బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్
ఢిల్లీ విమానాశ్రయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ఎయిరిండియా సంస్థకు చెందిన విమానం ఇంజిన్ బ్యాగేజీ కంటెయినర్‌ను లాగేసుకుంది. దీంతో ఆ ఇంజిన్ దెబ్బతింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
గురువారం ఉదయం ఎయిరిండియా విమానం ఒకటి ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు టేకాఫ్ తీసుకుంది. కానీ, ఇరాన్ గగనతలం మూసివేతతో కాసేపటికే వెనక్కి తిరిగొచ్చింది. పార్కింగ్ సమయంలో పొగమంచు విపరీతంగా ఉండటంతో బ్యాగేజీ కంటెయినర్ కనిపించలేదు. దీంతో ఇంజిన్ ఆ కంటెయినర్‌ను లాగేసుకుంది. ఈ ఘటనలో ఇంజిన్ దెబ్బతిన్నట్లు విమానయాన సంస్థ ధ్రువీకరించింది.
ఆ సమయంలో విమానం పార్కింగ్ స్థలంలో ఉందని, అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు, అవసరమైన మరమ్మతుల కోసం విమానాన్ని ప్రస్తుతం నిలిపివేసినట్లు చెప్పింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, రీఫండ్‌లు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది.