AI Impact Summit 2026, ఢిల్లీ లగ్జరీ హోటల్‌లో ఒక్కరోజుకి రూ. 25 లక్షలు
AI Impact Summit 2026, న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇప్పటికే ఢిల్లీ ఆతిథ్య రంగంపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. లగ్జరీ హోటల్లో బస ఖర్చులు ఇప్పటివరకు కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకున్నాయి. ఆకాశమే హద్దుగా రోజురోజుకీ వాటి అద్దె దూసుకుపోతున్నాయి. ఈ నెల 16 నుంచి 20 వరకూ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. దాదాపు అన్ని ప్రధాన AI కంపెనీల CEOలతో సహా 100 మందికి పైగా ప్రపంచ టెక్ నాయకులు దీనికి హాజరవుతారు. వారిలో Open AI CEO సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ డీప్‌మైండ్ CEO డెమిస్ హస్సాబిస్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్, ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ, మిస్ట్రాల్ AI CEO ఆర్థర్ మెన్ష్ ఉన్నారు.
వీరి రాకతో ఢిల్లీలోని లగ్జరీ హోటళ్ల అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ప్రీమియం 5-స్టార్ లగ్జరీ హోటల్ అయిన ఒబెరాయ్‌లోని లగ్జరీ సూట్‌లో 5 రోజుల బసకు రూ. 1.18 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. రోజుకి కనీసం రూ. 25 లక్షలకు తగ్గకుండా ఖర్చు అవుతుందట. తాజ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 10న రూ. 28,000కి లభించే ప్రాథమిక గది ధర ఫిబ్రవరి 17న రూ. 1.30 లక్షలు చూపిస్తోంది.
AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, ప్రముఖులు, సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్‌లు, లగ్జరీ సూట్‌లకు ఫైవ్ స్టార్ హోటళ్లు దాదాపు రూ. 25 నుండి 30 లక్షలు వసూలు చేస్తాయి. ఐదు రోజులకు అలాంటి గదిని బుక్ చేసుకుంటే, కనీస ధర లేదా అధిక రేట్లకు పరిమితి విధించే చట్టం లేనందున ధర స్వయంచాలకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.