1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. All for a train seat in Mumbai: Woman uses pepper spray; 3 men hurt in another fight

ముంబై లోకల్ ట్రైన్‌లో సీట్ల కోసం ఘర్షణ - ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే ప్రయోగం

Pepper Spray
దేశ వాణిజ్య రాజధాని ముంబై లోకల్ రైలులో సీట్ల కోసం తలెత్తిన స్వల్ప వివాదం చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా బోగీలోని ఫస్ట్ క్లాస్ కోచ్ ఓ మహిళ తోటి ప్రయాణికులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించడంతో బోగీలో కలకలం రేగింది. గురువారం ఉదయం సెంట్రల్ రైల్వేకు చెందిన ఫాస్ట్ లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనప్పటికీ, ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.
 
కల్యాణ్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) వెళుతున్న లోకల్ రైలులో ఉదయం 8:33 గంటల సమయంలో ఈ గొడవ జరిగింది. డోంబివిలి స్టేషన్లో రైలెక్కిన నలుగురు మహిళలు లేడీస్ కోచ్ ఆసీనులయ్యారు. రైలు కల్యాణ్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ ప్లాట్‌ఫామ్‌పై క్యూలో ఉన్న మరికొందరు మహిళా ప్రయాణికులు లోపలికి ప్రవేశించారు. అయితే, అప్పటికే సీట్లన్నీ నిండి ఉండటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం కాస్తా తోపులాటకు దారితీసింది.
 
ఈ క్రమంలో డోంబిలి బృందానికి చెందిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి పెప్పర్ స్ప్రే తీసి, కల్యాణ్ ప్రయాణికులపై ప్రయోగించింది. దీంతో బోగీలోని ప్రయాణికులు తీవ్రంగా దగ్గుతూ ఇబ్బందికి గురయ్యారు. ఈ గందరగోళం మధ్యే రైలు సీఎస్ఎంటీ వరకు ప్రయాణించింది. ప్రయాణికులు రైల్వే హెల్ప్ లైన్ 1512కు సమాచారం అందించడంతో, రైలు గమ్యస్థానానికి చేరుకోగానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అధికారులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారించారు.
 
తొలుత ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నప్పటికీ, పోలీస్ స్టేషన్‌లో జరిగిన చర్చల అనంతరం రాజీకి రావడంతో ఫిర్యాదులను ఉపసంహరించుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనపై ఓ ప్రయాణికుల సంఘం ప్రతినిధి స్పందిస్తూ, ఆత్మరక్షణ వంటి అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సిన పెప్పర్ స్ప్రేను సీట్ల గొడవలకు ఉపయోగించడం శోచనీయమని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
తిరుమల గిరులు కిటకిట.. గోగర్భం డ్యామ్ వరకు భక్తుల బారులు