arrest
అపుడెపుడో 45 యేళ్ల క్రితం జరిగిన ఓ చోరీ కేసులో 65 యేళ్ల వృద్ధుడిని మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కేవలం వంద రూపాయల విలువైన గోధుమలను దొంగిలించిన కేసులో పోలీసులు దశాబ్దాలబాటు విచారణ జరిపి చివరకు ఓ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. 1980లో జరిగిన ఈ సంఘటనలో ఇన్నేళ్ల పాటు పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. 
 
1980లో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా బల్కావాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సలీం (అప్పటి వయసు 20) మరో ఆరుగురితో కలిసి పొలంలోకి చొరబడి రూ.100 విలువైన గోధుమలను దొంగిలించాడు. ఆ రోజుల్లో క్వింటాల్ గోధుమల ధర సుమారు రూ.115 ఉండేది. ఈ నేరం చేసిన వెంటనే సలీం తన కుటుంబంతో కలిసి గ్రామాన్ని విడిచి పక్కనే ఉన్న ధార్ జిల్లాకు పారిపోయాడు.
 
అక్కడ బాగ్ ప్రాంతంలో ఓ చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు. తన పాత కేసు గురించి అందరూ మర్చిపోయి ఉంటారని, ఇక తనను ఎవరూ పట్టుకోలేరని భావించాడు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పెండింగులో ఉన్న కేసులను పరిష్కరించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. పాత నిందితుల జాబితాను పరిశీలిస్తున్నప్పుడు సలీం ఆచూకీ గురించి పోలీసులకు కీలక సమాచారం అందింది.
 
ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ధార్ జిల్లాలో నివసిస్తున్న సలీంను శనివారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేవలం వంద రూపాయల విలువైన చిన్న దొంగతనానికి 45 ఏళ్ల తర్వాత అరెస్టు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాలం గడిచినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనడానికి ఈ ఘటనే నిదర్శనం. 
తర్వాతి కథనం
బీజేపీ నేత అరాచకం... రోడ్డుపై మహిళను కర్రతో చావబాదాడు (వీడియో)